CM Revanth Reddy (Image Source: Twitter)
తెలంగాణ

CM Revanth Reddy: కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ బ్యాడ్ బ్రదర్స్.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. సీఎం రేవంత్

CM Revanth Reddy: తెలంగాణకు ప్రధాన ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదారాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. 2004 -2014 వరకు హైదరాబాద్ గ్రోత్ ఇంజన్‌గా ఉండేదని పేర్కొన్నారు. నగరానికి ఓఆర్ఆర్, శంషాబాద్ విమానాశ్రయం, మెట్రో రైలు తీసుకొచ్చినది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు.

అభివృద్ధికి బీజం వేసిందే కాంగ్రెస్

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఒకటే సూచన చేయదలచుకున్నా అంటూ సీఎం రేవంత్ మీడియా సమావేశాన్ని ప్రారంభించారు. ‘2004 నుంచి 2014 వరకు పదేళ్లు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభివృద్ధిని పోల్చి చూసి ఓటు వేయండి. హైదరాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్, మెట్రో, నాలెడ్జ్ సెంటర్స్, ఐటీ, ఫార్మా ఇలా… అన్ని రంగాల అభివృద్ధికి కాంగ్రెస్ బీజం వేసింది ఐటీఐఆర్ హైదరాబాద్ రాకుండా చేసింది బీఆరెస్, బీజేపీ కాదా? కాంగ్రెస్ తీసుకున్న ప్రణాళికలతోనే హైదరాబాద్ ఆదాయం పెరిగింది. వరదల్లో హైదరాబాద్ మునిగిపోతే కిషన్ రెడ్డి కేంద్రం నుంచి చిల్లిగవ్వ తీసుకురాలేదు. సచివాలయంలో ఆలయం కూల్చేస్తే కిషన్ రెడ్డి స్పందించలేదు’ అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రూ.లక్ష కోట్లు గోదావరిపాలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాళేశ్వరం కట్టి రూ. లక్ష కోట్లు గోదావరిపాలు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘ప్రగతి భవన్ కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి మాత్రమే ఉపయోగపడింది. కొడుకు కోసం వాస్తు సరిద్దడానికి ఉన్న సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టిండ్రు. సచివాలయం నిర్మిస్తే ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? ఎవరికైనా పనికొచ్చిందా?. పేద ప్రజలకు ఆ సచివాలయంతో ఏమైనా ప్రయోజనం ఒనగూరిందా. ఫోన్ ట్యాపింగ్ కోసం కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకున్నారు. సద్దాం హుస్సేన్ లా ప్రాణభయంతో తనను తాను కాపాడేందుకు ప్రగతి భవన్ లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ లు కట్టుకుండు. రూ.8 లక్షల 11 వేల కోట్ల అప్పుతో మాకు రాష్ట్రాన్ని అప్పగించారు’ అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

10 ఏళ్లలో మెట్రో ఎందుకు విస్తరించలేదు?

ఆనాడు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విద్యా సంస్థలే మనకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ‘కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ను రద్దు చేయడం తప్ప వీళ్లు ఒక్క అదనపు ఎయిర్ పోర్టునైనా తెచ్చారా? పదేళ్లలో మెట్రోను ఒక కిలోమీటరైనా విస్తరించారా? నగర విస్తరణతో పాటు మెట్రో విస్తరణ ఎందుకుచేయలేదు? కాంగ్రెస్ మొదలు పెట్టిన సాగునీటి ప్రాజక్టులను పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు? పదేళ్లలో రూ.20 లక్షల కోట్ల బడ్జెట్ ను ఏం చేశారో సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును కూడా అమ్ముకున్నారు. పదేళ్ల కోసం కొత్త ప్రణాళికలు రచిస్తున్నాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకుంటున్నాం’ అని రేవంత్ రెడ్డి తెలిపారు.

కిషన్ రెడ్డి, కేటీఆర్.. బ్యాడ్ బ్రదర్స్

హైదరాబాద్ నగర ప్రజల కోసం పరితపించిన పీజేఆర్, శశిధర్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేవారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు కిషన్ రెడ్డి, కేటీఆర్ ను బ్యాడ్ బ్రదర్స్ అంటున్నారని పేర్కొన్నారు. ‘మెట్రో, గోదావరి జలాలు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీని బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారు. మేం వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు లకు అనుమతులు తీసుకొచ్చాం. మరిన్ని ఎయిర్ పోర్టులకు అనుమతులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. డ్రై పోర్టు ఏర్పాటు కోసం గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మించేందుకు అనుమతులు తెచ్చుకున్నాం. ఎలీ లిల్లీ లాంటి కంపెనీ 1 బిలియన్ డాలర్స్ ఫార్మాలో పెట్టుబడులు పెడుతోంది. రెండేళ్లలో ఒక ఏడాది ఎన్నిక కోడ్ తో అభివృద్ధి జరగలేదు. మిగిలిన ఏడాదిలో 3 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం. వేలాది కోట్లు తెచ్చి నగర విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం’ అని రేవంత్ పేర్కొన్నారు.

