Vaishnavi Constructions: రూ.900 కోట్ల భూమికి ఎసరు
సీలింగ్ భూమి వైష్ణవి కంపెనీకి పట్టా
నిబంధనలకు విరుద్దంగా భూమార్పిడి
సీఎం, డిప్యూటి సీఎంకి ఎమ్మెల్యే ఫిర్యాదు
ట్రిబ్యునల్ అర్డర్‌ను పట్టించుకోని అధికారులు
అర్డర్‌పై రిట్ పిటిషన్ వేసిన వైష్ణవి కంపెనీ యాజమాన్యం
కౌంటర్ వేసేందుకు అధికారుల తాత్సారం
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: ఫోర్త్ సిటీలో భాగమైన ప్రాంతంలో ప్రభుత్వ భూమిపట్టా ప్రైవేటు పరమైంది. ఏ ప్రతిపాదికన ఈ భూమిని ప్రైవేటు పరం చేశారనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. రెవెన్యూ అధికారులు సైతం సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూములను ప్రైవేటుపరం చేసేందుకు ధరణిని అందుబాటులోకి తీసుకోచ్చారనే బలమైన ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారుల ప్రమేయంతోనే ఈ తతంగం నడిచినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అప్పటి ఆర్డీవో కీలక పాత్ర పోషించి 90 ఎకరాల భూమిని ప్రైవేటు నిర్మాణదారులకు కట్టబెట్టారు. కోట్ల విలువైన భూమిని అక్రమార్కుల చేతుల్లోకి పోతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
నాటి నేతల ఘనకార్యం…
అధికారముంటే అసాధ్యమైన పనిని కూడా సుసాధ్యం చేసుకోవచ్చనే వాదనకు ఈ భూమార్పిడే నిదర్శనం. గత ప్రభుత్వంలో ఓ రూరల్ జిల్లాకు చెందిన మంత్రి సహాయంతో వైష్ణవి కన్స్ట్రక్షన్కు 90 ఎకరాల సీలింగ్ భూమిని పట్టాగా (Vaishnavi Constructions) మార్పారు. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఔటర్‌కు అర కిలోమీటర్లో ఉన్న ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారు. 1975లో సిలీంగ్ యాక్ట్ ప్రకారం, 90 ఎకరాలను ప్రభుత్వ భూమిగా డిక్లరేషన్ చేశారు. 45 యేండ్లుగా ప్రభుత్వ ఆధీనంలోనున్న ఆ భూమిని చట్టవిరుద్దంగా ప్రైవేటుపరం చేశారు. దీనంతటికీ కారణం అధికార పార్టీ నేతల ప్రమేయంతోనే అప్పటి అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది. అందులో భాగంగానే వందల కోట్ల విలువైన భూమి ఆగమైంది. ఇప్పటి ఆ భూమి బీడుగానే ఉండటం విశేషం.
Read Als0- Mrutyunjaya Yagna: రోడ్డు ప్రమాదాలు తగ్గాలని ఆకాంక్షిస్తూ.. సంగారెడ్డి జిల్లాలో మృత్యుంజయ యజ్ఞం
అసలు కథ ఇదే…
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ గ్రామంలోని 272 నుంచి 283 వరకు గల సర్వే నెంబర్లలో 90 ఎకరాల భూమి సీలింగ్ భూమి. గిరిదరిదాస్ పట్టాదారుడి వద్ద సర్‌ప్లస్ ల్యాండ్ సిలీంగ్ యాక్ట్ ప్రకారం, సీసీ నెం.1/3373/75 1975 రికార్డులో నమోదు చేశారు. ఈ భూమిని 38 ఈ టెనెన్సీ యాక్ట్ ద్వారా ఎల్/794/795/796 అర్డర్‌తో రెగ్యులరైజ్ చేసుకున్నారు. అయితే, అదనపు కలెక్టర్ రెవెన్యూ వద్ద 2024లో ఏవోఎల్ఆర్ అర్డర్‌తో ప్రభుత్వ భూమి అంటూ స్టే తీసుకున్నారు. రెవెన్యూ విభాగంలోని అదనపు కలెక్టర్ ఇచ్చిన స్టే అర్డర్‌పై వైష్ణవి కంపెనీ ప్రతినిధులు సుమారుగా 30 రిట్ పిటిషన్లు హైకోర్టులో వేశారు. ఈ రిట్ పిటిషన్లు వేసి నెలలు గడుస్తున్నా రంగారెడ్డి జిల్లాలోని రెవెన్యూ అధికారులు, సంబంధిత సెక్షన్ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు. గత ప్రభుత్వంలో రెవెన్యూ యాక్ట్‌కు విరుద్దంగా సర్కార్ భూములను ప్రైవేట్ పరం చేశారు. ఈ భూముల నిబంధనలకు విరుద్దంగా జరిగితే కాపాడుకోవాల్సిన అధికారులు ఎందుకు మౌనంగా వహిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ ప్రభుత్వంలోని పెద్దలు కూడా వైష్ణవి కంపెనీకి మద్దతు పలుకుతున్నారా? అనే అనుమానాలున్నాయి.
