Congress Victory: ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడానికి రెఫరెండంగా భావించిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక(Jubilee Hills Assembly by-election)లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడం, ప్రభుత్వానికి ఒక క్లియర్‌కట్ మెజారిటీని ,కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇది కేవలం ఒక స్థానం గెలుపు మాత్రమే కాదని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన, సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి స్పష్టమైన మద్దతు లభించినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు పట్టం కట్టాయని స్పష్టం చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్న ‘ప్రజా పాలన’ విధానానికి ఓటర్లు బలంగా మద్దతు ఇచ్చినట్లైంది.పేద,మధ్య తరగతి ప్రజలు,రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ తీర్పు అద్దం పడుతోంది. అంతేగాక అర్భన్ ఓటర్లను కూడా ప్రభుత్వం క్రమంగా ఆకట్టుకుంటోందనడానికి ఈ ఎన్నికలు నిదర్శనం అని చెప్పవచ్చు.
నగర ప్రణాళికకు మద్దతు..
హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళనతో పాటు ట్రిపుల్ ఆర్(RRR), గోదావరి జలాలను తీసుకువస్తామని కాంగ్రెస్(Congress) చెబుతుంది. అంతేగాక చెరువులు, నాలాలు కబ్జాలు కాకుండా హైడ్రాను తీసుకువచ్చింది. దీంతో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు, ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్(Air Port) లు విస్తరణ, మెట్రో(Mettro) విస్తరణ వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ వైఖరికి నగర ప్రజలు సానుకూలంగా స్పందించినట్లుగా కనిపిస్తోంది. అంతేగాక రెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నాయకత్వంలోని పరిపాలన, శాంతిభద్రతల నిర్వహణ, ప్రభుత్వ విశ్వసనీయతపై విపక్షాలు చేసిన విమర్శలను ప్రజలు తిరస్కరించినట్లుగా ఈ ఫలితం తేటతెల్లం చేయడం గమనార్హం.
Also Read: CM Chandrababu Naidu: అక్కడి ముస్లింలు కోటీశ్వరులు అయ్యారంటే నేనే కారణం: చంద్రబాబు నాయుడు
కాంగ్రెస్ సర్కార్‌లో జోష్..
జూబ్లీహిల్స్ తీర్పుతో కాంగ్రెస్ సర్కార్‌లో జోష్ మరింత పెరిగింది.ఈ విజయం ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ శ్రేణుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ గెలుపును దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం రాబోయే రోజుల్లో మిగిలిన ఆరు గ్యారంటీలు ,అభివృద్ధి పనుల అమలును మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. ఈ విజయం ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఉన్న సానుకూలతను పెంపొందించడానికి ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఈ ఉపఎన్నికను ‘ప్రభుత్వ పనితీరుపై రెఫరెండం’గా భారత రాష్ట్ర సమితి నేతలు సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం , సంక్షేమ పథకాలను నిలిపివేయడం వంటి ఆరోపణలు చేశారు. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించడం, విపక్షాల విమర్శలను జూబ్లీహిల్స్ ఓటర్లు స్పష్టంగా తిరస్కరించినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ కు ఏకంగా 20 వేలకు పైగా మెజార్టీ సాధించడం గమనార్హం.
Also Read: Bigg Boss 9: ఆ మెమోరీస్ గుర్తు చేసుకుని ఎమోషన్ అయిన బిగ్ బాస్ సభ్యులు.. పాపం తినడానికి తిండిలేక..