‘నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం’

తెలంగాణ ప్రజలకు ఉపయోగంలేని ప్రగతి భవన్, కాళేశ్వరం, కమాండ్ కంట్రోల్, సచివాలయం చూపించి ఇంకా ఎన్నాళ్ళు కాలం గడుపుతారని బీఆర్ఎస్ నేతలను రేవంత్ ప్రశ్నించారు. ‘కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు దండుకుని దోచుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పని చేశారా? కేటీఆర్ తీసుకొచ్చింది కేవలం గంజాయి, డ్రగ్స్ మాత్రమే. మీ బావమరిది డ్రగ్స్ తీసుకుని దొరికింది నిజం కాదా? నగర అభివృద్ధిపై బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరూ ఎక్కడ చర్చకు వచ్చినా మేం సిద్ధంగా ఉన్నాం. నగరాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రజా ప్రతినిధుల సహకారం ఉండాలి. అందుకే జూబ్లీహిల్స్ గెలవాల్సిన అవసరం ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ సహకరించి ఉంటే నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకునే వాళ్లం. మెట్రో విస్తరణ చేసుకుందాం, గోదావరి జలాలు తెచ్చుకుందాం, మూసీ ప్రక్షాళన చేసుకుందాం’ అని రేవంత్ రెడ్డి

‘హైడ్రాపై కేటీఆర్ కక్ష పెంచుకున్నారు’

మూసీ ప్రక్షాళనను కిషన్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. ఎందుకు కేటీఆర్ కు లొంగిపోయావని ప్రశ్నించారు. ‘నగరంలోని 695 చెరువులలో 44 చెరువులను బీఆర్ఎస్ కబ్జా చేసింది. మీరు ఆక్రమించుకున్న చెరువులను విధించినందున హైడ్రా పై విషం చిమ్ముతున్నారు. బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న ఎడ్ల సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ కాదా? సున్నం చెరువు, నల్ల చెరువును ఆక్రమించుకుంది నిజం కాదా? వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించి నగరంలో రోడ్లపై నీళ్లు నిలవకుండా చేసింది హైడ్రా కాదా? ఈగల్ ఫోర్స్, హైడ్రా పై కేటీఆర్ కక్ష పెట్టుకున్నాడు. హైడ్రా ఎక్కడ తప్పు చేసిందో చెప్పు నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. కేసీఆర్ కుటుంబంతో ఉండే వాళ్ళందరినీ హరీశ్ రావు బయటకు పంపేశారు. ఇప్పుడు ఇంట్లో కవితను కూడా బయటికి పంపేలా చేశారు. వీళ్లా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది’ అంటూ రేవంత్ ప్రశ్నించారు.

జూబ్లీహిల్స్ ప్రజలకు కీలక విజ్ఞప్తి

విజ్ఞత కలిగిన జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచనతో ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. ‘హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తాం. గంజాయి, డ్రగ్స్ కనిపిస్తే తొక్కి నార తీస్తాం. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తాం. జూబ్లీహిల్స్ లో ఒక్కసారి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వండి. నవీన్ యాదవ్ ను రౌడీ అని మాట్లాడుతున్నారు. ఎవరు రౌడీ?. దీపావళి పండుగ రోజున గంజాయి కొట్టేవాడు రౌడీ అవుతాడా? పేదోళ్లకు అండగా నిలబడేవాడు రౌడీ అవుతాడా? అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే మీ ఏడుపు ఎందుకు?. సర్వేలపై చర్చ అవసరం లేదు. నిజం నవంబర్ 14న అందరికీ తెలుస్తుంది. బీఆర్ఎస్ ను ఓడించండి. బీజేపీ డిపాజిట్ గల్లంతు చేయండి’ అని జూబ్లీహిల్స్ ఓటర్లకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Also Read: Harish Rao On CM: సీఎం రేవంత్ బ్లాక్ మెయిలర్.. జూబ్లీహిల్స్‌‌లో బుద్ధి చెప్పాలి.. హరీశ్ రావు ఫైర్

Just In

01

Vaishnavi Constructions: సీఎంవో ఆదేశాలు బేఖాతరు.. రూ.900 కోట్ల విలువైన భూమికి ఎసరు​

Anushka Shetty: అనుష్క బర్త్‌డే స్పెషల్.. ‘కథనార్’ ఫస్ట్ లుక్ విడుదల

Private Colleges Opening: రేపటి నుంచి ప్రైవేటు కాలేజీలు ఓపెన్.. వెనక్కితగ్గిన యాజమాన్యాలు

Mrutyunjaya Yagna: రోడ్డు ప్రమాదాలు తగ్గాలని ఆకాంక్షిస్తూ.. సంగారెడ్డి జిల్లాలో మృత్యుంజయ యజ్ఞం

Bus Seat Dispute: ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి.. బస్సులో అసలేం జరిగిందో తెలిస్తే షాకే!