Gadwal: తాళం వేసిన ఇళ్లే టార్గెట్
ఇంటికి తాళం వేస్తే రెక్కీ
ఆలయాలనూ వదలని దొంగలు
పోలీసులకు సవాలుగా మారుతున్న కేసులు
కొట్టొచ్చిన నిఘా వైపల్యం
గద్వాల, స్వేచ్ఛ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో (Gadwal) దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్నారు. ఒకేరోజు రెండు చోట్ల దొంగతనానికి పాల్పడ్డ ఘటన జిల్లాలో చర్చనీయాశమైంది. ఇప్పటికే పట్టపగలే బెట్టింగ్‌లకు బానిసై అప్పులపాలు అయ్యి, డబ్బుల కోసం ఒక మహిళను హత్య చేసి మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును (Crime News) దొంగిలించాడు. తాజాగా పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలోని విశ్వ భారతి స్కూల్ సమీపంలో విజయభాస్కర్ అనే వ్యక్తి ఇంట్లో తాళం పగలగొట్టి మూడు తులాల బంగారాన్ని అపహరించారు. అదేవిధంగా న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో సైతం ఇంటి తాళాలు పగలకొట్టి, దోపిడీకి పాల్పడే ప్రయత్నం చేయగా ఇంట్లో ఏమి దొరకపోవడంతో దొంగలు వెనుదిరిగారు. ఇలా రెండు చోట్ల ఒకే దొంగల ముఠా ఈ దోపిడీకి పాల్పడిందనే కోణంలో పోలీసులు ఘటన ఇళ్లకు చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగల సంచారంపై సమీపంలోని సీసీ ఫుటేజీలను సైతం పరిశీలిస్తున్నారు.
Read Also- Jubilee Hills Counting: జూబ్లీహిల్స్ కౌంటింగ్ వేళ బీజేపీ అధ్యక్షుడ్ రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
తాళం వేసిన ఇండ్లే టార్గెట్
తాళం వేసిన ఇండ్లను టార్గెట్ గా చేసుకొని అందినకాడికి దోచేస్తున్నారు. ఇంటి యజమానులు వారి బంధువుల ఇండ్లకు, వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాటిని దోపిడీకి ఎంచుకుంటారు. ముఖ్యంగా పగలు టార్గెట్ చేసిన కాలనీలలో జెంటిల్‌మెన్‌లా తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గమనిస్తారు. ఇలా నిఘా పెట్టిన అనంతరం అదును చూసి రాత్రి వేళలో ఇంటి తలుపుల తాళాలు పగలగొట్టి బంగారు, నగదు చోరీకి పాల్పడుతున్నారు. పగలు రాత్రి అని తేడా లేకుండా దొంగలు బరితెగిస్తుండడం జిల్లా ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. పోలీసులు చోరీల కేసులపై ఆశించిన స్థాయిలో నిఘా పెట్టకపోవడంతో యథేచ్ఛగా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. మరోవైపు చోరీ కేసులో రికవరీ కూడా నామమాత్రంగా మాత్రమే ఉందని బాధితులు వాపోతున్నారు. ఏదేమైనా జిల్లాలో జరుగుతున్న దొంగతనాలు చూస్తుంటే పట్టుకోండి చూద్దాం అన్నట్టుగా పోలీసులకు దొంగలు సవాలు విసురుతున్న పరిస్థితి నెలకొంది.ముఖ్యంగా దేవాలయాలలో సైతం దేవుళ్ళ బంగారు ఆభరణాలను సైతం దోచుకునేందుకు దొంగలు వెనకాడడం లేదు.
రెక్కీ నిర్వహించి చోరీలు
జిల్లాలో రోజురోజుకు దొంగతనాల సంఖ్య పెరుగుతోంది. దుండగులు పథకం ప్రకారం ముందస్తు రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడుతున్నారు. వివిధ పండుగలు ఉత్సవాలు ఇతర అధికారిక కార్యక్రమాలలో పోలీసులు ఉండడంతో నిఘా కూడా పూర్తిగా తగ్గిపోయింది. దొంగలు కూడా ఇదే అదునుగా భావించి పట్టణం పల్లె అనే తేడా లేకుండా తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చాలు దోచుకుపోతున్నారు. కొన్ని ప్రాంతాలలో పట్టపగలే చోరీలకు పాల్పడడం మరింత కలవడం రేపుతోంది. పలుచోట్ల బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిఘా కరువు
జిల్లాలో ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్నారు. యూపీ, బీహార్, ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు చెందిన కూలీల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల వ్యవస్థను మరింత మెరుగుపరిచి వార్డులలో సైతం నిఘాన్ని పటిష్టపరిచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు భావిస్తున్నారు.
