Emerging New AP: దాదాపుగా పదకొండేళ్లు క్రితం రాష్ట్ర విభజన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గమనం అంత సాఫీగా సాగలేదు. ఏళ్లు గడుస్తున్నా ఒడిదొడుకులే వెంటాడి, పరిస్థితులు నిరాశ కలిగించాయి. ప్రస్తుతం ఆశలు చిగురించేలా ఏపీ అడుగులు పడుతున్నాయి. వెల్లువెత్తున్న పెట్టుబడుల రూపంలో రాష్ట్రంలో నూతనం శకం ఆరంభమవబోతున్న సంకేతాలు (Emerging New AP) కనిపిస్తున్నాయి. గతేడాది కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పెట్టుబడులు ఊపందుకున్నాయి. దిగ్గజ కంపెనీలు సైతం పెట్టుబడులతో (Investments in AP) ముందుకు వస్తుండడంతో ఆర్థిక ప్రగతికి బాటలు పడుతున్నాయి. దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వస్తుండడంతో, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే కొత్త ఆశలు ప్రజల్లో చిగురిస్తున్నాయి. మొత్తంగా రాష్ట్ర దశ తిరగబోతోందన్న విశ్వాసం పెరుగుతోంది. రాష్ట్రం ప్రగతి పథాన్ని అందుకోబోతున్నట్టుగా అనిపిస్తోంది.
ఊపు తీసుకొచ్చిన గూగుల్ ప్రాజెక్ట్
విశాఖపట్నం నగరంలో (Visakapatnam) దాదాపు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Google AI data Hub) డేటా హబ్ ఏర్పాటు చేస్తూ గూగుల్ కంపెనీ ప్రకటన చేయడం రాష్ట్రంలోని పెట్టుబడుల ఊపు తీసుకొచ్చింది. గూగుల్ ప్రకటన రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రంలో ఒక అద్భుతమైన మలుపుగా అభివర్ణించవచ్చు. వైజాగ్‌లో గూగుల్ పెట్టుబడితో గ్లోబల్ టెక్ మ్యాప్‌లో ఏపీకి ప్రముఖ స్థానం దక్కినట్టు అయింది. గూగుల్‌ను చూసి మరికొన్ని కంపెనీలు సైతం ఏపీ వైపు ఉత్సాహంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఐటీ, ఎలక్ట్రానిక్స్‌తో పాటు కీలకమైన రంగాల్లో చిన్న, పెద్ద కంపెనీలు గణనీయ స్థాయిలో పెట్టుబడులు ప్రకటించాయి. ఈ పెట్టుబడులు రాష్ట్రంలో లక్షలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాది, ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి.
Read Also- Al Falah University: దిల్లీ పేలుడు ఎఫెక్ట్.. చిక్కుల్లో అల్ ఫలాహ్ యూనివర్సిటీ.. కేంద్రం కీలక ఆదేశాలు
రెన్యూ.. గేమ్ ఛేంజర్ పెట్టుబడి
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇటీవల వరుసగా వెలువడుతున్న ప్రకటనలు ఆశాజనకంగా ఉన్నాయి. గ్లోబల్ దిగ్గజ కంపెనీల నుంచి చిన్న కంపెనీలు సైతం ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో రూ.82,0000 కోట్ల విలువైన భారీ పెట్టుబడి పెట్టబోతున్నట్టుగా రెన్యూవల్ ఎనర్జీ దిగ్గజ కంపెనీ ‘రెన్యూ’ (ReNew) ప్రకటన చేయడం ఏపీకి ఒక గేమ్ ఛేంజర్‌లా కనిపిస్తోంది. రెన్యూ వంటి అంతర్జాతీయ కంపెనీ రాష్ట్రంలో అడుగు పెట్టడం మరిన్ని కంపెనీల రాకకు ఆకర్షనీయంగా ఉంటుందనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఈ తరహా పెట్టుబడులను కేవలం ఒక ఇన్వెస్ట్‌మెంట్ మాదిరిగా కాకుండా, రాష్ట్ర భవిష్యత్తుపై అంతర్జాతీయంగా పెరుగుతున్న విశ్వాసానికి సంకేతమని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
గతంలో హైదరాబాద్ మాదిరిగా..
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం నేడు ఒక మెట్రో నగరంగా రూపుదిద్దుకొని, అంతర్జాతీయ ఆకర్షణ పొందిందంటే, దానికి కారణం కొన్ని దశాబ్దాల క్రితం పడిన అడుగులే. మైక్రోసాఫ్ట్‌తో పాటు కొన్ని అంతర్జాతీయ ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టాక ఒక నమ్మకం, విశ్వాసం ఏర్పడి వందలాది కంపెనీలు తరలివచ్చాయి. భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ, ఏపీలో చోటుచేసుకుంటున్న పెట్టుబడుల పరిణామాలు చాలా ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ అభివృద్ధికి బాటలు పడినట్టుగానే, విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు కానుండడం, మరో గ్లోబల్ కంపెనీ రెన్యూ అడుగులు వేయడం శుభసూచకంగా కనిపిస్తోంది.
మొత్తంగా చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునరుజ్జీవన దశలో ఉందని చెప్పవచ్చు. ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఉపయోగపడనున్నాయి. కేవలం పారిశ్రామిక అభివృద్ధికి మాత్రమే పరిమితం కాకుండా, రాష్ట్ర ప్రజల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి, తలసరి ఆదాయం పెరుగుదలకు పునాదిరాళ్లుగా దోహదపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
