Rakhi Sawant: తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్న తమన్నా భాటియా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొలీవుడ్‌లో అయితే మల్టీ లాంగ్వేజ్ స్టార్‌గా పేరు పొందింది. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు దాటినా తన అందం, గ్లామర్‌తో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇరవై ఏళ్ళ సినీ ప్రయాణంలో మహేష్ బాబు, చిరంజీవి, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇటీవలి కాలంలో సినిమాల కంటే వెబ్‌సిరీస్‌లపైనే ఎక్కువ దృష్టి పెట్టినా, ఐటమ్ సాంగ్స్‌తో మళ్లీ తన మార్క్ చూపిస్తోంది. రజినీ కాంత్ హీరోగా నటించిన ‘జైలర్’, ‘స్త్రీ 2’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఇప్పటికే ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. తాజాగా.. ఆమె బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్‌తో కలిసి చేసిన ‘రైడ్ 2’ ఐటమ్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమన్నా స్టైల్, డ్యాన్స్ మూవ్స్, గ్లామర్ అన్నీ కలిపి అభిమానులను కట్టిపడేస్తున్నాయి. కానీ ఈ పాట ఒక కొత్త వివాదానికి తెర లేపింది.
తమన్నా ఐటమ్ పాటలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి రాఖీ సావంత్ ఇప్పుడు చర్చలోకి వచ్చారు. “ ఒకప్పుడు కోటాను కోట్లు తీసుకున్న హీరోయిన్ ఇప్పుడు కేవలం ఐదు లక్షలకే ఐటమ్ సాంగ్స్ కి ఒప్పుకుంటుంది. తమన్నా వంటి స్టార్ హీరోయిన్స్ మాకు ఉన్న చిన్న అవకాశాలను కూడా దోచుకుంటున్నారు” అంటూ రాఖీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఇంకా “ఇలాంటి పని స్టార్ హీరోయిన్స్ చేయకూడదు, వారి విలువలను కాపాడుకోవాలి” అంటూ మండిపడింది.
అయితే, తానేమీ వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడలేదని, కానీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగ్గ పాత్రలే ఎంచుకోవాలని రాఖీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు తమన్నాకు మద్దతుగా నిలుస్తున్నారు. కొందరు రాఖీని విమర్శిస్తుండగా, మరికొందరు ఆమె అభిప్రాయానికి సపోర్ట్ ఇస్తున్నారు. మొత్తానికి తమన్నా ఐటమ్ సాంగ్ ఒక వైపు ట్రెండ్ అవుతుంటే, మరో వైపు ఈ వివాదం బాలీవుడ్‌లో కొత్త చర్చకు తెర లేపింది.
