Telangana Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన చారిత్రక విజయం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలతో పాటు రాష్ట్రంలోని అన్ని సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ శ్రేణులు సెలబ్రేషన్స్ నిర్వహించాయి. ముఖ్యంగా గాంధీభవన్ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. గాంధీభవన్ ఎంట్రన్స్ వద్ద పిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ‘రప్పా రప్పా.. 2028లో తగ్గేదేలే 100 సీట్లు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లతో భారీ ప్లకార్డులు, ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు బాణాసంచాలు పేల్చి, స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. ఈ విజయం రేవంత్ రెడ్డి అనుసరించిన వ్యూహాలకు, ఆత్మవిశ్వాసంతో కూడిన పోరాటానికి నిదర్శనమని పార్టీ నేతలు ఉద్ఘాటించారు.
Also Read:Telangana Congress: జూబ్లీహిల్స్‌లో కీలక అస్త్రాలు.. సీఎం ప్రచారంతో కాంగ్రెస్‌లో జోష్
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
కాంగ్రెస్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయం రాష్ట్రంలో ప్రజాభిమానాన్ని ప్రతిబింబిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సమన్వయం, వ్యూహాత్మక ప్రణాళికలు ఈ విజయానికి ప్రధాన కారణం. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన మొదటి ఉప ఎన్నికలోనే పార్టీకి గ్రాండ్ విక్టరీ అందించడం సంతోషంగా ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, పార్టీ ఆఫీస్ బేరర్స్‌తో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, స్పష్టమైన దిశా నిర్దేశంతో గెలుపు దిశగా నడిపించాం. ప్రతీ బూత్, ప్రతీ డివిజన్ స్థాయిలో పర్యవేక్షణ చేపట్టి పోల్ మేనేజ్‌మెంట్‌ను కచ్చితమైన శైలిలో మలిచాం.
మంత్రి సీతక్క
ఈ అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ధన్యవాదాలు. ఇది చారిత్రాత్మక విజయం, చరిత్ర గుర్తుపెట్టుకునే గెలుపు. బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారానికి, అనంతమైన అబద్ధాలకు ప్రజలు చెప్పిన గుణపాఠం ఇది. చింత చచ్చినా పులుపు చావదన్నట్లు బీఆర్‌ఎస్ పాపాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి.
మంత్రి జూపల్లి కృష్ణారావు
ఈ ఎన్నికల ఫలితం బీఆర్‌ఎస్ నాయకులకు చెంపపెట్టులాంటిది. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అన్న కేటీఆర్ ఇప్పుడు తన ముఖాన్ని ఎక్కడ పెట్టుకుంటారు. ఇకనైనా అసత్య ఆరోపణలు మానుకోవాలి.
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి కెప్టెన్‌గా సక్సెస్ అయ్యారు. తమను జూబ్లీహిల్స్‌లో ఒక నాయకుడిగా నడిపించారు. యువకుడిగా ప్రజలు నవీన్ యాదవ్‌ను గెలిపించారు. ఈ గొప్ప అవకాశాన్ని తీసుకొని జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.
టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు ఎంత దుష్ప్రచారం చేసినా, ఓటర్లు ప్రతిపక్షాల కుట్రలను పసిగట్టి, అభివృద్ధికే పట్టం కట్టారు. ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, అభివృద్ధి సమీక్షలు చేస్తూనే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌ను పోరుకు సమాయత్తపరిచి, నవీన్ యాదవ్ గెలుపునకు బాటలు వేశారు.
