Lalu Prasad Yadav (imagecredit:AI)
Politics, తెలంగాణ

Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ కుటుంబంలో కలహాలు.. తేజస్వి టీమ్‌పై రోహిణి తీవ్ర ఆరోపణలు..!

Lalu Prasad Yadav: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ ఘోర పరాజయం తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) కుటుంబంలో అంతర్గత సంక్షోభం మరింతగా తీవ్రమైంది. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య మరోసారి తన సోదరుడు తేజస్వి యాదవ్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్న వ్యక్తులపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వారు తనను అవమానించి, ఇంటి నుంచి బయటకు పంపారని, తనను అనాథను చేశారని ఎక్స్ వేదిగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు, కుటుంబాన్ని కూడా వదులుకుంటున్నట్లు ప్రకటించిన మరుసటి రోజు, రోహిణి ‘నిన్న, ఒక కూతురు, సోదరి, వివాహిత, తల్లి అవమానాల పాలైంది. అసభ్యకరమైన తిట్లతో దూషించారు. చెప్పుతో కొట్టడానికి కూడా చేయి ఎత్తారు. నేను నా ఆత్మగౌరవాన్ని, సత్యాన్ని వదులుకోలేదు. కేవలం దీనికోసమే నేను ఈ అవమానాన్ని భరించాల్సి వచ్చింది.
నిస్సహాయతతో, నిన్న కూతురు కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లిదండ్రులు, తోబుట్టువులను వదిలి వచ్చింది. తన పుట్టింటిని వదిలి వెళ్లవలసి వచ్చింది. మీరు ఎప్పటికీ నా మార్గాన్ని అనుసరించవద్దు. ఏ కుటుంబానికి రోహిణీ వంటి కుమార్తె, సోదరి ఉండకూడదని కోరుకుంటున్నా’ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

నాలా తప్పు చేయకండి! 

‘అసెంబ్లీ ఎన్నికల పరాజయానికి బాధ్యత వహించాలని కోరినందుకు నన్ను అవమానించి, ఇంట్లోంచి బయటికి గెంటేశారు. ఆర్జేడీ(RJD) ఓటమికి తేజస్వి యాదవ్ సన్నిహితులు సంజయ్ యాదవ్, రమీజ్ నేమత్ ఖాన్ కారణం. నాకు కుటుంబం అంటూ లేదు. మీరు వెళ్లి సంజయ్, రమీజ్, తేజస్వి యాదవ్‌లను అడగండి. వారే నన్ను కుటుంబం నుంచి బయటకు గెంటేశారు. 2022లో నా తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌(Prsad yadav)కు కిడ్నీ దానం చేసినందుకు గాను, కుటుంబ సభ్యులు కొందరు నాపై అత్యంత పరుష వ్యాఖ్యలు చేశారు. నీ మురికి కిడ్నీని నాన్నకు ట్రాన్స్‌ప్లాంట్ చేయించావు, దాని కోసం కోట్లు తీసుకున్నావని నిందించారు. పెళ్లైన కూతుళ్లు, సోదరీమణులకు ఓ విషయం చెబుతున్నా.. మీ పుట్టింట్లో కుమారుడు లేదా అన్నయ్య ఉంటే పొరబాటున కూడా దేవుడు వంటి మీ తండ్రిని కాపాడొద్దు. మీ అన్నయ్య లేదా ఆయన స్నేహితుడి కిడ్నీని ఇవ్వమని చెప్పండి. మీరు మీ కుటుంబాలను చూసుకోండి. మీ పేరెంట్స్‌ను పట్టించుకోకుండా మీ పిల్లలు, అత్తమామలనే చూసుకోండి. కేవలం మీ గురించే ఆలోచించుకోండి. నేను నా కుటుంబాన్ని, నా ముగ్గురు పిల్లలను చూసుకోలేదు. కిడ్నీ ఇవ్వడానికి నా భర్త, అత్తమామల అనుమతి కూడా తీసుకోలేదు. నా తండ్రిని కాపాడుకొనేందుకే కిడ్నీ ఇచ్చాను. ఇప్పుడు మురికిదానిని అని మాటలు పడుతున్నా. మీరంతా నాలాంటి తప్పు ఎప్పటికీ చేయకూడదు. రోహిణీ వంటి కుమార్తె ఏ ఇంట్లోనూ ఉండకూడదు’ అని రోహిణి మరో భావోద్వేగ పోస్టు చేశారు.

