Mahabubabad Shocking: మహబూబాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బతికున్న ఓ 50 ఏళ్ల వ్యక్తి.. చనిపోయాడని భావించి రాత్రంతా మార్చురీలో ఉంచారు. చిన్న గూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన ఎల్ది రాజు గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి వచ్చాడు. అయితే రాజు వచ్చేటప్పుడు తన వెంట ఆధార్ కార్డు తెచ్చుకోకపోవడంతో ఆసుపత్రిలోని సిబ్బంది ఆయనకు ఓపి ఇవ్వలేదు. ఆసుపత్రిలో కూడా జాయిన్ చేసుకొని ట్రీట్మెంట్ అందివ్వలేదు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న రాజు గత రెండు రోజులుగా ఆసుపత్రిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపాడు.
Also Read: Azharuddin: రేపే కేబినెట్‌లోకి అజారుద్దీన్.. టైమ్ కూడా ఫిక్స్.. మంత్రులకు అందిన ఆహ్వానం
ఈ క్రమంలోనే బుధవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తుఫాన్ ఎఫెక్ట్ తో వర్షం పడుతూనే ఉంది. ఈ సమయంలో ఆసుపత్రిలో స్ట్రెచర్ పై అపస్మారక స్థితిలో పడుకోని ఉన్న రాజును అక్కడ విధులు నిర్వహించే ఆస్పత్రి సిబ్బంది మృతి చెందాడని భావించారు. అతన్ని తీసుకెళ్లి శవాలను భద్రపరిచే మార్చురీలో పెట్టారు. గురువారం ఉదయం మార్చురీ ప్రాంతంలో చెత్త చెదారాన్ని శుభ్రపరిచేందుకు వచ్చిన స్వీపర్ కు మార్చురీలో శబ్దం వినిపించింది. శబ్దం వచ్చిన దగ్గరకు వెళ్లి చూడగా రాజు కదులుతూ కనిపించాడు. దీంతో స్వీపర్.. ఆసుపత్రి వైద్యులకు సమాచారం అందించాడు. వారు హుటాహుటినా స్పందించి రాజుకు అత్యవసర చికిత్సను అందించారు. ప్రస్తుతం రాజు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు రీజనల్ మెడికల్ ఆఫీసర్ డా. జగదీశ్వర్ తెలిపారు.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				