తెలంగాణ గడ్డపై పుట్టి, దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన ఏకైక నాయకుడు పీవీ నరసింహారావు. అసాధారణ ప్రజ్ఞావంతుడైన నేతగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, కవిగా, రచయితగా, అనువాదకుడిగా, మేధావిగా, స్థిత ప్రజ్ఞుడిగా ఆయన కీర్తి గడించారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, ఆర్థిక సంస్కరణలను ప్రారంభించి వడివడిగా దేశాన్ని ముందుకు నడిపిన ధీశాలిగా పేరుగాంచారు. ఆయన సాహసోపేతమైన సంస్కరణల కారణంగానే నేడు భారత్ ఒక ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగిందనే విషయంలో ఎవరికీ రెండవ అభిప్రాయం ఉండక్కరలేదు. ప్రధానిగా తన పాలనా కాలంలో ‘లుక్ ఈస్ట్’ పాలసీ ద్వారా భారత విదేశాంగ విధానాన్ని కొత్త పుంతలు తొక్కించి, ఆసియా దేశాల్లో భారత్ పరపతి పెంచిన ఘనత పీవీదే. 1991 జూన్ 21న, అంటే.. సరిగ్గా 33 ఏళ్ల క్రితం ఇదే రోజున ఆయన దేశ ప్రధానిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పోషించిన పాత్రలను ఓసారి గుర్తుచేసుకుందాం.
పీవీ గురించి అవగాహన లేని చాలామంది ఆయనను ‘యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’గా భావించారు. అనుకోని పరిస్థితుల్లో ఆయన ప్రధాని అయిన మాట నిజమే. అయితే, ఆ పదవి చేపట్టేనాటికి పీవీకి 40 ఏళ్ల సుదీర్ఘమైన, పారదర్శకమైన, సమర్ధవంతమైన రాజకీయ నేపథ్యం ఉంది. లాయరుగా, స్వాతంత్ర సమరంలో చురుకైన పాత్ర పోషిస్తున్న రోజుల్లో పీవీ కాంగ్రెస్ సభ్యత్వం పొందారు. 1951లో క్రీయాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఈ ఏడాదే.. ఏఐసీసీ సభ్యులయ్యారు. 1952లో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా ఉంటూనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. అప్పుడే.. తొలి సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ సీటుకు పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1955 – 1977 వరకు వరుసగా నాలుగుసార్లు మంథని ఎమ్మెల్యేగా, 1958-60 మధ్యకాలంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా, 1960-61లో విద్యా ప్రాంతీయ కమిటీ ఛైర్మన్‌గా సేవలందించారు. 1962 – 64 కాలంలో నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో న్యాయ, జైళ్ల శాఖ మంత్రిగా, 1964 నుంచి మూడేళ్లపాటు అధికార భాషా సంఘం సభ్యులుగా, 1967లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా, 1968 – 71 మధ్యకాలంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1971-73 కాలంలో ఆంధ్రప్రదేశ్సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీ అంతర్గత పరిణామాలతో ఆయన ప్రభుత్వం రద్దైపోవటంతో పీవీ రాష్ట్ర రాజకీయాల నుంచి వైదొలగి, హస్తిన రాజకీయాల్లో ప్రవేశించారు.
1974లో ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులై, 1977లో హనుమకొండ ఎంపీగా గెలిచారు. 1978లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా, 1980 నుంచి నాలుగేళ్లు ఇందిరాగాంధీ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా, 1984లో కొంత కాలం పాటు కేంద్ర ప్రణాళిక మంత్రిగా, దేశ హోంమంత్రిగా సేవలందించారు. 1985లో రక్షణ మంత్రిగా తర్వాత 1988 వరకు మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ సమయంలోనే విద్యారంగ సంస్కరణలు, జిల్లాకొక నవోదయ స్కూలు ఏర్పాటు చేశారు. 1988లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిగా, అదే ఏడాది.. విదేశాంగ మంత్రిగానూ పనిచేశారు.1989లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా గెలిచారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోవడంతో పీవీ క్రియాశీలక రాజకీయాలకు దూరమై ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు. కానీ, రాజీవ్ గాంధీ హత్యానంతరం ఏఐసీసీ అధ్యక్షభాధ్యతలను స్వీకరించించేందుకు సోనియా గాంధీ నిరాకరించటం, ఆ పదవిని పీవీ పేరును సూచించటం జరిగింది. 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించటంతో 1991 జూన్ 21న పీవీ దేశ ప్రధాని అయ్యారు. తర్వాత ఏపీలోని నంద్యాల, ఒరిస్సాలోని బరంపురం నుంచి పోటీచేసి గెలిచారు. నాడు ఆయన నంద్యాలలో సాధించిన మెజారిటీ అప్పటివరకు లోక్‌సభ ఎంపీలకెవరికీ దక్కకపోవటం విశేషం. ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న నేతను ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనటం కంటే అన్యాయమైన మాట మరొకటి లేదు.
