Check Unemployment Problem With Skill Development
Editorial

Unemployment: నైపుణ్యాభివృద్ధితోనే నిరుద్యోగ సమస్యకు చెక్..

Check Unemployment Problem With Skill Development: తెలంగాణ అనేది ఒక రాష్ట్రంగా ఏర్పడి, తన స్వయంపాలనలో దేశంలోనే ఒక అత్యుత్తమమైన రాష్ట్రంగా ఎదగాలనేది నాటి ఉద్యమకారుల ఆకాంక్ష. అయితే, రాష్ట్ర ఆవిర్భవించి పదేళ్లయినా, సుపరిపాలన మాత్రం తీరనికలగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి, పాలనా బాధ్యతలు చేపట్టింది. ప్రగతిశీల భావాలతో, వాస్తవిక దృక్పథంగా పనిచేస్తూ ఆయా రంగాలలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. ప్రపంచీకరణ పరిణామాల మూలంగా అందివస్తున్న ప్రతి అవకాశాన్ని తెలంగాణ అందిపుచ్చుకోవాలని, అప్పుడే మిగిలిన ప్రపంచంతో మనం పోటీపడగలమని యువతకు బోధపరుస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించిన రాజధాని హైదరాబాద్ నగరానికి మరిన్ని హంగులు చేకూర్చటం ద్వారా దానిని ప్రపంచ స్థాయి నగరంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజులలోనే ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొని రూ. 40 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకోవటం ద్వారా తెలంగాణలోని ఫార్మా, ఐటీ రంగాలతో పాటు తయారీ రంగానికి కొత్త ఊతాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీటవేస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన మీద దృష్టి సారించి, నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు ముందడుగు వేశారు.

తెలంగాణ మొత్తం జనాభాలో నాలుగోవంతు నివసించే రాజధాని హైదరాబాద్‌ నగరాన్ని ఫార్మా హబ్, ఐటీ హబ్ గానే కాదు పెట్టుబడుల హబ్ గా మారాలనేదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రెండు ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, ఫార్మా విలేజ్‌ల ఏర్పాటు, బల్క్ డ్రగ్స్ పరిశ్రమల ఏర్పాటు, డ్రైపోర్టుల నిర్మాణం లాంటి నిర్ణయాలతో పాటు హైదరాబాద్ మొత్తాన్ని మూడు జోన్లుగా విభజించి అభివృద్ధిని మరింత సుదూర ప్రాంతాలకు విస్తరించాలనే నిర్ణయం రాబోయే రోజుల్లో భాగ్యనగర రూపురేఖలనే మార్చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాలు ఉపాధి కేంద్రాలుగా మారితే మరింతమందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

Also Read:ఏనుగు వర్సెస్ గాడిద.. గెలిచేదెవరో?

