Student death In US: ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఆశతో, కన్నవారి కలలను నిజం చేయాలనే తపనతో అమెరికా గడ్డపై అడుగుపెట్టిన ఓ 23 ఏళ్ల యువతికి నూరేళ్లు నిండాయి. కన్నతండ్రి అప్పులు చేసి మరీ ఉన్నత చదువుల కోసం పంపిస్తే అంకితభావంతో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. జీవితంలో స్థిరపడి కన్నవారి కలల్ని నెరవేర్చేందుకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న సమయంలో ఆమె హఠాత్తుగా (Student death In US) చనిపోయింది. ఏపీకి చెందిన యార్లగడ్డ రాజ్యలక్ష్మి (23) అనే యువతి అమెరికాలో చనిపోయింది. నిద్రలోనే ఆమె తుదిశ్వాస విడిచినట్టు తోటి విద్యార్థినులు చెబుతున్నారు.
Read Also- Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో మంత్రులపై మనీ ప్రెజర్.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ మంత్రి
రాజ్యలక్ష్మి బాపట్ల జిల్లా, కారంచేడు గ్రామానికి చెందిన యువతి. ఆమె తల్లిదండ్రుల పేర్లు యార్లగడ్డ రామకృష్ణ, వీణాకుమారి. రాజ్యలక్ష్మి వారికి ఏకైక కుమార్తె. ఇంజినీరింగ్ పూర్తిచేసిన తర్వాత, మెరుగైన భవిష్యత్తు కోసం ఎంఎస్ చదివేందుకు అప్పులు చేసి మరీ ఆమెను అమెరికాలోని టెక్సాస్‌కు పంపించారు. కన్నవారి త్యాగాన్ని అర్థం చేసుకుని ఎంతో కష్టపడి చదివి మాస్టర్స్ డిగ్రీని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. మంచి ఉద్యోగం ప్రయత్నిస్తున్న క్రమంలో ఇటీవల ఆమె అనారోగ్యానికి గురైనట్టు తెలిసింది. ఛాతిలో నొప్పి, దగ్గు సమస్యలు ఇబ్బందులు పెట్టినా ఆమె లెక్కచేయలేదని, శుక్రవారం రాత్రి నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిందని తోటి విద్యార్థినులు చెప్పారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఉద్యోగ అన్వేషణలో ఛాతీలో నొప్పిని పెద్దగా పట్టించుకున్నట్టు లేదని, సాధారణ సమస్యగా భావించి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also- Stress Relief: మతిమరుపు, ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే, ఈ చిట్కాలు పాటించండి!
శుక్రవారం ఉదయం నిద్రలేవకపోవడంతో లేపే ప్రయత్నం చేసిన ఫ్రెండ్స్, రాజ్యలక్ష్మి నుంచి స్పందన లేకపోవడంతో పూర్తిగా పరిశీలించి చూడగా ఆమె చనిపోయినట్టు గుర్తించారు. విషయాన్ని కారంచేడులోని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఒక్కగానొక్క కూతుర్ని కోల్పోవడంతో తల్లిదండ్రుల దుఃఖం వర్ణనాతీతంగా మారింది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన యువతి అకాల మరణం చెందడంతో వారి గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహం తరలింపునకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంటుంది.