పీవీ చతురత, ముందుచూపుకు ఒక సంఘటనను ఉదాహరణగా చెబుతారు. పీవీ ప్రధాని కాగానే, ఆర్థిక శాఖను మన్మోహన్ సింగ్‌కు అప్పగించినా.. పరిశ్ర మల శాఖను మాత్రం తనదగ్గరే ఉంచుకున్నారు. తన మైనారిటీ ప్రభుత్వం లెసైన్స్, పర్మిట్ వ్యవస్థ రద్దు వంటి పెద్ద నిర్ణయం తీసుకుంటే మిత్రపక్షాలు, విపక్షాలు దానిని అంగీకరించవని, లోక్‌సభలో అల్లరి జరుగుతుందని భావించి, ఈ అంశాన్ని బడ్జెట్ ప్రసంగంలో భాగం చేశారు. ఎప్పటిలాగానే ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్ దీనిని లోక్‌సభలో చదవుతూ పోయారు. దీంతో ఎవరూ ఈ కొత్త నిబంధనను సీరియస్‌గా తీసుకోలేదు. అయితే, మర్నాటికి గానీ, బ్రిటిష్ కాలపు కఠినమైన లైసెన్స్ రాజ్ చట్టాన్ని పీవీ తెలివిగా, ఏ హడావుడి లేకుండా బద్దలు కొట్టారని విపక్షాలకు అర్థం కాలేదు. ఏదయితేనేం.. పారిశ్రామిక విధానం-1991 పేరుతో వచ్చిన ఈ విధానం వల్ల దేశంలో 80 రకాల పరిశ్రమలకు కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అంతేకాదు.. రైల్వేలు, అణు ఇంధనం, రక్షణ వంటి 8 రంగాల మినహా మిగిలిన అన్ని పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. మౌనంగా ఉంటూనే సమస్యను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, దానిపై సంపూర్ణ అవగాహన పెంచుకోవటం, రాజ్యాంగపరమైన, చట్టపరమైన కోణాలను పరిశీలించి, పరిష్కారాలు సాధించటం, కొత్తగా ఆలోచించడం, సమర్థంగా అమలుచేయడం వంటి ఆయన లక్షణాలే ఆయన విజయాలకు కారణాలని అనిపిస్తుంది.
ప్రజాప్రతినిధిగానే గాక పార్టీ నేతగానూ పీవీ సమర్ధవంతమైన పాత్రను పోషించారు. అయితే, దీనిపై అవగాహన లేని కొందరు ఆయనపై అనేక అసత్య కథనాలను పుట్టించారు. ముఖ్యంగా సోనియా గాంధీ, పీవీ మధ్య అగాథం ఏర్పడిందనే మాట అప్పట్లో వార్తల్లో కనిపించేది. రాజీవ్ గాంధీ మరణించిన మర్నాడు.. అంటే మే 22న ఢిల్లీలో పీవీ అధ్యక్షతనే.. సిడబ్ల్యుసీ అత్యవసర భేటీ నిర్వహించి, పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాలని తీర్మానించారు. మర్నాడు దానిని సోనియాకు అందించగా, ఆమె తిరస్కరించటమే గాక పరోక్షంగా పీవీ పేరునే సూచించటం, ఆమె ఆంతర్యాన్ని గుర్తించి, సీనియర్లు కూడా పీవీకి మద్దతు పలకటం జరిగిపోయాయి. సరిగ్గా వారానికి.. అంటే మే 29న హెచ్‌కెఎల్ భగత్ అధ్యక్షత సమావేశమైన ‘సిడబ్ల్యుసీ’ సమావేశం.. పీవీని ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. 1991 జూన్ 20న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా పీవీ ఎన్నిక, మర్నాడు ప్రధానిగా బాధ్యతల స్వీకారం వెనక సోనియాగాంధీ పాత్ర ఎంతో ఉంది. తర్వాత కొన్నాళ్లకు సోనియా గాంధీ అమేధీలో పర్యటించగా, ‘రాజీవ్ హంతకులను వెంటనే శిక్షించాలి’ అని జనం నినాదాలు చేశారు. దీనికి బదులిస్తూ..‘నా ఆవేదన కూడా అదే’ అని సోనియా అన్నారు. అంతే.. మర్నాటి నుంచే రాజీవ్ హత్యకేసు విచారణ మీద పీవీ అంత సీరియస్‌గా లేరని సోనియా గాంధీ అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారంటూ బోలెడు వార్తా కథనాలొచ్చాయి. కానీ, ఈ కేసు విచారణలో నాటి ప్రభుత్వం ఎంత పట్టుదలగా వ్వవహరించదనే విషయాలను నాటి సిట్ అధ్యక్షుడు ఐపీఎస్ అధికారి డీ.ఆర్.కార్తికేయన్ తన ‘Triumph of Truth’ పుస్తకంలో చెప్పుకొచ్చారు.
1996 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం తర్వాత లఖూభాయ్ పాఠక్ కేసులో పీవీ పేరును చార్జిషీటులో చేర్చినపుడు ముందుగా సోనియా గాంధీయే.. పీవీ నివాసానికి వెళ్లి ఆయనకు మద్దతుగా నిలిచారు. అంతేకాదు.. 2001లో బెంగుళూరులో జరిగిన 81వ ఏఐసిసి ప్లీనరీ ప్రధానవేదికపైకి పీవీని వేదికపైకి ఆహ్వానించి తన ప్రక్కనే కూర్చొబెట్టుకోవటమే గాక ఆ కార్యక్రమం తర్వాత తిరిగి వెళ్లేటపుడు ముందుగా పీవీని కారు ఎక్కించి పంపిన తర్వాతే ఆమె తన కారులో వెళ్లారు. దేశమంతా ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా తనను ప్రస్తుతిస్తుంటే.. ఆయన మాత్రం.. పండిట్ జవహర్లాల్ నెహ్రు వేసిన పునాదులపై రాజీవ్‌గాంధీ చూపిన మార్గంలోనే నా విధానాలు కొనసాగాయని వినమ్రంగా చెప్పుకున్నారు. కాంగ్రెస్‌లో పుట్టి, అందులోనే ఎదిగి, చివరి వరకు కొనసాగిన క్రమశిక్షణగల కార్యకర్తగానే పీవీ నిలిచారు. కానీ, చరిత్ర తెలియని కొందరు ఆయనను తక్కువ చేసి చూపటం విచారకరం.