Jogi Ramesh Arrest: విపక్ష వైసీపీ నేతలపై కేసులు, వాటికి సంబంధించిన విచారణలకు కాస్త బ్రేక్ పడినట్టుగా అనిపిస్తున్న తరుణంలో ఆదివారం ఉదయం ఆసక్తికరమైన పరిణామం జరిగింది. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ జోగి రమేశ్‌ను నకిలీ మద్యం తయారీ కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేసి, అనంతరం విజయవాడలోని ఎక్సైజ్ ఆఫీసుకు తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటికి వెళ్లి సిట్ అధికాలు సోదాలు చేపట్టారు. ఈ సోదాలలో సిట్ అధికారులతో పాటు ఎక్సైజ్, పోలీస్, క్లూస్ టీమ్‌లు కూడా పాల్గొన్నాయి. ఈ పరిణామం రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది.
జనార్దన రావు వాంగ్మూలంతోనే అరెస్ట్!
నకిలీ మద్యం కేసులో కీలక ఆధారాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే జోగి రమేశ్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. జోగి రమేశ్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం వ్యవహారం నడిచిందని జనార్దనరావు చెప్పినట్లు పోలీసులు అంటున్నారు. గత సర్కారు హయాంలో రమేశ్ మంత్రిగా ఉన్న సమయంలో ఇబ్రహీంపట్నంలో కూడా నకిలీ మద్యం తయారీ మొదలైందని జనార్దనరావు చెప్పినట్టుగా సిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి తగ్గట్టు జనార్దనరావు ఆఫ్రికాకు వెళ్లడానికి ముందు జోగి రమేశ్ ఇంటికి వెళ్లిన సీసీటీవీ ఫుటేజీ సిట్ అధికారులకు లభ్యమైనట్టు సమాచారం. వీటి ఆధారంగానే రమేశ్‌ను అరెస్ట్ చేసినట్టుగా చెబుతున్నారు. పైగా, అరెస్ట్ సమయంలో పోలీసులకు జోగి రమేశ్ సహకరించలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కాశీబుగ్గ విషాదాన్ని కవర్ చేసేందుకే?
జోగి రమేశ్ అరెస్టును వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య తప్ప మరొకటి కాదని ఆ పార్టీ అగ్రనేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా, కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయం వద్ద శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే సడెన్‌గా ఈ అరెస్ట్ నాటకం మొదలుపెట్టారని వైసీపీ ఆరోపిస్తోంది. ఏకాదశి సందర్భగా ఆలయానికి జనాలు ఎక్కువగా వస్తారంటూ తాను ముందుగా శుక్రవారమే పోలీసులకు సమాచారం ఇచ్చానంటూ, కాశీబుగ్గలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించిన పాండా చెబుతున్న వీడియో ఒకటి వెలుగులోకి రావడంతో ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకే, ఆ అంశంపై జనాల దృష్టిని మళ్లించేందుకు జోగి రమేశ్ అరెస్టును తెరపైకి తీసుకొచ్చిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నుంచి ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు సైతం చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఒక బీసీ నేత అయిన జోగి రమేశ్‌ను నకిలీ మద్యం కేసులో ఇరికించి, అక్రమంగా అరెస్ట్ చేశారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది.
Read Also- Sudheer Babu: అక్కడ కష్టాలు తెలియకపోవచ్చు.. కానీ బాధను అనుభవించా.. సుధీర్ బాబు
మొత్తంగా చూస్తే, నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేశ్ అరెస్టు చట్టపరమైన చర్య అని పాలకపక్షం.. ప్రతిపక్షంపై వేధింపులు, కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన నుంచి దృష్టి మళ్లింపు రాజకీయం అని వైసీపీ వాదిస్తోంది. ఏదేమైనా జోగి రమేష్ అరెస్ట్ వ్యవహారం మరోసారి ఏపీలో రాజకీయ కాక రేపడం ఖాయంగా కనిపిస్తోంది.
.@ncbn గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగిరమేష్… pic.twitter.com/ros9R1o0xY
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2025
