CM Revanth Reddy: ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే కళాశాలలైనా, రాజకీయ పార్టీలైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విడతలవారీగా నిధులు విడుదల చేస్తామన్న సీఎం.. విద్యార్థులను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాకనే కొత్తగా సమస్యలు వచ్చినట్లు కొందరు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఫీజు రీయింబర్స్ మెంట్ సమస్యలు లేవా అంటూ ప్రశ్నించారు.
మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటకాగుతున్నారో తనకు బాగా తెలుసని కొన్ని ప్రైవేటు కాలేజీలను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అది తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాళ్లం కాదని పేర్కొన్నారు. ‘తమాషాలు చేస్తే తాట తీస్తాం’ అంటూ ఘాటుగా హెచ్చరించారు. తమ హయాంలో ఉన్న బకాయిలను తొలి ప్రాధాన్యత కింద చెల్లిస్తామని పేర్కొన్నారు. విద్యను సేవగా భావించాలి తప్పా వ్యాపారంగా చూడకూడదని హితవు పలికారు. అడిగినంత ఇవ్వలేదని కాలేజీలు మూసేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. బ్లాక్ మెయిల్ చేస్తామంటే ప్రభుత్వం సహించదని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఐదారేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee reimbursement) బకాయిల్లో కనీసం రూ.5 వేల కోట్లు తక్షణమే విడుదల చేస్తేనే కాలేజీల బంద్ విరమిస్తామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ (Federation of Association of Telangana Higher Education Institutions) ప్రకటించింది. బకాయిల విడుదల కోసం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సహా డిప్యూటీ సీఎం, మంత్రులు హామీలు ఇచ్చినా ఒక్కటీ నెరవేరలేదని ఫతీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Also Read: CM Revanth Reddy: కిషన్‌రెడ్డి, కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. సీఎం రేవంత్
హైదరాబాద్‌లో శుక్రవారం సమావేశమైన ఫతీ ఎగ్జిక్యూటివ్ కమిటీ.. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల కోసం ప్రభుత్వం వేసిన కమిటీ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. ఫతీ చైర్మన్ డాక్టర్ రమేష్ బాబు (Dr. Ramesh Babu) మాట్లాడుతూ.. సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో గత్యంతరం లేక ఈ నెల 3 నుంచి అన్ని ప్రైవేట్ కాలేజీల మేనేజ్‌మెంట్‌లు సమ్మెకు దిగాయని తెలిపారు. బకాయిల కారణంగా ప్రైవేట్ కాలేజీల్లో పనిచేసే సిబ్బందికి నెలల తరబడి జీతాలు పెండింగ్‌లో ఉంటున్నాయని చెప్పారు. సమ్మె కారణంగా జేఎన్టీయూ(JNTU), ఓయూ(OU), ఎంజీయూ(MGU) వంటి యూనివర్సిటీల్లో జరిగే పరీక్షలను నిర్వహించలేమని కూడా ఆయన స్పష్టం చేశారు.
