Telangana Cabinet: క్యాబినెట్ విస్తరణపై ఏఐసీసీ మళ్లీ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం సీఎంతో కలిపి రాష్ట్రంలో 16 స్థానాలు భర్తీ కాగా, మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆ రెండు స్థానాలను భర్తీ చేయాల్సిందేనని రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఏఐసీసీ తన స్టడీని మొదలు పెట్టింది. సమీకరణలు, పార్టీ పరిస్థితులను బట్టి అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నది. ప్రధాన రేసులో విజయశాంతితో పాటు రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy)లు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అయితే, వీళ్లిద్దరినీ ఏఐసీసీ(AICC) కోటాలో భర్తీ చేయనున్నట్లు సమాచారం. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఇద్దరి నేతలకు మంత్రి పదవి ఇవ్వాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, కోమటిరెడ్డి(Komati Reddy) ఫ్యామిలీలోనే రెండు మంత్రి పదవులు అవుతున్న నేపథ్యంలో.. ఇద్దరిలో ఒకరు ఛాన్స్ వదులుకోవాలని ఏఐసీసీ కోరుతున్నట్లు తెలిసింది. కానీ మంత్రి స్థానంలో క్యాబినెట్ ర్యాంక్‌తో కార్పొరేషన్ పదవి కేటాయించినున్నట్లు తెలిసింది. అయితే, మంత్రి పదవిని ఇద్దరిలో ఎవరు వదులుకుంటారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. కానీ, రాజగోపాల్ రెడ్డి(Raja Gopall Reddy) మాత్రం 7 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని, 11 మంది ఎమ్మెల్యేలున్న నల్లగొండ(Nalgonda)కు ముగ్గురు మంత్రులు ఉంటే తప్పేమేమిటీ? అనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. దీంతో రాష్ట్ర పార్టీ, ఏఐసీసీ తర్జన భర్జన పడుతున్నది. సీఎం రేవంత్ రెడ్(CM Revanth Reddy)డి క్యాబినెట్ భర్తీ అంశాన్ని హైకమాండ్‌కే వదిలేసినట్లు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
హో మంత్రి..?
విజయశాంతికి మంత్రి పదవి వరిస్తే, హోంశాఖ ఇస్తారనే చర్చ పార్టీలో జరుగుతున్నది. ఏఐసీసీ స్ట్రాటజీలో భాగంగానే ఆమెకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. సోనియా గాంధీతో అతి సన్నిహిత సంబంధాలు కలగడంతో ఆమెకు అనూహ్యంగా ఎమ్మెల్సీతో పాటు త్వరలో మంత్రి పదవీ వరించనున్నదని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి మంత్రి ప్రాతినిథ్యం అవకాశం ఎలా కల్పిస్తారనేది? సస్పెన్స్‌గా మారింది. విజయశాంతిని రంగారెడ్డి కోటా కింద కన్సిడర్ చేస్తారనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి లాంటి సీనియర్ నేత గట్టిగానే ట్రై చేస్తున్నారు. కానీ ఆయన్ను ఎలా కూల్ చేస్తారనేది? త్వరలోనే తేలనున్నది. ఇటీవల మంత్రి బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్‌ను హైదరాబాద్ జిల్లా కింద పరిగణిస్తున్నారు. ఇక ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి కేటాయించాల్సి ఉన్నది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత సీఎంతో కలిపి 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా, రెండో దఫా విస్తరణలో ముగ్గురికి అవకాశం కల్పించారు. తాజాగా మైనార్టీ కోటాలో అజారుద్దీన్‌కు అవకాశం ఇవ్వగా, మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
Also Read: Amberpet Drug Bust: భారీగా గంజాయి డ్రగ్స్ సీజ్.. ఎక్సయిజ్ సిబ్బందిపై కత్తులతో దాడికి యత్నం!
పీసీసీ, బీసీ మంత్రి ఛేంజ్…?
ప్రస్తుత పీసీసీ చీఫ్ ఛేంజ్ అవుతున్నారనే వార్తలు పార్టీలో ఊపందుకున్నాయి. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను క్యాబినెట్‌లో తీసుకొని బీసీ కోటాలో ఉప ముఖ్యమంత్రిని చేయాలని ఏఐసీసీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో నిజామాబాద్ జిల్లాలోనూ మంత్రి పదవి అవకాశం కల్పించినట్లు అవుతుందనేది పార్టీ ఆలోచన. దీంతోనే ఇంత కాలం మంత్రి పదవి కోసం ప్రయత్నించిన సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్‌ను ఇచ్చారని పార్టీలో టాక్. పీసీసీ చీఫ్‌గానే కొనసాగాలని మహేశ్ కుమార్ గౌడ్‌కు ఉన్నప్పటికీ, ఏఐసీసీ ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తానని చెబుతున్నారు. మహేశ్ కుమార్ గౌడ్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోవాలని ఓ మంత్రిని తప్పించాల్సి ఉంటుంది. ఇందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పీసీసీ ఇవ్వాలని పార్టీ ఏఐసీసీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. వీటిపై అతి త్వరలోనే నిర్ణయం జరగనున్నది. ఇక మంత్రుల శాఖల వారీగా రిపోర్ట్ తీసుకున్న ఏఐసీసీ శాఖల మార్పునకు కూడా శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నదనే చర్చ జరుగుతున్నది.
Also Read: Telangana RTA: ఫ్యాన్సీ నెంబర్లకు రేట్లు ఫిక్స్.. ఆర్టీఏ ఆదాయం పెంపునకు కీలక నిర్ణయం!
