Kalvakuntla Kavitha: కరీంనగర్ లో నిర్వహించిన జాగృతి జనంబాట కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరి బాణం కాదన్న ఆమె.. తెలంగాణ ప్రజల బాణాన్ని అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందన్న కవిత.. కొన్ని పార్టీలను నమ్ముకొని దగాపడ్డామని ప్రజలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. తమ ప్రాధాన్యత ప్రజల సమస్యలు తీర్చటమేనని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయని.. మెుంథా తుపానుతో దెబ్బతిన్న రైతులను పట్టించుకోవడం లేదని కవిత మండిపడ్డారు.
‘మేము పోరాటం చేస్తాం’
వరంగల్ నగరమంతా నీటిలో మునిగితే పోరాటం చేయాల్సి పార్టీలు పట్టించుకోవడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. ‘రెండు విపక్షాలు (బీజేపీ, బీఆర్ఎస్) ప్రజల కోసం తిరగటం లేదు. వాళ్ల తరఫున మేము పోరాటం చేస్తాం. జాగృతి రాజకీయ వేదికే. మేము చాలా సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడాం. మోడీ కార్మికుల హక్కులను కాలరాస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు చేయాల్సినంత పోరాటం చేయలేదు. రైతు చట్టాల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ.. లేబర్ చట్టాల గురించి మాట్లాడలేదు. రైతు చట్టాలు మారాయి. కానీ కార్మికులకు అన్యాయం చేసే చట్టాల విషయంలో మార్పు రాలేదు’ అని కవిత అన్నారు.
‘నావల్లే.. రూ.700 కోట్లు ఇచ్చారు’
లోకల్ బాడీ ఎన్నికల సమయంలోనే ఏం చేయాలన్నది నిర్ణయం తీసుకుంటామని కల్వకుంట్ల కవిత అన్నారు. ‘పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇంకా రెండు నెలల సమయం కోరుతున్నారు. అంటే వాళ్లు ఈ విషయాన్నిఇంకా సాగదీసే ప్రయత్నంలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాకు ఎలాంటి స్టాండ్ లేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించి మండలిలో లో నేను మాట్లాడితేనే సీఎం రూ.700 కోట్లు ఇచ్చారు. ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని చెప్పి చేయటం లేదు. స్కూల్స్, కాలేజ్ యాజమాన్యాలు ఆందోళన చేస్తే వారికి మద్దతుగా ఉంటాం. స్కూల్స్ బంద్ కాకుండా పోరాటం చేస్తాం. లేదంటే చదువుకునే ఆడపిల్లలే నష్టపోతారు. ఏపీకి 23 మంది సీఎంలు అయితే ఒక్క బీసీ గానీ, మహిళ గానీ ఎందుకు సీఎం కాలేదు?. అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజల అభిప్రాయం తీసుకొని కార్యాచరణ తీసుకుంటాం’ అని కవిత అన్నారు.
69 మంది మహిళా ఎమ్మెల్యేలు
‘నన్ను వారి బాణం, వీరి బాణం అని అంటున్నారు. కానీ నేను తెలంగాణ ప్రజల బాణాన్ని. వీలైనంత తొందరగా సామాజిక తెలంగాణ, బీసీ రిజర్వేషన్లు పూర్తి కావాలని కోరుకుంటున్నా. వచ్చే మూడేళ్లలో చాలా ఛేంజెస్ వస్తాయి. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు మేలు జరుగుతుంది. తెలంగాణలో 69 మంది మహిళ ఎమ్మెల్యేలు అవుతారు. కచ్చితంగా దగాపడ్డ ఉద్యమకారులను అక్కున చేర్చుకుంటాం. పరిహారం అందని అమరవీరుల కుటుంబాలకు పరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తాం. స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లు, స్వరాష్ట్రం తెచ్చుకొని 12 ఏళ్లైన పరిస్థితిలో మార్పు లేదు. కనీసం విద్య, వైద్యం కూడా ప్రజలకు అందివ్వలేకపోతున్నామన్నదే నా ఆవేదన’ అని కవిత పేర్కొన్నారు.
Also Read: Kasibugga Temple Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట.. 9 మంది దుర్మరణం.. దుర్ఘటన వెనుక 11 కారణాలు ఇవే!
‘పిడికిలి బిగించి.. ఉద్యమం చేయాలి’
గతంలో కేసీఆర్ గారి సపోర్ట్ తో సింగరేణిలో కార్మికుల హక్కులను కాపాడుకున్నామని కవిత అన్నారు. ఐతే ఇంకా జరగాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు. ‘ఆర్టీసీ లో చాలా దారుణమైన పరిస్థితి. దీనిపై మనం ఆలోచించాలి. అంతా బాగుంది అనుకున్నాం గనుకే 200 ఏళ్లు బ్రిటిష్ వాళ్ల బానిసత్వంలో ఉన్నాం. 60 ఏళ్లు తెలంగాణ కూడా పరాయి పాలనలో ఉంది. ఒక్కసారి ఆలోచన చేయటంతోనే స్వాతంత్రం వచ్చింది. ఇంకా ఎన్నాళ్లు ఇతర దేశాలలో ఉద్యోగాల కోసం వెళ్తాం. అమెరికా, దుబాయ్ వాళ్లు మనల్ని వెళ్లగొడుతున్నారు. మనం ఉన్నచోట ఉద్యోగాలు లేవు. ఇప్పుడు విప్లవాత్మక మార్పు రావాల్సిన అవసరముంది. ఇతర దేశాల్లో జీతం ఇవ్వకపోయినా, కొట్టి చంపినా పట్టించుకునే పరిస్థితి లేదు. సమస్యలు తీరాలంటే పిడికిలి బిగించి ఉద్యమం చేయాలి’ అని అన్నారు.
