MLA Gandra Satyanarayana Rao: తాలు, తేమ, తరుగు వంటి సాకులతో వరి రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం భూపాలపల్లి కలెక్టరేట్‌లోని ఐడీవోసీ సమావేశ మందిరంలో వానాకాలం (ఖరీఫ్) వరి ధాన్యం కొనుగోళ్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, డీఆర్‌డీఓ, పోలీస్, రవాణా శాఖల అధికారులు పాల్గొన్నారు.
కొనుగోలు జరిగిన వెంటనే..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పలు కీలక సూచనలు, హెచ్చరికలు చేశారు. తేమ, తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు. వరి ధాన్యం కొనుగోలు జరిగిన వెంటనే రైతులకు ట్రక్ షీట్ ఇవ్వాలి. తూకం అయిన తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలదే బాధ్యతని, ఆ తర్వాత ధాన్యం విక్రయించిన రైతుకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో చెల్లింపు చేసేందుకు ట్యాబ్ ఎంట్రీలు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు.
Also Read: Gadwal: గద్వాలలో దొంగల హల్చల్.. వరుస ఘటనలతో జనాల బెంబేలు
రవాణా, నిఘాపై ప్రత్యేక దృష్టి..
ధాన్యం రవాణాలో ఇబ్బందులు సృష్టిస్తే ట్రాన్స్‌పోర్టర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ట్రాన్స్‌పోర్టర్లు రైతులకు డబ్బులు ఇవ్వక ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్, రవాణా అధికారులు సమన్వయం చేసుకుని లారీలు తనిఖీ చేయాలన్నారు. గత సంవత్సరం రవాణా సమస్య వచ్చిందని, ఈ సంవత్సరం అలాంటి సమస్య రాకుండా 5 మంది కాంట్రాక్టర్లతో పోలీస్, రవాణాశాఖ అధికారులు సమావేశం నిర్వహించాలని సూచించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తు ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో వర్షాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. మండల స్థాయిలో ఎస్సై, ఎమ్మార్వో, వ్యవసాయాధికారి తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. వరి కోత యంత్రాలు 18 నుండి 26 ఆర్‌పీఎంతో వరి కోయడం వల్ల తాలు తక్కువ వచ్చే అవకాశం ఉందని, వరికోత వాహనదారులకు మండల స్థాయిలో అవగాహన కల్పించాలని కూడా ఎమ్మెల్యే సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కొనుగోలు సక్రమంగా జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. నిధుల గోల్‌మాల్‌పై భువనగిరి ఎస్సీ గురుకులంలో ఎంక్వయిరీ!
