Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన పోలీసు అధికారులు భుజంగరావు, తిరుపతన్నలు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 90 రోజులు గడిచినా చార్జిషీట్ వేయలేదని, కాబట్టి మ్యాండేటరీ బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. పోలీసులు ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేసినా.. మెటీరియల్ ఎవిడెన్స్ సమర్పించలేదనే కారణంతో కోర్టు చార్జిషీట్‌ను వెనక్కి పంపింది. ఈ వ్యవహారంలో భుజంగరావు, తిరుపతన్నల బెయిల్ పిటిషన్ పై కోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. ఈ క్రమంలోనే మంగళవారం కీలక పరిణామం జరిగింది. పోలీసులు ఈ కేసులో ఎవిడెన్స్ మెటీరియల్‌ను కోర్టుకు సమర్పించారు.
మూడు బాక్స్‌లలో ఈ ఆధారాలను కోర్టుకు పోలీసులు సమర్పించారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లు, సీడీ, పెన్ డ్రైవ్‌లు ఇందులో ఉన్నాయి. అన్నిటినీ జతపరుస్తూ పోలీసులు మూడో సారి చార్జిషీటు దాఖలు చేశారు. ఈ ఎవిడెన్స్ నిందితులకు తెలియకుండా రహస్యంగా ఉంచాలని కోర్టును పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. దీంతో భుజంగరావు, తిరుపతన్నల బెయిల్ పిటిషన్ పై విచారణ బుధవారానికి వాయిదా పడింది.