Election Commission: దేశంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా పోలింగ్ శాతం పడిపోవటాన్ని భారత ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ప్రజాప్రతినిధుల ఎన్నికలో ఓటర్ల భాగస్వామ్యం పెంచేందుకు ఏ ఎన్నిక జరిగినా, తప్పకుండా ఓటింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం దేశ వ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీ అయిన మరో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు బీహార్ రాష్ట్రానికి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 11న జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ సమయాన్ని మరో గంట పెంచింది. సాధారణంగా ఇప్పటి వరకు అమలైన నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు పోలింగ్ నిర్వహించారు.
Also Read: Election Commission: జూబ్లీహిల్స్ బైపోల్స్.. ఓటు వేయాలంటే అది తప్పనిసరి.. ఈసీ కీలక ఆదేశాలు
మూడు గంటల వరకు పోలింగ్
ఏజెన్సీ ఏరియాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు, నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నాం మూడు గంటల వరకు పోలింగ్ నిర్వహించేవారు. కానీ జూబ్లీహిల్స్ పోలింగ్ ప్రక్రియను ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అంటే అదనంగా మరో గంట నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించినట్లు సమాచారం. రోజురోజుకి పడిపోతున్న పోలింగ్ శాతాన్ని పెంచేందుకే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా ఉప ఎన్నిక, జనరల్ ఎలక్షన్స్ జరిగే నియోజకవర్గాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా పోలింగ్ రోజున ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటిస్తారు.
ఉద్యోగులకు సెలవు ప్రకటించాలి
ప్రైవేటు సంస్థలు కూడా ఉద్యోగులకు సెలవు ప్రకటించాలని ఎప్పటికపుడు ఎన్నికల విభాగం అధికారులు సిఫార్సులు చేస్తున్నా, ప్రైవేటు సంస్థలు అంతంతమాత్రంగానే అమలు చేస్తున్నాయి. కానీ సర్కారు ఆఫీసులకు సెలవును ప్రకటించినా, కొందరు ఓటర్లు హాలీ డేను ఎంజాయ్ చేయటం తప్పా, ఓటింగ్ లో పాల్గొనని సందర్భాలు సైతం లేకపోలేవు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్న ఈ నెల 11న ఎన్నికల సంఘం పోలింగ్ ను సాయంత్రం గంట సేపు పెంచుతూ జారీ చేసిన నిర్ణయంతో సాయంత్రం అయిదు నుంచి ఆరు గంటల్లోపు ప్రైవేటు కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశమున్నట్లు చెప్పవచ్చు.
సాయంత్రం 6 గం.ల కల్లా వస్తే
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఉదయం ఏడు గంటల నుంచి మొదలుకానున్న పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు గంటల వరకు నిరాటంకంగా కొనసాగనుంది. సాయంత్రం ఆరు గంటల కల్లా పోలింగ్ స్టేషన్ ఆవరణలోకి వచ్చిన ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. క్యూ లైన్ లో ఎంత మంది ఉన్నా, ఎంత సమయం పట్టినా, అందరూ ఓట్లు వేసిన తర్వాతే పోలింగ్ ప్రక్రియ ముగించి, ఈవీఎంలను ఏజెంట్ల సమక్షంలో సీజ్ చేసి, రిసెప్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు తరలించనున్నారు.
Also Read: Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు
