Mahesh Kumar Goud: డిప్యూటీ సీఎం కాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా తాను సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. తాను కేబినేట్ పై ఎప్పుడూ ఆశలు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. మరోవైపు మంత్రి వర్గం తన పరిధిలోని అంశం కాదన్న ఆయన.. దానిపై ఎలాంటి కామెంట్స్ చేయబోనని పేర్కొన్నారు. క్యాబినెట్ విస్తరణ అనేది ఏఐసీసీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి తీసుకునే నిర్ణయమని స్పష్టం చేశారు.
ఆర్గనైజేషన్ స్థాయి నుంచి వచ్చాను కాబట్టి తాను పీసీసీగానే ఉండేందుకు ఇష్టపడతానని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీ అభ్యర్థి సీఎం కావాలనేది తన కోసం కాదని అన్నారు. రానున్న ఎన్నికల్లో పీసీసీగానే కష్టపడతానని.. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం తర్వాత స్థానిక ఎన్నికల అధ్యయనం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. లోకల్ బాడీ ఎన్నికలపై ఏఐసీసీ పెద్దలతో మాట్లాడి ముందుకు సాగుతామని అన్నారు.
Also Read: Al Falah University: ఉగ్రవాదులకు అడ్డా అంటూ ఆరోపణలు.. స్పందించిన అల్-ఫలాహ్ యూనివర్శిటీ
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి నాలుగైదు సార్లు పార్టీ నేతలు వెళ్లారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు జూబ్లీహిల్స్ లో వర్కౌట్ అయ్యాయని అన్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ యువత ఓటు వేసేందుకు ముందుకు రాలేదని అన్నారు. భవిష్యత్తును నిర్మించుకునేందుకు ఓటు తప్పనిసరని అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ చేస్తున్న రిగ్గింగ్ ఆరోపణలను మహేష్ కుమార్ గౌడ్ కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఢోకా లేదని అభిప్రాయపడ్డారు. సీఎంగా రేవంత్, డిప్యూటీ సీఎంగా భట్టి, టీపీసీసీగా తాను అలాగే ఉంటామని మహేష్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు.
