Jubilee Hills By poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్‌లో మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక నుంచి రాష్ట్రంలో ఏ ఎలక్షన్ జరిగినా విజయం తమదేననే నమ్మకం హస్తం లీడర్లకు కలిగింది. పోలింగ్ తర్వాత విడుదలైన ఎగ్జిట్ పోల్స్, పార్టీ ఇంటర్నల్ సర్వే ఆధారంగా జూబ్లీహిల్స్‌లో తమ అభ్యర్తి గెలుస్తున్నారని కాంగ్రెస్ లీడర్లు విశ్వసిస్తున్నారు. అంతేగాక ఫలితాల రోజు భారీ ర్యాలీతో పాటు వేడుకలు కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఇదే జోష్‌తో లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని పార్టీ నేతలు టీపీసీసీపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో పాటు టెక్నికల్ ఇష్యూతో సతమతం అవుతున్న ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే బై ఎలక్షన్‌ను పూర్తి చేద్దామని కొందరు పార్టీ దృష్టికి తీసుకువచ్చారు.
లీడర్లు, కేడర్‌లో పెరిగిన ధీమాతో ఎన్నికలు పూర్తి చేస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయని వివరిస్తున్నారు. వాస్తవానికి ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమనే అంశాన్ని గతంలోనే ముఖ్య లీడర్లకు పార్టీ వివరించింది. గ్రౌండ్ వర్క్ చేయాల్సిందేనని టీపీసీసీ కూడా ఆ సెగ్మెంట్ లీడర్లకు హింట్ ఇచ్చింది. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత ఆ సీటు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని నమ్మకంతో లీడర్లు ఉన్నారు. ఇదే విషయాన్ని పీసీసీ చీఫ్ త్వరలో ఏఐసీసీ పెద్దలకు వివరించనున్నారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు.
జూబ్లీహిల్స్ తరహాలోనే స్ట్రాటజీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కీలక స్ట్రాటజీని ఉపయోగించింది. ఓటర్లను కమ్యూనిటీల వారీగా వేరు చేసి ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించింది. డివిజన్ల వారీగా మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యతలు ఇచ్చింది. దీనికి అదనంగా మహిళా ఓటర్లను కో ఆర్డినేట్ చేసేందుకు ప్రత్యేకంగా ఉమెన్ కమిటీలను కూడా నియమించింది. ప్రతీ ఇంటికి కాంగ్రెస్ అనే నినాదంతో గడిచిన కొన్ని రోజులుగా నేతలు ఒక్కో ఇంటికీ దాదాపు నాలుగు సార్లు రౌండప్ చేశారు.
దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి చేసిన రోడ్ షో, మీటింగ్‌లు ప్రజలను ఆకట్టుకున్నాయి. ప్రతిపక్షాలపై తీవ్రమైన విమర్శలు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్‌ను నింపాయి. ఇది కాంగ్రెస్ విజయానికి దోహదపడుతుందని భరోసాతో పార్టీ లీడర్లు ఉన్నారు. ఇదే తరహాలోనే ఖైరతాబాద్‌లోనూ అమలు చేస్తే అక్కడ కూడా పార్టీ కచ్చితంగా గెలుస్తుందని గ్రౌండ్‌లోని లీడర్లు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం అంచనాలు, లీడర్లు, కార్యకర్తల స్థైర్యాన్ని గణనీయంగా పెంచుతుందని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ అభ్యర్థికి స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వడం ఈ ధీమాకు బలం చేకూర్చింది. ఈ విజయం భవిష్యత్తులో బీఆర్‌ఎస్, బీజేపీల అవకాశాలపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని పార్టీ విశ్లేషిస్తున్నది.
టార్గెట్ జీహెచ్ఎంసీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రభుత్వ పథకాలపై కూడా ప్రజల్లో విశ్వాసం ఉన్నట్లు కాంగ్రెస్ లీడర్లు భావిస్తున్నారు. ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం, మహిళా సంఘాలకు లోన్లు వంటివి మైలేజ్ ను తీసుకువచ్చాయని చెబుతున్నారు. దీంతోనే బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటు జూబ్లీహిల్స్‌ను కాంగ్రెస్ కైవసం చేసుకునే వెసులుబాటు కలిగిందని వివరిస్తున్నారు. దీంతో పాటు అభివృద్ధి నిధులు విడుదల చేస్తూ, కొత్త ప్రాజెక్టులు చేపడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటాలని కాంగ్రెస్ ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నది. మేయర్‌తో పాటు మెజార్టీ సీట్లు సులువుగా పొందాలని గ్రౌండ్ వర్క్‌ను మొదలు పెట్టనున్నది. ఇందుకోసం అతి త్వరలో జీహెచ్‌ఎంసీలోని ముఖ్య నాయకులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.
బీఆర్ఎస్‌లో నైరాశ్యం
ఉప ఎన్నికకు ముందు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చిన సర్వే సంస్థలు సైతం తర్వాత కాంగ్రెస్ గెలుస్తుందని ప్రకటించాయి. రెండు మూడు సంస్థలు మినహా అన్నీ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని చెప్పాయి. దీంతో బీఆర్ఎస్‌లో నైరాశ్యం నెలకొన్నది. ఇప్పటికే వరుస ఓటములు వెంటాడుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్, కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఇలా అన్నింటిలోనూ బీఆర్ఎస్ ఓటమి పాలైంది. జూబ్లీహిల్స్‌తో దీనికి అడ్డుకట్ట వేయాలనుకున్నది. కానీ, సర్వే సంస్థలు ఆ ఆశలపై నీళ్లు చల్లాయి.
Also Read: Jubilee Hills Bypoll: గెలుపుపై ఎవరికి వారే ధీమా.. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యే పోటీ..!
