Plastic Containers: ఇంటి వంట గదుల్లో ఇప్పటికి ఎంతో మంది ప్లాస్టిక్ వినియోగిస్తుంటారు. ఆహారాన్ని నిల్వచేయడం, వేడి చేయడం లేదా నీటిని ఉంచడం అన్నీ ప్లాస్టిక్ కంటైనర్లలోనే వాడుతున్నారు. కానీ వైద్య నిపుణులు చెబుతున్నదేమిటంటే, ఈ అలవాటు మన ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలను కలిగించవచ్చని చెబుతున్నారు.
ప్లాస్టిక్ వల్ల కలిగే హానికర ప్రభావాలు
ది లాన్సెట్, ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, ప్లాస్టిక్‌లో ఉండే సూక్ష్మ కణాలు, ముఖ్యంగా డయిథైల్హెక్సిల్ ఫ్తాలేట్ (DEHP) వంటి రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయని వెల్లడించాయి. ఈ రసాయనాలు ఆహార కంటైనర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, వైద్య పరికరాల్లో ఉంటాయి. ఇవి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షల కంటే ఎక్కువ గుండె సంబంధిత మరణాలకు కారణమవుతున్నాయి అని నివేదికలు చెబుతున్నాయి.
డ్రై ఫుడ్ ప్లాస్టిక్‌లో ఉంచడం సురక్షితమేనా?
“చల్లని నీరు లేదా డ్రై ఫుడ్‌ను ప్లాస్టిక్ కంటైనర్‌లో ఉంచడం కొంతవరకు సురక్షితం, కానీ వేడి ఆహారం లేదా నేరుగా మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్ కంటైనర్ ఉపయోగించడం చాలా ప్రమాదకరం” అని హెచ్చరిస్తున్నారు. వేడి వల్ల ప్లాస్టిక్‌లోని రసాయనాలు ఆహారంలోకి కలిసిపోతాయని, ఇవి దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని డాక్టర్స్ చెబుతున్నారు.
ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా ఆపడం సాధ్యమేనా?
ప్లాస్టిక్‌ను పూర్తిగా మానేయడం చాల కష్టమే. కానీ, నిపుణులు చెబుతున్నట్లుగా, జాగ్రత్తగా వినియోగించడం వలన ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్‌కి ప్రాధాన్యత ఇవ్వడం, వేడి పదార్థాలను ప్లాస్టిక్‌లో ఉంచకపోవడం, ప్రజల్లో అవగాహన పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ప్లాస్టిక్ వాడకంలో చేయాల్సినవి, చేయకూడనివి
చేయాల్సినవి (Dos):
1. BPA-రహిత, స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా గ్లాస్ కంటైనర్లు ఉపయోగించండి.
2. బయోడిగ్రేడబుల్ లేదా పర్యావరణానికి హానికరం కాని ప్యాకేజింగ్ మెటీరియల్ ఎంచుకోండి.
3. DEHP లేదా BPA ఉన్న ఉత్పత్తులను దూరంగా ఉంచండి.
చేయకూడనివి (Don’ts):
1.ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారం వేడి చేయకండి అలాగే మైక్రోవేవ్‌లో పెట్టకండి.
2. వేడి, నూనెపదార్థాలు, ఆమ్లపదార్థాలను ప్లాస్టిక్‌లో నిల్వ చేయకండి.
3. ప్లాస్టిక్ కంటైనర్లను నేరుగా ఎండలో ఉంచకండి.
4. సింగిల్-యూజ్ బాటిల్స్ లేదా కంటైనర్లను మళ్లీ ఉపయోగించకండి.
వైద్య నిపుణులు చివరిగా ఏం చెబుతున్నారంటే.. “ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా ఆపలేకపోయినా, జాగ్రత్తగా వాడితే ఆరోగ్యానికి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు” అని సూచిస్తున్నారు.
గమనిక: పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
