Vande Mataram: ‘వందేమాతరం’ (Vande Mataram) ఈ గేయం వినపడగానే భారతీయుల్లో దేశభక్తి భావం ఉప్పొంగుతుంది. స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో ప్రేరణగా నిలిచిన మహాగేయం ఇది. బంకిం చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ఈ గేయం, భరతమాతను దేవతా రూపంలో వర్ణిస్తుంది. జాతీయోద్యమ కాలంలో ఈ గేయం స్వాతంత్ర్య సమరయోధుల హృదయాలలో జవసత్వాలను నింపింది. దేశభక్తికి ప్రతీక నిలిచే ఈ గేయాన్ని శుక్రవారం అత్యంత ఆసక్తికర రీతిలో ఓ వివాహ వేడుకలో ఆలపించారు.
సంగారెడ్డి జిల్లాలో ఘటన
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం, బొంతపల్లి గ్రామంలో ఓ పెళ్లిలో ఈ గేయాన్ని ఆలపించారు. వీరశైవ లింగాయత్ కళ్యాణ మండపంలో వికారాబాద్ జిల్లా బీజేపీ కార్యదర్శి బుస శ్రీకాంత్ వివాహ వేడుకలో వందేమాతర గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులతో పాటు వివాహానికి హాజరైన బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2025 నవంబర్ 7తో వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సామూహిక వందేమాతర గీతాలాపన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో అన్ని చోట్లా నిర్వహించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒక స్మారక కార్యక్రమాన్ని ప్రారంభించి, వందేమాతరం స్మారక పోస్టల్ స్టాంప్ నాణేన్ని విడుదల చేశారు. కాగా, 1875 నవంబర్ 7న బంకిం చంద్ర ఛటర్జీ వందేమాతరం గేయాన్ని రచించారు.
