– చివరి ల్యాండింగ్ టెస్టు కూడా విజయవంతం
– ఇక పెద్ద వెర్షన్ స్పేస్‌ప్లేన్‌పై ప్రయోగం
– సక్సెస్ అయితే ఇక్కడి నుంచి స్పేస్‌కు రవాణా చేసే సౌకర్యం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక అడుగు వేసింది. పుష్పక్ రీయూజేబుల్ లాంచ్ వెహికల్ మూడో మరియు చివరి టెస్టును విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో తదుపరి పెద్ద వెర్షన్ స్పేస్‌ప్లేన్‌తో ప్రయోగం చేయనుంది. ఆ ప్రయోగం కూడా సక్సెస్ అయితే.. ఇక్కడి నుంచి అంతరిక్షంలోని ఉపగ్రహాలకు లేదా రోదసి ప్రయోగాలకు వీటిని రవాణా వాహనంగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఈ వాహనం దానికదిగా స్పేస్ నుంచి భూమిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ కేవలం అమెరికా, చైనాల వద్దే ఉన్నది. మన పుష్పక్ పునర్వినియోగ ప్రయోగ వాహన పరీక్ష విజయవంతమైతే ఈ రెండు దేశాల సరసన భారత్ నిలుస్తుంది.
ఇస్రో ఈ రోజు ఉదయం కర్ణాటకలో చిత్రదుర్గలోని ఎరోనాటికల్ టెస్ట్ రేంజ్ వద్ద ఉదయం 7 గంటల ప్రాంతంలో స్పేస్‌ప్లేన్ పుష్పక్ ప్రయోగం చేపట్టింది. సుమారు నాలుగు కిలోమీటర్ల ఎత్తులో ఆకాశం నుంచి హెలికాప్టర్‌లో పుష్పక్‌ను వదిలిపెట్టారు. అది కొంత దూరం కిందికి వచ్చాక ప్యారాచూట్ తెరుచుకుంది. ఆ తర్వాత పుష్పక్ విజయవంతంగా రన్ వేపై స్మూత్ ల్యాండింగ్ అయింది. కేవలం 15 నెలల వ్యవధిలోనే ఇస్రో ఈ పుష్పక్ మూడు టెస్టులను విజయవంతంగా నిర్వహించగలిగింది. ఇక తదుపరిగా పెద్ద వెర్షన్ స్పేస్‌ప్లేన్ పుష్పక్‌తో ప్రయోగం చేయాల్సి ఉన్నది. పెద్ద పుష్పక్ స్పేస్‌ప్లేన్‌ను మాడిఫైడ్ రాకెట్‌లో అంతరిక్షానికి తీసుకెళ్లి వదిలిపెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఆ పుష్పక్ విజయవంతగా భూగ్రహ వాతావరణంలో ప్రయాణించి సురక్షితంగా భూ ఉపరితలంపై నిర్దేశించిన స్థలంలో ల్యాండ్ కావాల్సి ఉంటుంది. ఇది సక్సెస్ అయితే.. ఇస్రో దీన్ని ఒక ఫెర్రీ స్మాల్ కార్గోలా ఉపయోగించనుంది.