Read Also- Bigg Boss Telugu 9: వార్ ఫర్ పవర్.. మరోసారి టార్గెట్ తనూజ.. హౌస్ సపోర్ట్ ఎవరికి?
భూ విస్తీర్ణం వివరాలు…
భవిష్యత్తులో రంగారెడ్డి జిల్లాకు గుండెకాయగా మారే ప్రాంతంలో భూ అక్రమాలు జరుగుతున్నాయి. అభివృద్ధి సంక్షేమంలో భాగంగా పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు భూసేకరణ చేస్తున్నారు. అందుకోసం ప్రైవేటు పట్టాదారుల వద్ద భూ సేకరణ చేసేందుకు ప్రభుత్వం తంటాలు పడుతుంది. కానీ అదే ప్రభుత్వ భూమిని కాపాడుకోకుండా బడా వ్యాపారులకు కట్టబెట్టడం సులభంగా మారిపోయింది.రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వెనుక భాగంలోనే 90 ఎకరాల ప్రభుత్వం స్థలం మాయమైతుంటే పట్టించుకోకపోవడం దారుణం. ఇక్కడ ఎకరం విలువ సుమారుగా రూ.10కోట్లు ఉంటుంది. 90 ఎకరాలకు రూ.900ల కోట్ల భూమి భారీస్థాయిలోనున్న రియల్ కంపెనీ చేతుల్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లల్లో 272లో 9ఎకరాల37 గుంటలు, 273లో 10 ఎకరాల 37 గుంటలు, 274లో 10 ఎకరాల 7గుంటలు, 275లో 9 ఎకరాల 39గుంటలు, 276లో 12 ఎకరాల 26 గుంటలు, 277లో 6ఎకరాల 31 గుంటలు, 278లో 9 ఎకరాల 32 గుంటలు, 279లో 9 ఎకరాల 31 గుంటలు, 280లో 10 ఎకరాల 39 గుంటలు, 281లో 10 ఎకరాల 7 గుంటలు, 282లో 15 ఎకరాల 7 గుంటలు, 283లో15 ఎకరాల 20 గుంటల భూమి చోప్పున సీలింగ్ పట్టాగా మార్పు చెందింది.
స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వానికి ఫిర్యాదు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అన్యాక్రంతమైన ప్రభుత్వ భూమిని రక్షించాలని పలుమార్లు స్ధానిక ఎమ్మెల్యే సీఎం, డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారు. భవిష్యత్తు అవసరాల కోసం అనువైన ప్రభుత్వ భూమిని రక్షించాలని ప్రభుత్వాని కోరారు. దీంతో సీఎంవో అధికారులు కూడా రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ సీఎంవో ఆదేశాలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏడాది కింద ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఆ భూమిపై ఏలాంటి వివరాలు సేకరించలేదని తెలుస్తోంది. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే మరిచిపోయాడని ఉద్దేశ్యంతోనే అధికారులు జాప్యం చేస్తున్నారా అనే ప్రచారం సాగుతుంది. గత ప్రభుత్వంలో రెవెన్యూ నిబంధనలకు విరుద్దంగా సర్కార్ భూములను పట్టాలు చేసుకోని రియల్ వ్యాపారులు ఎంజాయ్ చేస్తున్నారు.
