CM Chandrababu: అభివృద్ధి చేస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వగలమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లెలో నిర్వహించిన ‘పేదల సేవలో ప్రజావేదిక’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వృద్ధులకు పెన్షన్ల పంపిణీ అనంతరం సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పై చంద్రబాబు సెటైర్లు వేశారు. తాను కూడా మాజీ ముఖ్యమంత్రి తరహాలో బటన్ నొక్కచ్చని.. పరదాలు కట్టుకొని ఉండొచ్చని అన్నారు. కానీ తాను ప్రజలతోనే ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలకు నేరుగా సేవలందించాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. అందుకే మీ ఇంటికి వచ్చి ఫించన్ ఇస్తున్నట్లు చంద్రబాబు తెలియజేశారు.
ఏడాదికి రూ. 33 వేల కోట్లు ఖర్చు
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘నేను ఈ కార్యక్రమాన్నైనా వాయిదా వేస్తాను కానీ.. పింఛన్ల పంపిణీలో కచ్చితంగా పాల్గొంటాను. పింఛన్ల కోసం సంవత్సరానికి రూ. 33వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. దేశంలోనే ఇంత ఖర్చు మరే రాష్ట్రం పెట్టడం లేదు. ఇప్పటి వరకు రూ.57,764 కోట్లు ఫించన్లకు ఇచ్చాం. ఇది దేశంలోనే అతిపెద్ద డీబీటీ కార్యక్రమం. రూ. 29,951 కోట్లు అడబిడ్డల కోసం ఇచ్చాం. 4 కోట్ల 93లక్షల జనాభా ఉంటే.. 13శాతం మందికి పింఛన్లు ఇస్తున్నాం. శ్రీసత్యసాయి జిల్లాలో 2లక్షల 64వేల మంది పింఛన్లకు రూ. 116 కోట్లు ఖర్చు చేస్తున్నాం’ అని అన్నారు. తమకు డబ్బు ముఖ్యం కాదని.. ప్రజలను ఆదుకోవడమే ముఖ్యమని సీఎం పేర్కొన్నారు.
తుపాను వల్ల రూ. 5,250 కోట్ల నష్టం
ఏపీపై విరుచుకుపడ్డ మెుంథా తుపాను కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు చంద్రబాబు అన్నారు. ‘ఇంతక ముందు చాలా తుఫాన్లను ఎదుర్కొన్నాం. అనేక వరదల్ని, కరవుల్ని చూశాం. ఎక్కడిక్కకడ టెక్నాలజీ వినియోగించి.. వీటిని ఎదుర్కొన్నాం. ప్రజలు ఇబ్బంది పడకుండా తుఫాన్ సహాయక చర్యలు చేపట్టాం. నష్టపోయిన రైతాంగం 5 రోజుల్లో కోలుకునేలా చేశాం. రూ.5,250కోట్ల ఆస్తి నష్టం, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కేంద్రాన్ని సాయం చేయాలని కోరాం. సచివాలయం సిబ్బంది నుంచి సీఎస్ వరకు అంతా సమర్థవంతంగా పని చేసేలా చూశాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా యంత్రాంగం అంతా కలసి రియల్ టైం మానిటరింగ్ చేశాం’ చంద్రబాబు అన్నారు.
Also Read: Kalvakuntla Kavitha: నేను వాళ్ల, వీళ్ల బాణాన్ని కాదు.. తెలంగాణ ప్రజల బాణాన్ని.. కవిత సంచలన కామెంట్స్
వైసీపీ.. ఫేక్ పార్టీ: చంద్రబాబు
గడిచిన 15 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఈ నెల 14, 15 తేదీల్లో ఇండస్ట్రియల్ సమ్మిట్ ఉంటుంది. అక్కడ రూ. 4-5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో గుంతల పడ్డ రోడ్లు కనిపించకుండా చేస్తాం. తిరుపతి దగ్గర స్పేస్ సిటీ, ఓర్వకల్లో డ్రోన్ సిటీని తీసుకొస్తాం. మనం ప్రజలకు మంచి చేస్తుంటే.. ఫేక్ పార్టీ దుష్ప్రచారం చేస్తోంది. వివేకానంద గొడ్డలి కదిరిలోనే కొన్నారు. వివేకానందను చంపి నాపై నిందలు వేయాలని చూశారు. వైసీపీ అనేది ఒక ఫేక్ పార్టీ. మీకు ఇబ్బంది కల్గిస్తానంటే.. నేను ఎదురెళ్తాం. రౌడీలను, ముఠాలను పూర్తిగా తరిమికొట్టాం. నన్ను ల్యాండ్ మైన్లు పెట్టాలని తిరుమల వద్ద చంపాలని చూశారు. ఆ రోజు శ్రీ వెంకటేశ్వరస్వామి వచ్చి నన్ని కాపాడారు’ అని కవిత అన్నారు.
