Telangana Govt: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దఫా ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూముల్లో సాగు చేసిన పంటలను కూడా కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. సేకరించిన భూముల్లో పంటలు వేయడం నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి, ఈ పంటలను సైతం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం పరిహారం ఇచ్చి సేకరించిన భూమిలో పంట వేయడం చట్ట విరుద్ధం. అయితే, స్థలం ఖాళీగా ఉండటంతో యాచారం మండల పరిధిలోని రైతులు తమ జీవనాధారం కోసం ఈ భూముల్లోనే సాగు చేసుకున్నారు.
Also Read: Telangana Govt: ఇందిరమ్మ ఇళ్లకు ‘ఉపాధి కూలీలు’.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
కపాస్ కిసాన్ యాప్ లో అప్‌లోడ్
ఈ భూములు రెవెన్యూ వెబ్‌సైట్‌లో నిషేధిత జాబితాలో ఉండటంతో, రైతులు తమ పంట వివరాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కపాస్ కిసాన్ యాప్’లో అప్‌లోడ్ చేసుకోలేకపోయారు. దీంతో ఆందోళన చెందిన రైతులు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీఓలకు వినతులు సమర్పించారు. అధికారులు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, ఈ దఫా పండించిన పంటను కొనుగోలు చేయాలని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సూచించింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పరిధిలోని మెడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద, గొల్లగూడ, మహలిగడ్డ తండా, మర్లకుంట తండాల్లోని భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయ
కొనుగోలు కేంద్రాలు సిద్ధం
జిల్లాలో పత్తి, వరి పంటల కొనుగోలుకు ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాలను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లాలో 13, వికారాబాద్‌లో 14 చొప్పున పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫార్మాసిటీ ప్రాంతంలోని రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని కపాస్ కిసాన్ యాప్‌లో పంట వివరాలను అప్‌లోడ్ చేయడం జరిగింది. దీంతో రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో 34 కేంద్రాల ద్వారా 30 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం.
ధాన్యం సేకరణకు అధికారులు ఏర్పాట్లు
వికారాబాద్ జిల్లాలో 129 కేంద్రాల ద్వారా 1,15,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వరి పంట కొనుగోలులోనూ అధికారులు ఇదే చొరవ తీసుకున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కే. చంద్రారెడ్డి మాట్లాడుతూ, “రంగారెడ్డి జిల్లాలోని ఫార్మా ప్రాంతంలోని పంటను ఈ దఫా కొనుగోలు చేస్తాం. ప్రభుత్వం సేకరించిన భూములను నిషేధిత జాబితాలో ఉంచినప్పటికీ, రైతులు భూమిని నమ్ముకొని సాగు చేసుకోవడంతో, ప్రభుత్వం మానవత్వంతో స్పందించి కొనుగోలుకు అనుమతి ఇచ్చింది,” అని వివరించారు.
Also Read: Telangana Govt: ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు.. ఈసారి 8,332 కేంద్రాలు.. బోనస్ ఎంత అంటే?
