Teachers Unions: టెట్ నుంచి ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ విద్యావిధానం రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ వంటి అంశాలపై ఎస్టీఎఫ్‌ఐ ఆధ్వర్యంలో 2026 జనవరి 29న ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీఎన్ భార్తి, చావ రవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర పాలకులు కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ విధానాలను అమలు చేస్తూ ప్రభుత్వ విద్యను ధ్వంసం చేస్తున్నారని, పేదలను చదువుకు దూరం చేస్తున్నారని ఎస్టీఎఫ్‌ఐ నాయకులు విమర్శించారు. అశాస్త్రీయ అంశాలు ఉన్న జాతీయ విద్యావిధానం 2020ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ బాధ్యత ప్రభుత్వమే చూడాలని, కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలను తక్షణమే మానుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Also Read: Delhi Blast Probe: బాంబు పేలుడుకు ముందు ఉమర్ ఎక్కడ నివసించాడో కనిపెట్టిన ఇన్వెస్టిగేషన్ అధికారులు
పునరుద్ధరణ తప్పనిసరి
2004 నుంచి అమలులో ఉన్న నూతన పెన్షన్ విధానం కార్పొరేట్లకు లాభం తప్ప ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రయోజనం లేదని ఎస్టీఎఫ్‌ఐ నేతలు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్ ఉన్న యూపీఎస్, జీపీఎస్, సీపీఎస్ లాంటి స్కీమ్స్ ఎస్టీఎఫ్‌ఐకి అంగీకారం కావని పేర్కొన్నారు. తక్షణమే పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో నాంపల్లి హిందీ ప్రచారసభ కార్యాలయంలో ఆదివారం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్‌యూపీపీటీ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహ్మద్ అబ్దుల్లా, గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ మాట్లాడుతూ, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ టెట్ తప్పనిసరి అయితే, భాషోపాధ్యాయులకు ప్రత్యేకంగా పేపర్ 3 నిర్వహించాలని కోరారు.
Also Read: Sukma Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
