- అయోధ్య రామాలయంలో వర్షపు నీరు లీకేజీ
- ఆలయం మొదటి అంతస్తు పై కప్పు నుంచి నీరు లీకేజ్
- నిర్మాణం జరిగి ఆరు నెలల ముందే మొదలైన సమస్యలు
- ఆలయ అధికారుల దృష్టికి తీసుకువచ్చిన కోవెల ప్రధాన పూజారి
- సమస్యను త్వరగా పరిష్కరించకుంటే భక్తులకు అవస్థలు
- గర్భగుడికి లేని డ్రైనేజీ వ్యవస్థ
- రూ.1,800 కోట్లకు పైగా నిర్మాణ వ్యయం అంచనా
- మరో సంవత్సరానికి పూర్తి కానున్న ఆలయ నిర్మాణం
Ayodhya Ram temple facing water leakage problem from 1 st floor:
ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించిన అయోధ్య రామమందిరం ఆరు నెలలు గడవకముందే లీకేజ్ సమస్య ఎదుర్కుంటోంది. ఆలయం మొదటి అంతస్తు పై కప్పు నుంచి నీరు లీక్ అవుతోందని ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్రదాస్ వెల్లడించారు. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది. గుడి పై కప్పును ఎలా నిర్మించారు. అక్కడి నుంచి నీరు లీక్ కాకుండా ఏం చేయాలి అనే అంశాలపై ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో వర్షాలు తీవ్ర రూపం దాలిస్తే అయోధ్య రామాలయంలో లీకేజ్ కారణంగా భక్తులు పూజ చేయడం కూడా కష్టంగా మారుతుందని సత్యేంద్ర దాస్ చెప్పారు. దీనిపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు. వీలైనంత త్వరగా పరిష్కరించకుంటే ఆ నీరు బలరాముడి విగ్రహం ఉన్న చోటుకు కూడా చేరుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. రామ మందిరానికి వాటర్ డ్రైనేజీ మార్గం లేదని బయటకు పోయే మార్గం కష్టమని అన్నారు. ఆలయ నిర్మాణం 2025 జులై నాటికి పూర్తవుతుంని అధికారులు అంటున్నా అప్పటికి సాధ్యం కాదని ఆయన అన్నారు. ఇంకా చాలా పనులు నిర్మాణ దశలోనే ఉన్నాయని అన్నారు.
ఆరు నెలలు కాకుండానే
యూపీలోని అయోధ్యలో రామమందిరం కట్టి కనీసం ఆరు నెలలు కాకముందే లీకేజీలపై భక్తులు విమర్శిస్తున్నారు. ఆలయ నిర్మాణం పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయోధ్య ఆలయ ప్రారంభోత్సవాన్ని ఈ ఏడాది జనవరి 22న ఎంతో అర్భాటంగా నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దీన్ని బీజేపీ తన సొంత కార్యక్రమంలా నిర్వహించిందనే విమర్శలు ఉన్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. రాజకీయ, సినిమా, పరిశ్రమ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు చూసేందుకు లైవ్ ఏర్పాట్లు కూడా చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నేతృత్వంలో చేపట్టిన ఈ రామ మందిర నిర్మాణ అంచనా వ్యయం రూ.1,800 కోట్లుగా ఉన్నది. ఆలయ నిర్మాణం, అనంతర నిర్వహణ కోసం ట్రస్టుకు దాతల నుంచి దాదాపు రూ.3,500 కోట్ల మేర వచ్చాయి.
ఏకీభవించిన కమిటీ ఛైర్మన్
అయితే ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్రదాస్ వ్యాఖ్యలతో అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణ కమిటీ చైర్‌పర్మన్ నృపేంద్ర మిశ్రా ఏకీభవించారు. పైకప్పు నుంచి నీటి లీకేజీ సమస్య ఉన్న మాట నిజమేనన్నారు. ఆలయం పైకప్పు మరమ్మతులు, వాటర్‌ఫ్రూఫింగ్ చేయిస్తామన్నారు. ‘‘ప్రాచీన ఆలయ నిర్మాణ శైలిలో భాగంగానే గురు మండపాన్ని ఓపెన్‌గా వదిలాం. ఆలయ గోపురం నిర్మాణ పనులు పూర్తయ్యాక.. ఈ ఓపెన్ ప్రదేశాన్ని కవర్ చేస్తుంది. ఆలయం గర్భగుడి లోపల డ్రైనేజీ వ్యవస్థ లేదు. మ్యానువల్‌గా ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. పైకప్పు నుంచి నీటి లీకేజీకి ఆలయ డిజైన్ సమస్య కానీ, ఆలయ నిర్మాణ సమస్య కానీ కారణం కాదు’’ అని నృపేంద్ర మిశ్రా స్పష్టం చేశారు.