Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారానికి ఇంకా మూడు రోజుల గడువు మాత్రమే ముగిలి ఉన్నది. గత నెల 26వ తేదీన బరిలో నిలిచిన అభ్యర్థులను ఖరారు చేసినప్పటి నుంచి అభ్యర్థులు ప్రచారంలో తలమునకలయ్యారు. బరిలో ఏకంగా 58 మంది అభ్యర్థులుండగా, ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతి పక్షమైన బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య నెలకొన్నది. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ప్రచారం పోటాపోటీగా అన్నట్టు కొనసాగుతున్నది. అధికార పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి నియోజకవర్గంలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందుకు ధీటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి తరఫున ఎంపీలు ప్రచార కార్యక్రమంలో నిమగ్నమయ్యారు.
ఎన్నికల సంఘం అలర్ట్
ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెర పడనున్నది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసే అవకాశమున్నందున, ఎన్నికల సంఘం అధికారులు ముందుగానే అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమలయ్యే దిశగా ప్రచారం జరుగుతుందా? చేస్తున్న ప్రచారానికి అవుతున్న ఖర్చును అభ్యర్థి తన ఖాతాలో జమ చేస్తున్నారా లేదా అనే విషయంపై పరిశీలకులు స్పెషల్‌గా దృష్టి సారించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన సెప్టెంబర్ 30వ తేదీ నుంచే అక్రమంగా మందు, నగదు తరలింపును ఎక్కడికక్కడే అడ్డుకుంటున్న ఎఫ్ఎస్‌టీ, ఎస్ఎస్‌టీ బృందాలు రానున్న మూడు రోజుల పాటు అభ్యర్థుల ప్రచారం, కదలికలపై రహస్య నిఘాను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థుల ప్రచార కార్యక్రమ శైలిని వీడియో రికార్డింగ్ చేసేందుకు ప్రతి అభ్యర్థి వెంట ఓ షాడో టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Also Read: Mexican President: మెక్సికో దేశ అధ్యక్షురాలు క్లాడియా పై లైంగిక వేధింపులు
11న సా.5 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
చివరి మూడు రోజుల ప్రచారంపై ఎన్నికల సంఘం డేగ కన్ను వేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే వ్యయ, పోలీస్, సాధారణ పరిశీలకులుగా వచ్చిన అధికారులు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రహస్య ప్రణాళికలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ మూడు రోజుల పాటు చేసే ప్రచార శైలిని పరిగణనలోకి తీసుకుని, వ్యయాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు, ఈ నెల 11 సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.
Also Read: Leopard Attack: చిరుత కలకలం.. కాపుకాసి లేగదూడపై దాడి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
