Cyberabad Police: మహిళలు, బాలికల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్న పోకిరీల ఆట కట్టిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. ప్రతీరోజు డెకాయ్ ఆపరేషన్లు జరుపుతూ జులాయిలను అదుపులోకి తీసుకుంటున్నారు. హద్దులు దాటి ప్రవర్తించిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. గడిచిన ఒక్క వారంలోనే కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో షీ టీమ్స్ సిబ్బంది 140 డెకాయ్ ఆపరేషన్లు జరిపి మహిళలు, బాలికలను వేధిస్తున్న 87మందిని అన్ని ఆధారాలతో పట్టుకున్నట్టు ఉమెన్, చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ కే.సృజన తెలిపారు. వీరిలో 82మందిపై పెట్టీ కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.
Also Read: Cyberabad Police: హైదరాబాద్ కు ఏమైంది? మరీ ఇంత నిర్లక్ష్యమేల..
ఫిర్యాదులను స్వీకరించి దర్యాప్తు
మిగితా 5గురికి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. 14మంది మహిళల నుంచి ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. చిన్న చిన్న కారణాలతో కాపురాలను నరకం చేసుకున్న 28 జంటలకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు, సీడీఈడబ్ల్యు కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చి వారి సమస్యలు పరిష్కరించినట్టు తెలియచేశారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, షీ టీమ్స్ సిబ్బంది కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు.
మహిళల కోసం అందుబాటులోకి హెల్ప్ లైన్ 181,
దీంట్లో మహిళలకు ఉండే హక్కుల గురించి వివరించామన్నారు. సమస్య ఎదురైతే పోలీసులను ఎలా సంప్రదించాలో కూడా చెప్పామన్నారు. 300మందికి పైగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు చెప్పారు. మహిళల కోసం అందుబాటులోకి తెచ్చిన హెల్ప్ లైన్ 181, పిల్లల కోసం తెచ్చిన 1098, డయల్ 100 ల గురించి వివరించామన్నారు. ఇక, రహదారుల మీద అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న 5గురు ట్రాన్స్ జెండర్లు, 22మంది సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. మూడు పీటా కేసుల్లో 4గురు బాధితులను రక్షించి 8మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు.