Also Read: New Advanced Bus: 3 కొత్త బస్ టెర్మినల్స్ ఏర్పాటు.. నగరంలో నలువైపులా ఉండేలా ప్లాన్

నన్నంటే భరించా.. 

ఈ కుటుంబ వ్యవహారంపై రోహిణి సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. తన సోదరిని అవమానించడం భరించలేకపోతున్నానని అని పేర్కొన్నారు. ‘ నన్ను ఎన్నో మాటలు అని, నా కుటుంబం నుంచి, పార్టీ నుంచి బయటికి పంపారు. అయినా సహించాను కానీ, రోహిణిపై చెప్పులతో దాడి చేయబోయారని తెలిసినప్పట్నుంచీ నా గుండె రగిలిపోతున్నది. ఆమెకు జరిగిన అవమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భరించలేను. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి రోహిణి తీసుకున్న నిర్ణయం సరైనదే. ఇవన్నీ కనిపించకుండా కొందరు తేజస్వీ కళ్లను కూడా కప్పేస్తున్నారు. వీటన్నింటికీ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకునే ద్రోహులను బిహార్ ప్రజలు ఎప్పటికీ క్షమించరు. ఈ ద్రోహులు తేజస్వి యాదవ్ రాజకీయ నిర్ణయాలపై కూడా ప్రభావం చూపుతున్నారు. నా తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ జోక్యం చేసుకోవాలి’ అని తేజ్ ట్వీట్‌లో వెల్లడించారు.

కుటుంబ వ్యవహారమే 

లాలూ కుటుంబంలో తలెత్తిన తీవ్ర అంతర్గత కలహాలు, రోహిణి ఆచార్య రాజీనామా అంశంపై రాష్ట్రీయ జనతా దళ్ అధికారికంగా స్పందించింది. రోహిణి సంచలన ప్రకటనను పార్టీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ కొట్టిపారేశారు. ఈ వ్యవహారాన్ని కుటుంబ అంతర్గత విషయంగా అభివర్ణించారు. ఈ అంశంపై పార్టీ బహిరంగంగా మాట్లాడదని, ఇది లాలూ, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే సంబంధించినదని ఆయన స్పష్టం చేశారు. ‘రోహిణి ఒక శక్తివంతమైన మహిళ. ఆమె ఒక తల్లిగా, సోదరిగా, కూతురుగా గొప్ప పాత్ర పోషించారు. ఇది పూర్తిగా వారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత అంశం. ఈ విషయంలో పార్టీ తరఫున మాట్లాడటం సరికాదు. ఎన్నికల ఫలితాలు ఇప్పుడే వచ్చాయి. ఫలితాల కారణాలపై సమీక్ష జరగాల్సి ఉంది. రోహిణి విషయం పార్టీ పరిశీలిస్తుంది. ఆ తర్వాతే స్పందిస్తాం’ అని తివారీ స్పష్టం చేశారు.

Also Read: Telangana RTA: ఫ్యాన్సీ నెంబర్లకు రేట్లు ఫిక్స్‌.. ఆర్టీఏ ఆదాయం పెంపునకు కీలక నిర్ణయం!

Just In

01

Viral Video: కూతురికి భోజనం నచ్చలేదని.. ఏకంగా యూనివర్శిటీ ముందే ఫుడ్ స్టాల్ పెట్టేసిన తండ్రి

Dhandoraa Teaser: హైదరాబాద్, అమెరికా.. యాడికైనా బో.. చస్తే ఇడీకే తేవాలె!

Sheikh Hasina: షేక్ హసీనాకు మరణశిక్ష.. ఢాకా కోర్టు సంచలన తీర్పు

Teachers Unions: ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్‌కు ఉపాధ్యాయ సంఘాల పిలుపు.. ఎందుకంటే?

The Girlfriend Collections: బాక్సాఫీస్ వద్ద రష్మిక మూవీ కొత్త రికార్డ్ .. ది గర్ల్‌ఫ్రెండ్ 10 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?