Kishan Reddy: తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్రపై ఓపెన్ డిబేట్‌కు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయలేదంటూ ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా నిరాధార ఆరోపణలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తో కలిసి బహిరంగ చర్చకు రావడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ చర్చకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో వేదిక ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి ఆయన ఆదివారం లేఖ రాశారు.
కేంద్రం పాత్రపై నిజానిజాలు
కేంద్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్(BRS), కాంగ్రెస్(Congress) పార్టీలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, ప్రధానమంత్రి మోడీపై తప్పుడు విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నాయని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం పాత్రపై ప్రజలకు నిజానిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే తెలంగాణకు పదేళ్లలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు మంజూరు చేశామనే విషయాన్ని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ అంశాలపై ‘తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర’ పేరుతో నివేదిక కూడా విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ తో కలిసి నిర్మాణాత్మకమైన బహిరంగ చర్చ ఏర్పాటు చేయాలని, అందుకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌ను వేదికగా నిర్ణయించాలని ప్రెసిడెంట్‌ను కోరారు.
Also Read: Mahabubabad District: రెడ్యాలలో అంగరంగ వైభవంగా పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు!
అసహ్యపు మాటలు..
తేదీ, సమయం నిర్ణయించి వారిద్దరినీ ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ చర్చ సజావుగా సాగేందుకు కిషన్ రెడ్డి ఓ షరతు పెట్టారు. చర్చ సందర్భంగా సీఎం, మాజీ సీఎం మాట్లాడే భాష ప్రెస్ క్లబ్ నియమ నిబంధనలకు అనుగుణంగా, పార్లమెంటరీ పద్ధతిలో ఉండాలని కోరారు. వ్యక్తిగత దూషణలు, అసహ్యపు మాటలు లేకుండా సానుకూల చర్చ జరిగేలా చూడాలని సూచించారు. ఈ డిబేట్ ద్వారా తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు వాస్తవాలు తెలిసే విధంగా మీడియా ముందు చర్చకు చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరి సీఎం రేవంత్, మాజీ సీఎం కేసటీఆర్ ఈ బహిరంగ చర్చకు సిద్ధమా? లేదా? అని సవాల్ విసిరారు.
Also Read: Jubilee Hills Bypoll: మూగబోయిన మైక్‌లు.. జూబ్లీహిల్స్‌లో ముగిసిన ప్రచారపర్వం
