CM Revanth Reddy: హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం నగరంలో ఉందన్నారు. భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో హైదరాబాద్ ఉందని స్పష్టం చేశారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వేగవంతమైన వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
హైదరాబాద్ ముఖద్వారం
ఢిల్లిలో గురువారం జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు-భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో (USISPF) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో గత 35 ఏళ్లుగా ఎన్నో పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ హైదరాబాద్ అభివద్ధికి అందరూ మద్దతుగా నిలిచారని సీఎం అన్నారు. భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖ ద్వారమని సీఎం తెలిపారు. జీసీసీలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని ఆహ్వానించారు. అత్యుతన్న జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్ ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అన్నారు.
❇️దేశంలోనే పెద్ద సంఖ్యలో… pic.twitter.com/xob4E8GKsj
— Telangana CMO (@TelanganaCMO) November 13, 2025
లండన్, టోక్యో, దుబాయి తరహాలో..
హైదరాబాద్ శివార్లలో నిర్మితమవుతున్న ఫ్యూచర్ సిటీ పూర్తి అయితే దేశంలోనే నూతన నగరంగా అది అవతరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ నదీ పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయి, సియోల్ రివర్‌ఫ్రంట్‌ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని సీఎం అన్నారు. డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ORR–RRR మధ్య మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పురోగతిని వివరించిన సీఎం.. చైనా +1 మోడల్‌కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందని అన్నారు.
‘రోడ్లకు నేతల పేర్లు తొలగిస్తాం’
అమెరికాలోని హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తద్వారా తక్కువ ఖర్చు, సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల (గ్లోబల్ సౌత్) విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మరోవైపు దేశంలో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉంటాయని.. హైదరాబాద్ లో ఆ ట్రెండ్ ను మార్చాలని తాము అనుకుంటున్నామని సీఎం తెలిపారు. ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్లను పెడతామని చెప్పారు.
Also Read: Delhi Blast: ఉగ్రదాడులకు ప్లాన్ చేసింది ఎక్కడ?, ఎంత డబ్బుతో?, కెమికల్స్ ఎక్కడివి?.. వెలుగులోకి అసలు!
రేవంత్ విజన్‌పై ప్రశంసలు
అయితే సీఎం రేవంత్ తన ప్రసంగానికి ముందు సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ఆవిష్కరించారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్లకు తెలంగాణలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను సీఎం రేవంత్ వివరించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి విజన్ కు అమెరికన్ కంపెనీల ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. ఆయన లక్ష్యం చాలా స్పష్టంగా, అందుకునే విధంగానే ఉందని సిస్కో మాజీ సీఈఓ జాన్ ఛాంబర్స్ అన్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ సమ్మిట్ కు హాజరవుతామని ఈ సందర్భంగా పలు కంపెనీల ప్రతినిధులు సీఎం రేవంత్ కు హామీ ఇచ్చారు.
