Manikonda Firing Case: వారం రోజులక్రితం హైదరాబాద్‌లోని మణికొండలో కాల్పులు జరిగాయంటూ (Manikonda firing case) తీవ్ర కలకలం రేగిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కొడుకు అభిషేక్ గౌడ్‌కు, ఏపీ మాజీ మంత్రి ప్రభాకర్ అల్లుడుకు మధ్య పంచవటిలోని ఓ ప్రాపర్టీ విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఈ విషయంలో కేఈ ప్రభాకర్ కాల్పులు జరిపారని, కేసు నమోదయిందంటూ వార్తలు వచ్చాయి. కానీ, అవన్నీ అబద్ధమని పోలీసులు చెబుతున్నారు. ఎలాంటి కాల్పులు జరగలేదని అంటున్నారు.
కాల్పుల ఘటన వ్యవహారంపై రాయదుర్గం సీఐ వెంకన్న స్పందించారు. కాల్పుల ఘటనకు సంబంధించిన వార్తల నేపథ్యంలో అన్ని వెరిఫై చేశామని, కేఈ ప్రభాకర్ వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని వెల్లడించారు. గన్‌మెన్ కూడా లేరని స్పష్టం చేశారు. ఇద్దరి ఫిర్యాదులపైనా కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసులను చట్టప్రకారం విచారిస్తున్నామని సీఐ వెంకన్న తెలిపారు. అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని వివరించారు.
Read Also- Komati Reddy: జూబ్లీహిల్స్ ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. కేసీఆర్‌పై పంచ్‌లు
కాల్పులు జరిగాయి: వెంకటేష్ గౌడ్
కాల్పులు జరిగాయని బాధితుడు వెంకటేష్ గౌడ్ అంటున్నారు. ఓ బిల్డింగ్‌కు సంబంధించిన డబ్బు విషయంలో తాము అక్టోబర్ 25న కేఈ ప్రభాకర్ వద్దకు వెళ్లామని, మద్యం మత్తులో ఉన్న కేఈ ప్రభాకర్ తమను బెదిరించారని ఆయన చెప్పారు. రివాల్వర్‌తో ప్రభాకర్ కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయామని వివరించారు. కాల్పులు జరిగిన రోజే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు. పోలీసులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని వెంకటేష్ గౌడ్ ఆరోపించారు. కేఈ ప్రభాకర్ నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు.
Read Also- Shiva 4K Trailer: ‘శివ’ రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది చూశారా.. ఏంటి భయ్యా ఆ ర్యాంపేజ్..
కేఈ ప్రభాకర్ ఏమన్నారంటే
కాగా, కాల్పుల ఘటన ఫిర్యాదుపై కేఈ ప్రభాకర్ కూడా స్పందించారు. వెంకటేష్ గౌడ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. గత నెల 25నే వెంకటేష్ గౌడ్‌పై ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. తన ఫిర్యాదుతో వెంకటేష్ గౌడ్‌ను పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు. తాను ఎవరికీ డబ్బులు చెల్లించాల్సింది లేదన్నారు. తన కష్టార్జితంతో ఇల్లు కట్టుకున్నానని కేఈ ప్రభాకర్ పేర్కొన్నారు. అభిషేక్, వెంకటేష్ గౌడ్ కలిసే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.
కాగా, కేఈ ప్రభాకర్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుటుంబం మధ్య వివాదం, ఘర్షణ కలకలం రేపింది. ప్రభాకర్ అల్లుడు, నందీశ్వర్ గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్‌కు ప్రాపర్టీ విషయంలో విభేదాలు తలెత్తాయి. బెదిరింపుల వ్యవహారంపై ఇరువర్గాలు ఒకరిపై మరొకరు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
