Ginning Millers Strike: బుధవారం నుంచి యథాతథంగా పత్తికొనుగోళ్లు
జిన్నింగ్ మిల్లర్లతో మంత్రి తుమ్మల చర్చలు సఫలం
త్వరలోనే అన్ని జిల్లాల్లోని జిన్నింగ్ మిల్లులు ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తాం
రైతులు ప్రతిపక్ష నాయకుల ఉచ్చులో పడవద్దు
కేంద్రంతో, సీసీఐతో మిల్లర్లు పోరాడాలి
రైతులకు ఇబ్బందులు సృష్టించడం సరికాదన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: పత్తి కొనుగోళ్లు బుధవారం నుంచి యథాతథంగా ప్రారంభమవుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై (Ginning Millers Strike) సీసీఐ ఎండీ లలిత్ కుమార్ గుప్తా, జిన్నింగ్ మిల్లర్ల అసోషియేషన్‌తో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై చర్చించారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రైతుల సమస్యలను రెట్టింపు చేసేలా జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సమ్మెకు దిగడం సమంజసం కాదన్నారు. జిన్నింగ్ మిల్లుల సమస్యలపై సమ్మె లాంటి విధానంతో కాకుండా సామరస్యంగా కేంద్రంతో పోరాడుదామని, అందుకోసం ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.
Read Also- BJP Flex Dispute: బీజేపీలో ముదిరిన ‘పవర్ వార్’.. ఈటల అడ్డాలో బండి సంజయ్ వర్గం ఏం చేస్తోందంటే?
జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై నివేదిక తయారుచేసి కేంద్ర జౌళిశాఖ అధికారులకు పంపాల్సిందిగా వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్రమోహన్ ని మంత్రి ఆదేశించారు. జిన్నింగ్ మిల్లుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తుందన్నారు. తక్షణమే అన్ని జిల్లాలో నోటిఫై చేసిన అన్ని జిన్నింగ్ మిల్లులను ప్రారంభించాలని కోరారు. జిన్నింగ్ మిల్లుల విషయంలో కూడా కేంద్రమే నిర్ణయం తీసుకుంటామని, జిన్నింగ్ మిల్లులను తామే కేటాయిస్తామని, కేటాయించిన జిన్నింగ్ మిల్లులను ఎల్1 నుండి ఎల్ 12 లుగా విభజించి, జిన్నింగ్ మిల్లర్లను కూడా ఇబ్బందులకు గురిచేసిందన్నారు. జిన్నింగ్ మిల్లర్లకు కేంద్ర తీసుకునే నిర్ణయాలపై అసంతృప్తి ఉంటే, వారు కేంద్రంతో పోరాడాలని కానీ రైతులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించకూడదని కోరారు.
Read Also- Tech Services Outage: షాకింగ్.. ఒకేసారి ఎక్స్, చాట్‌జీపీటీ, క్లౌడ్‌ఫ్లేర్ సర్వీసులు డౌన్
రాష్ట్ర ప్రభుత్వానికి పత్తి కొనుగోళ్లలో ఎలాంటి సంబంధం లేకున్నా, రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో జిన్నింగ్ మిల్లుర్ల సమస్యలపై చర్చించామన్నారు. ఉనికిని చాటుకోవాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ నాయకులు, లేని గొప్పలు చెప్పుకుంటూ రైతులను, తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. పత్తి కొనుగోళ్లలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకున్నా, తెలంగాణ రైతులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశ్యంతో, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూనే ఉన్నామని, కేంద్ర మంత్రులను, అధికారులకు పదేపదే విజ్ఙప్తులు చేశామని తెలిపారు. రైతుల విషయంలో మాకు మూడోవ్యక్తి జోక్యం అవసరం లేదని, రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని ఉద్ఘాటించారు. రైతులు ప్రతిపక్ష నాయకుల ఉచ్చులో పడవద్దు అని విజ్ఞప్తి చేశారు.
