Police Attacked
క్రైమ్

Miyapur: మియాపూర్‌లో 144 సెక్షన్

– 29వ తేదీ వరకు అమలు
– ప్రభుత్వ భూముల ఆక్రమణకు ప్రయత్నం
– అడ్డుకున్న పోలీసులపై రాళ్లదాడి
– గుడిసెలు వేసుకోవచ్చని రెచ్చగొట్టిన వారిపై కేసులు
– రాళ్లు రువ్వినవారిపైనా..
– భూమి వద్ద వెయ్యి మంది ఫోర్స్
– అనుమానాస్పదంగా తిరిగితే అరెస్టులు: సీపీ మొహంతీ

144 section: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో కొందరు ప్రభుత్వ భూమి ఆక్రమణకు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోగా రాళ్లదాడికి దిగడం కలకలం రేపింది. పరిస్థితులు అదుపులో ఉండేలా, శాంతి భద్రతలను కాపాడేలా పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంది. మియాపూర్, చందానగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధించింది. ఈ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ అర్ధరాత్రి వరకు ఇది అమల్లో ఉంటుందని సైబరాబాద్ సీపీ అవినాశ్ మొహంతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న శాంతి భధ్రత పరిస్థితుల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలను నివారించడానికి ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ఏం జరిగింది?

శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మియాపూర్ సమీపంలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్‌ 100, 101లో దాదాపు 525 ఎకరాల్లో గుడిసెలు వేయడానికి రెండు వేల మంది ప్రయత్నించారు. ఇది తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారు ఆగ్రహించి పోలీసులపైనే రాళ్లు రువ్వడంతో ఆ ప్రాంతం రణస్థలిగా మారిపోయింది. పరిస్థితులను అదుపులోకి తేవడానికి స్వల్పంగా లాఠీ చార్జ్ చేశారు.

తెర వెనుక స్టోరీ..

మియాపూర్ ప్రభుత్వ భూములపై చాలా మంది కన్నేశారు. ఇది ప్రభుత్వ భూమి కావడం, గజం లక్ష వరకు పలుకుతుండటంతో కబ్జారాయుళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఈ భూమిని కబ్జా చేసుకోవచ్చని ప్రజలను కొందరు తప్పుదారి పట్టించారు. సంగీత, సీత సహా పది మంది చాలా మంది మహిళలను రెచ్చగొట్టారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని ఆక్రమించుకోవచ్చని, ఆ భూములను స్వాధీనం చేసుకుందామని రెచ్చగొట్టినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఏకంగా స్థానిక ఫంక్షణ్ హాల్‌లో మీటింగ్ ఏర్పాటు చేసి మరీ వారిని తప్పుదోవ పట్టించారు. పేదలకు ఆశ చూపి డబ్బులు కూడా వసూలు చేసినట్టు సమాచారం. ఆ తర్వాతే వారు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ప్రభుత్వ భూమి ఆక్రమణకు రెచ్చగొట్టిన సంగీత, సీత, సంతోష్‌లు సహా పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే.. ప్రభుత్వ భూముల్లో పాగా వేసి పోలీసులపై రాళ్లు రువ్విన వారిపైనా కేసులు నమోదయ్యాయి.

సీపీ మొహంతి సూచనలు

మియాపూర్, చందానగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉన్నదని సైబారాబాద్ సీపీ అవినాశ్ మొహంతీ తెలిపారు. ప్రభుత్వ బూమిని ఆక్రమించడానికి వచ్చిన వారిని ఖాళీ చేయించామని చెప్పారు. పోలీసులపై శనివారం కొంత మంది రాళ్లు రువ్వారని, లా అండ్ ఆర్డర్ తప్పేలా వ్యవహరించారని గుర్తు చేస్తూ ఈ ఘటన వెనుక ఉన్నవారిపై కేసులు నమోదు చేసినట్టు వివరించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవచ్చని ప్రజలను తప్పుదోవ పట్టించారని తెలిపారు. ఇలాంటి వదంతులను ఎవరూ నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వ భూమి కాబట్టి ఇక్కడ ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశామని, దాదాపు వేయి మంది ఫోర్స్‌ను పెట్టామని వివరించారు. ఈ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగితే అరెస్టు‌లు ఉంటాయని హెచ్చరించారు.

ఇది వరకే కబ్జాదారుల కన్ను

ఇక్కడ ఉన్న 525 ఎకరాల భూమి దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌కు తరలిపోయిన వారిగా ప్రభుత్వం పరిగణించింది. ఈ భూములను హెచ్ఎండీఏకు అప్పగిస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ భూములను తాము గతంలోనే కొన్నామని 32 మంది కోర్టులకు వెళ్లారు. కింది కోర్టుల నుంచి హైకోర్టుల వరకు తీర్పులు ప్రభుత్వానికి అనుకూలంగానే వచ్చాయి. దీంతో వారు సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేశారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉన్నప్పటికీ భూమి డిమాండ్ నేపథ్యంలో ఆక్రమణదారులు రకరకాల తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు.

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..