Gurukulam Scam: ఉపాధ్యాయ వృత్తి పవిత్రతను పక్కనపెట్టి, విద్యార్థుల సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన లక్షల రూపాయల నిధులను భువనగిరి ఎస్సీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌తో పాటు నలుగురు ఉపాధ్యాయులు బోగస్ బిల్లుల ద్వారా స్వాహా చేసినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరి చర్యలు చూస్తుంటే ‘విద్యార్థుల కంచంలో కూడు కూడా లాక్కుంటారేమో’ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read: Waragal Gurukulam: గురుకుల ప్రవేశాల్లో నియమాల మాయం.. విద్యార్థులపై అన్యాయం ఎవరి బాధ్యత?
పీఎంశ్రీ పథకంలో భారీ గోల్‌మాల్
నూతన విద్యావిధానం-2020 అమలులో భాగంగా బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల అభివృద్ధి కోసం కేంద్రం తీసుకొచ్చిన పీఎంశ్రీ (పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం నిధులు భువనగిరి ఎస్సీ గురుకులంలో పక్కదారి పట్టాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో గురుకులానికి మంజూరైన రూ. 11.37 లక్షలు సహా సుమారు రూ. 12 లక్షలు ప్రిన్సిపాల్, టీచర్ల జేబుల్లోకి చేరినట్లు ఆరోపణలున్నాయి. అసలు చేయని పనులకు, జరగని విజిట్‌లకు బిల్లులు పెట్టి లక్షలు నొక్కేశారు.
నిధుల దుర్వినియోగం తీరు
ఖర్చు పేరు బిల్లు మొత్తం వివరాలు
ఎక్స్‌ఫ్లోర్ విజిట్ (4 సార్లు) రూ. 2.68 లక్షలు అసలు వెళ్లని విజిట్లకు బిల్లులు. ఫీల్డ్ విజిట్ (6 సార్లు) రూ. 2.48 లక్షలు “ఫీల్డ్ విజిట్లలో విద్యార్థులకు స్నాక్స్, వాటర్ బాటిళ్ల కోసం ప్రతిసారీ రూ. 17 వేల చొప్పున రూ. 68,000 ఖర్చు చేసినట్లు బిల్లులు చూపారు. మేజర్ రిపేర్లు రూ. 2.00 లక్షలు చేయని రిపేర్లకు బిల్లులు డ్రా చేశారు. నీళ్ల ట్యాంకు కొనుగోలు రూ. 3.00 లక్షలు “కేవలం రూ. 20,000 కూడా విలువ లేని నీటి ట్యాంకుకు రూ. 3 లక్షల బిల్లు సృష్టించి ‘గౌతమ్ బోస్ ఎంటర్‌ప్రైజెస్’ అకౌంట్‌లో జమ చేశారు.సెప్టిక్ ట్యాంక్ రిపేర్లు రూ. 1.00 లక్ష రిపేర్లు చేయకుండానే చేసినట్లు బిల్లు సృష్టించి ఇదే ‘గౌతమ్ బోస్ ఎంటర్‌ప్రైజెస్’ అకౌంట్‌లో జమ చేశారు.
నిబంధనలు తుంగలో
గురుకులతో ఎటువంటి సంబంధం లేని సాయి పవన్ అనే వ్యక్తి అకౌంట్‌లోకి వివిధ ఖర్చులు చూపుతూ ఏకంగా లక్ష రూపాయలను డిపాజిట్ చేశారు. నిబంధనల ప్రకారం, కమిటీ ఆమోదం తర్వాతే గురుకుల అధ్యాపకుల అకౌంట్‌లోకి డబ్బు జమ చేసి, అనంతరం జీఎస్టీ బిల్లులు, అండర్‌టేకింగ్ ఇవ్వాలి. ఈ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారు.
స్క్రాప్, కూలిన చెట్లను కూడా వదల్లేదు..
స్క్రాప్ కింద వచ్చే పాత బెంచీలు, కుర్చీలు, అలాగే గాలివానకు కూలిపోయిన చెట్లను కూడా అమ్ముకొని ఆ సొమ్మును కూడా గురుకుల నిర్వాహకులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
దాతల విరాళాలపైనా దోపిడీ..
కేంద్రీయ విద్యాలయం నుంచి వార్షికోత్సవం సందర్భంగా గురుకులానికి అందించిన లక్ష రూపాయల విలువైన వివిధ క్రీడా వస్తువులను కూడా వీరు వదల్లేదు. ఆ వస్తువులను తామే కొనుగోలు చేసినట్లుగా నకిలీ బిల్లులను సృష్టించి, పీఈటీ సుధాకర్ ఖాతాలో రూ. 20 వేలు, టీజీటీ మ్యాథ్స్ టీచర్ రాజేశ్వరి ఖాతాలో రూ. 50 వేలు జమ చేసుకున్నారు. దీనికోసం పూర్వ విద్యార్థుల విరాళాలను నమోదు చేసే డోనర్స్ రిజిస్టర్ కూడా నిర్వహించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
జిల్లా విద్యాధికారి మౌనం
లక్షల్లో జీతాలు తీసుకుంటున్నప్పటికీ, విద్యార్థులకు చెందిన ప్రతి పైసాను సొంత జేబుల్లోకి వేసుకుంటున్న ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. సొసైటీ నిధులపై ఆడిట్ నిర్వహించకపోవడం, ఆడిటింగ్‌పై అధికారులు గుడ్డిగా సంతకాలు చేయడంతోనే ఈ అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో జిల్లా విద్యాధికారి (డీఈఓ) పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Warangal Gurukulam: గురుకులంలో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. అధికారాల తీరుపై స్థానికుల ఆగ్రహం!