విద్య ఆలోచనలను మార్చగలదు. నైపుణ్యం జీవితాలను మార్చేయగలదు. ఆకాశమే హద్దుగా ప్రపంచం శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాల అస్త్రాలతో దూసుకుపోతున్నది. డిజిటలీకరణ, యాంత్రీకరణ, కృత్రిమ మేధ విజృంభణలతో పాలనలో, ఉద్యోగ విపణిలో శరవేగంగా మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో అనేక పాత ఉద్యోగాలు మాయమైపోతుండగా, సృజనాత్మకతతో కూడిన అనేక ఉద్యోగాలు ఉనికిలోకి వస్తున్నాయి. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోలేని వారు ఈ ఉద్యోగాలను పొందలేకపోతున్నారు. దేశంలో 40 రకాల విభిన్న సామర్థ్య రంగాల్లో కొత్త ఉద్యోగాలుండగా వాటిలో 93 శాతం యువత వీటిలో కేవలం ఏడు రంగాల్లోని ఉద్యోగాలనే అందిపుచ్చుకోగలుగుతున్నారని ఓ సర్వేలో తేలింది. ఈ పరిస్థితిని మార్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కంకణం కట్టుకుని నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు మీద దృష్టి సారించారు. ఇప్పడున్న పోటీ ప్రపంచంలో విద్యార్హతలతో బాటు ఉద్యోగం పొందటానికి అవసరమైన నైపుణ్యాలు మన యువతలో కొరవడ్డాయి. ముందుగా వృత్తి విద్యా ప్రమాణాలను మెరుగుపరచటం మీద ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 65 పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటిఐ)లను రూ. 2324 కోట్ల రూపాయల ఖర్చుతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్‌గా (ఏటిసి) మార్చే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికోసం టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (టీటీఎల్‌)తో ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఏటీసీల్లో శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను నియమించింది. ఏటా 15,860 మందికి 6 రకాల కోర్సుల్లో లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ లభించనుంది. అలాగే 31,200 మందికి 23 రకాల కోర్సుల్లో షార్ట్‌ టర్మ్‌ కోచింగ్ ఇవ్వనుంది. ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.307.96 కోట్లు కాగా.. టీటీఎల్‌ వాటా రూ.2016.25 కోట్లు. ఏటీసీల్లో శిక్షణ పొందిన వారికి టీటీఎల్‌ ఉద్యోగాలు కల్పించనుంది. మల్లేపల్లి ఐటిఐ క్యాంపస్‌లో 4 ఏటీసీలను ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పెట్టుబడి పెట్టే సంస్థలకి స్థానికంగా నైపుణ్యం కల మానవ వనరులను అందించటానికి ఈ ఏటీసీలు దోహదపడాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ ఏటిసిలలో రోబో టెక్నాలజీతో పాటు సాంకేతిక ట్రేడ్ లలో శిక్షణ ఇవ్వడం వలన శిక్షణ పొందిన వారు జాతీయ సాంకేతిక సంస్థలలో చదివిన విద్యార్థులతో పోటీ పడగలగటమే గాక మరెక్కడైనా ఉద్యోగాలు పొందటానికి మార్గం ఏర్పడింది. సర్టిఫికెట్ల ఆధారంగా గాక నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగాలు వచ్చే ఈ రోజుల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలే గాక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. తద్వారా నిరుద్యోగ సమస్యకు చెక్ పెడుతూనే రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలనే వ్యూహంతో ప్రభుత్వం పనిచేస్తోంది. దీనివల్ల దుబాయ్ వంటి సుదూర దేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ నైపుణ్యాల సాధనలో విద్యాలయాల్లో సౌకర్యాల కల్పన కీలకం. కానీ దేశ విద్యాలయాల్లో ల్యాబ్​లు, కంప్యూటర్లు, ఇతర సౌకర్యాలు సుమారు 40 శాతం మాత్రమే ఉన్నాయి. పాఠ్య ప్రణాళిక, బోధన పద్ధతుల్లో పాత మూస విధానాలే కొనసాగుతున్నాయని ప్రపంచ ఆర్థిక నివేదిక, నిరుటి జాతీయ సాధన సర్వేలు చెబుతున్నాయి. అందుకే యువ మానవ వనరులకు నైపుణ్యాలు చేకూరేలా శిక్షణా కేంద్రాలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. రాబోయే పదేండ్లలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ వృత్తి విద్య తర్వాత మెరుగైన ఉద్యోగాలు పొందాలంటే యూనివర్సిటీ స్థాయిలోనూ ఇలాంటి నైపుణ్య కేంద్రాలు పెట్టాల్సిన అవసరం ఉంది. అదే జరిగితే తెలంగాణలో నిరుద్యోగ సమస్య తొలగిపోవటమే గాక ఇతర రాష్ట్రాల వారికీ ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. తద్వారా తెలంగాణ ఆర్థికంగా బలపడగలదు.

– డాక్టర్ తిరునహరి శేషు (పొలిటికల్ ఎనలిస్ట్) కాకతీయ విశ్వవిద్యాలయం

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్