Pawan Kalyan: పైరసీ ముఠా సూత్రధారి ఇమ్మడి రవి (Immadi Ravi) అరెస్ట్‌తో తెలుగు చిత్ర పరిశ్రమే (Telugu Film Industry) కాదు.. యావత్ సినీ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. ఎన్ని కోట్లు పెట్టి సినిమాలు నిర్మించే నిర్మాతలకు పైరసీ రూపంలో బోలెడంత నష్టం వాటిల్లుతున్న విషయం తెలియంది కాదు. మరీ ముఖ్యంగా ఐబొమ్మ పేరిట, హెచ్‌డి ప్రింట్‌లను సినిమా విడుదలైన వారం రోజుల్లోపే వెబ్ సైట్‌లోకి అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, పోలీసులకు కూడా సవాల్ విసిరిన ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని పోలీసులు చాలా తెలివిగా అరెస్ట్ చేసి, ఆయన దగ్గర ఉన్న సమాచారంతో.. పూర్తిగా ఆ సైట్‌ని అతనితోనూ మూసి వేయించారు. దీంతో సజ్జనార్ అండ్ టీమ్‌పై సినిమా పరిశ్రమకు చెందిన వారంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులను అభినందించేందుకు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, రాజమౌళి వంటి వారంతా మీడియా సమావేశం నిర్వహించి, సజ్జనార్ అండ్ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar)కు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభినందనలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో..
Also Read- Dhandoraa Teaser: హైదరాబాద్, అమెరికా.. యాడికైనా బో.. చస్తే ఇడీకే తేవాలె!
స్వాగతించదగ్గ పరిణామం
‘‘డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను.. విడుదలైన రోజునే ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది. సినిమా విడుదలే ఒక మహా యజ్ఞంగా మారిపోయిన ఈ తరుణంలో.. పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శకనిర్మాతలకు అసలు సాధ్యం కావడం లేదు. పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పమ్ వెబ్ సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, అతనితోనే వాటిని మూయించివేయడం నిజంగా స్వాగతించదగ్గ పరిణామం. పోలీసులకు సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు బృందం చేసిన ఈ ఆపరేషన్ విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉంది.
Also Read- Family Politics: మొన్న షర్మిల.. నిన్న కవిత.. నేడు రోహిణి.. పార్టీల్లో ఆడబిడ్డలకే గెంటివేతలు!
అభినందనలు తెలియచేస్తున్నా
ఈ ఆపరేషన్‌లో భాగమైన పోలీసులకు, సిటీ కమిషనర్ వి.సి.సజ్జనార్‌కు అభినందనలు తెలియచేస్తున్నాను. బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్ లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, వాటి వల్ల ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా చితికిపోతున్నారో తెలియజేస్తూ.. వారిని చైతన్య పరుస్తూ వస్తున్నారు. సజ్జనార్‌తో ఓ సందర్భంలో సమావేశమైనప్పుడు పొంజీ స్కీమ్స్ మూలంగా ప్రజలు ఆర్థికంగా ఏ విధంగా మోసానికి గురై నష్టపోతున్నారో నాకు వివరించారు. అలాగే బెట్టింగ్ యాప్స్‌ను నియంత్రించేందుకు సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకువచ్చింది. ఆయన నేతృత్వంలో చేపట్టే చర్యలు కచ్చితంగా తెలుగు సినిమాకే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయి’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
