Vizag Crime: వైజాగ్ లో ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ విద్యార్థి సాయితేజ (Saiteja) మృతిలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. సాయితేజను లైంగికంగా, మానసికంగా వేధించిన ఇద్దరు మహిళా లెక్చరర్లపై కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. అయితే లెక్చరర్లు వేధిస్తున్న విషయాన్ని సాయితేజ ముందే తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. చివరి ఏడాది కావడంలో ఎలాగోలా అడ్జస్ట్ కావాలని పేరెంట్స్ సర్దిచెప్పినట్లు సమాచారం. అంతేకాదు ప్రతీ రికార్డులోనూ తప్పులను ఎత్తిచూపుతూ వేధింపులకు గురిచేయడాన్ని కూడా తల్లిదండ్రుల దృష్టికి సాయితేజ తీసుకెళ్లాడు. దీంతో ఆ రికార్డులను తీసుకెళ్లి సాయితేజ పేరెంట్స్ కాలేజీలో గొడవ కూడా పడినట్లు సమాచారం.
పోలీసులకు ఫిర్యాదు.. ఇంతలోనే
కాలేజీలో గొడవ పడిన అనంతరం.. సాయితేజ పేరెంట్స్ నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు కూడా చేశారు. కంప్లయింట్ ఇచ్చి ఇంటికి వచ్చేసరికి శుక్రవారం సాయితేజ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. చేతికి అందివస్తున్న బిడ్డ.. బలవన్మరణానికి పాల్పడటంతో సాయితేజ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. మరోవైపు సాయితేజ ఆత్మహత్యను నిరసిస్తూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో కాలేజీ యాజమాన్యం శనివారం కాలేజీకి సెలవు ప్రకటించింది. మరోవైపు విద్యార్థి సాయితేజ మెుబైల్ కాల్స్, చాటింగ్ ను పరిశీలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అర్ధరాత్రి వరకూ చాటింగ్..
అయితే ఒక మహిళా లెక్చరర్ తో సాయితేజ అర్ధరాత్రి వరకూ చేసిన చాటింగ్ డేటా తాజాగా బయటకు వచ్చింది. గత రెండేళ్లుగా దైవంగా చూస్తూ వచ్చిన లెక్చరర్స్ ఫైనల్ ఇయర్ కు వచ్చేసరికి ఇబ్బందులకు గురిచేయడం సాయితేజ తట్టుకోలేకపోయాడు. అయితే ఓ లెక్చరర్ తో జరిగిన చాట్ ను పరిశీలిస్తే అతడు ఎక్కడా కూడా సంయమనం కోల్పోకుండా లెక్చరర్ తో చాలా గౌరవంగానే మాట్లాడుతూ వచ్చాడు. ‘యాటిట్యూడ్ చూపిస్తున్నావ్.. చూసి చూడనట్లు ఉంటున్నావ్’ అని సదరు మహిళా లెక్చరర్ మెసేజ్ లు చేయడాన్ని కూడా వాట్సప్ చాట్ లో కనిపించిది. మహిళా స్నేహితురాలు చనిపోతే చూడటానికి ఎందుకు వెళ్లావంటూ సాయితేజను మహిళా లెక్చరర్ నిలదీసింది. ‘నువ్వు మగవారితో ఎందుకు ఎక్కువగా స్నేహం చేస్తున్నావు. వారిని పెళ్లి చేసుకుంటావా? వారితో బెడ్ షేర్ చేసుకుంటావా?’ వంటి ఘాటు వ్యాఖ్యలు కూడా చాటింగ్ లో ఉన్నాయి.
Also Read: Koppula Eshwar: ఎస్సీ డిక్లరేషన్ లో చెప్పిన ఒక్క హామీనైనా నెరవేర్చారా? కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు
ఎవరితో మాట్లిడినా వేధింపులు..
కాలేజీలోని అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరితో మాట్లాడిన కూడా వారితో సాయితేజకు అక్రమ సంబంధం అంటగడుతూ లెక్చరర్ వేధించినట్లు కూడా తాజాగా బయటపడింది. అంతేకాదు తమ కోరికలు తీర్చాలంటూ సాయితేజను పదే పదే వేధించినట్లు కూడా తోటి విద్యార్థులు చెబుతున్నారు. అంతేకాదు సాయికృష్ణ రాసిన రికార్డుల్లో తప్పులను ఎంచుతూ ఒక్కో రికార్డును 7-8 సార్లు రాయించినట్లు కూడా తెలుస్తోంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకొని సాయితేజ బాధపడగా.. శుక్రవారం (అక్టోబర్ 31) వారు కాలేజీకి వెళ్లారు. రికార్డులు చూపించి లెక్చరర్లతో గొడవపడ్డారు. అనంతరం వాటిని సరిచేయించారు. ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా పోలీసులకు ఫిర్యాదు సైతం చేశాడు. అనంతరం తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి సాయితేజ ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. ప్రస్తుతం మార్చురీలో సాయితేజ మృతదేహం ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బయటకొచ్చిన చాటింగ్ తో పాటు.. గత కొన్ని నెలలుగా లెక్చరర్లతో జరిగిన ఫోన్ సంభాషణలను సైతం వారు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
