Harish Rao: పత్తిరైతుల గురించి ప్రతిపక్షం కదిలినంకనే ప్రభుత్వానికి చలనం వచ్చిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. మంగళవారం మహబూబాబాద్ కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఆయన పర్యటించారు. మార్కెట్ లోని పత్తి, మొక్కజొన్న, వరి ధాన్యాలను సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధరతో పాటు రూ. 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. మార్కెట్ లో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు సరైన వసతులు కనిపించడం లేదని విమర్శించారు.
‘వడ్డన్నీ దళారుల పాలు’
యూరియా బస్తా దొరక్కపోవడంతో ఒక బస్తా రూ.1500 చొప్పున మూడు బస్తాలు కొనుక్కున్నట్లు ఓ రైతు చెప్పారని హరీశ్ రావు పేర్కొన్నారు. వరంగల్ తర్వాత అతిపెద్ద మార్కెట్ కేసముద్రం మార్కెట్ అని.. ఇవాల్టికి కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ప్రారంభం కాలేదని మండిపడ్డారు. ఇక్కడ వడ్లన్నీ దళారుల పాలు అవుతున్నాయని వాపోయారు. ఇక్కడకు వస్తే రైతుల కన్నీళ్లు, వాళ్ల కష్టాలు మీకు అర్థమవుతాయన్నారు. రైతులకు రేవంత్ రెడ్డి పై నమ్మకం లేక దళారులకు అమ్ముకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఇంకా 2000 వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని మండిపడ్డారు. కేసముద్రం మార్కెట్ యార్డ్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
‘రూ.1100 కోట్లు విడుదల చేయాలి’
గత యాసంగికి సంబంధించిన బోనస్ రూ.1100 కోట్లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హడావిడిగా రేపటి నుంచి పత్తి కొంటామని ప్రకటించారని హరీశ్ రావు గుర్తుచేశారు. ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కదిలితే తప్ప అధికార పార్టీలో కదలిక రాలేదంటూ విమర్శించారు. బీఆర్ఎస్ కొట్లాడింది కాబట్టే జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చారన్నారు.
Also Read: Cyber Crime: రిటైర్డ్ ప్రొఫెసర్‌ను.. బురుడికొట్టించిన సైబర్ కేటుగాళ్లు.. రూ.78 లక్షలు లూటీ
వరంగల్ డిక్షరేషన్ ఏమైంది?
మహబూబాబాద్ లో కాంగ్రెస్ నాయకులు ఇసుక మాఫియాకి తెగబడ్డారని హరీశ్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ. 1000 ఉన్న టన్ను ఇసుక.. ఇవాళ రూ.3 వేలకు చేరిందన్నారు. ‘అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటకు ఎకరానికి రూ. 10,000 ఇస్తానని వరంగల్ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చెప్పారు. పంటల బీమా అమలు చేస్తామన్న వరంగల్ డిక్లరేషన్ లో హామీ ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమైంది రేవంత్ రెడ్డి?’ అని హరీశ్ రావు ప్రశ్నించారు. అకాల వర్షాల కారణంగా పంట దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్ట పరిహారం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మల్యాలలో వెంటనే హార్టికల్చర్ కాలేజీ పనులను ప్రారంభించాలని హరీశ్ రావు పట్టుబట్టారు.
