Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక ధాన్యం దిగుబడులను సాధించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ స్థాయిలో పంట దిగుబడి రావడం స్వతంత్ర భారతావనిలో ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి ఉత్తమ్.. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గడ్డిపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉత్తమ్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రికార్డు
మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ తమది రైతు పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రకృతి వైపరిత్యాల భారిన పడ్డ రైతాంగానికి బాసటగా ఉంటామని చెప్పారు. తమ ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా ఉంటుందని అన్నారు. ‘ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డ్ సృష్టించింది. స్వతంత్ర భారత దేశంలో ఇంతటి ఉత్పత్తి ఇదే ప్రథమం. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పించాం. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు నమోదు చేసిన 48 గంటల వ్యవధిలో చెల్లింపులు చేశాం. కొనుగోలు కేంద్రాలలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది’ అని ఉత్తమ్ అన్నారు.
ఇది ప్రభుత్వ ఘనతే..
పంట దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం ఆల్ టైమ్ రికార్డు సృష్టించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో అత్యధిక దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. ఒక సీజన్ లో ఇంతటి దిగుమతి సాధించడం ముమ్మాటికి ప్రభుత్వ ఘనతేనని అన్నారు. ‘రైతాంగం పట్ల ప్రభుత్వం అనుసరించిన విధానాలతోటే దిగుబడిలో రికార్డు సృష్టించాం. దిగుబడి లోనే కాదు కొనుగోలులోను తెలంగాణ రికార్డ్ సృష్టిస్తోంది. ముందెన్నడూ లేని రీతిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం ఇదే ప్రప్రథమం. యావత్ భారతదేశంలోనే ఇంత పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు ముందెన్నడూ లేవు’ అని ఉత్తమ్ అన్నారు.
Also Read: Delhi Car Blast: భూటాన్ నుంచి రిటర్న్.. నేరుగా ఆస్పత్రికి వెళ్లిన మోదీ.. బాధితులకు పరామర్శ
నీటి ప్రాజెక్టులపై సమీక్ష
అంతకుముందు కాళేశ్వరం సహా పలు సాగు నీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ‘సమ్మక్క సారక్క, సీతారామ సాగర్, దిండి, సింగూరు కాలువ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీల పునరుద్ధరణకు శాస్త్రీయ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి ప్రాజెక్ట్‌లో పారదర్శకత, సాంకేతిక సమగ్రతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతీ ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రజల డబ్బు ఉందన్న ఉత్తమ్.. బాధ్యతాయుతంగా పనులు సాగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
