Mahesh Kumar Goud: లోకల్ బాడీ ఎన్నికలపై త్వరలోనే ఏఐసీసీతో డిస్కషన్ చేయనున్నట్లు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై రెండు మూడు రోజుల్లోనే కీలకమైన రివ్యూ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణలో మరోసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని వివరించారు.
Also Read: Mahesh Kumar Goud: డిప్యూటీ సీఎం అంటూ ప్రచారం.. టీపీసీసీ చీఫ్ ఆసక్తికర కామెంట్స్
కాంగ్రెస్ విజయం ఖాయం
పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. మంత్రులతో పాటు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఉన్న ప్రతీ ఒక్కరూ బాగా పని చేశారని గుర్తు చేశారు. పోలింగ్ పర్సంటెజ్ పెరిగి ఉంటే బాగుండేదని, పట్టణ ప్రజలు, యువత ముందుకొచ్చి ఓటు వేయకపోవడం బాధాకరమన్నారు. దీనిపై ప్రభుత్వం తరపున ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌ను తయారు చేస్తామన్నారు. ఇక రిగ్గింగ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదని, ఇది పాత జమానా కాదని తేల్చి చెప్పారు. ఓడిపోతున్నామనే బాధతోనే బీఆర్‌ఎస్ ఇలాంటి అసత్య ప్రచారాలను తెర మీదకు తీసుకొచ్చిందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్‌లో తమ పార్టీ అభ్యర్థి కూడా ప్లస్ పాయింట్‌గా ఉన్నారన్నారు.
అది హైకమాండ్ చూసుకుంటుంది..
క్యాబినెట్ విస్తరణ, డిప్యూటీ సీఎం వంటి అంశాలను హైకమాండ్ చూసుకుంటుందని, ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా తాను, సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. రాష్ట్రంలో పార్టీని ఎక్కువ కాలం పవర్‌లో ఉంచేలా పని చేస్తున్నామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ కు మరింత పాజిటివ్ వేవ్ కనిపిస్తుందని, మళ్లీ వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని నొక్కి చెప్పారు. బీసీలకు 42 శాతం చట్ట బద్ధకంగా చేయాలని అనుకున్నామని, కానీ కేంద్రంలోని బీజేపీ అడుగడుగునా అడ్డం పడుతుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తపన పడుతుందన్నారు. బీసీలు బాగుపడొద్దు అన్న వైఖరితో బండి సంజయ్, కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. డీసీసీ అధ్యక్షుల ప్రకటన ఏ క్షణమైన రావొచ్చని పీసీసీ చీఫ్ క్లారిటీ ఇచ్చారు.
బీఆర్ఎస్ ఫేక్ సర్వేలకు పూనుకుంది
బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ప్రచారాలతో సంబుర పడుతుందని, కానీ ఇది టెంపరరీ గేమ్ అనే విషయాన్ని మరిచి పోయిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పెయిడ్ యూట్యూబ్ చానల్స్ ద్వారా ఫేక్ సర్వేలకు బీఆర్ఎస్ పూనుకుందన్నారు. ఇక తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మరోసారి కాంగ్రెస్ రావాలనేది తన కోరిక అంటూ మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. బిహార్‌లో మహాఘాట్ బంధన్ గెలుస్తుందనే నమ్మకం ఉన్నదన్నారు. త్వరలో ఓట్ చోరీపై కమిటీ వేయనున్నట్లు వివరించారు.
Also Read: Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ విజయం ఖాయం.. మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
