Kavitha: భౌతికంగా తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైనప్పటికీ, అసలైన సామాజిక తెలంగాణ సిద్ధించలేదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియా చిట్ చాట్ లో ఆమె పాల్గొన్నారు. జాగృతి సంస్థను స్థాపించి బ్రతకమ్మను ఖ్యాతిని తను విశ్వపరివ్యాప్తం చేశానని కవిత అన్నారు. యువత ఆర్థిక స్వావలంభన కోసం గతంలో జాగృతి ఆధ్వర్యంలో స్కిల్ సెంటర్లను కూడా నిర్వహించినట్లు తెలిపారు. ఓవైపు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సబ్బండ వర్ణాలను మమేకం చేసినట్లు తెలిపారు.
Also Read: MLC Kavitha: త్వరలో వారి చిట్టా బయటపెడతా అంటూ.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
తాను ఎవరి వర్గం కాదని తన వెనుక ఎవరు లేరు
తనను బీఆర్ఎస్ వాళ్లు బిజెపి బీ టీమ్ అనీ , బిజెపి వాళ్లు బీఆర్ఎస్ కు బీ టీం అని ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎవరి వర్గం కాదని తన వెనుక ఎవరు లేరని, తన ముందు తనను నమ్మిన తెలంగాణ ప్రజానీకం ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వస్వం త్యాగం చేసిన ఎంతోమంది దిక్కుతోచని స్థితిలోకి నెట్టి వేయబడ్డారనిఅలాంటి పరిస్థితిని జాగృతి ఎలా చూస్తుందని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు దగాపడ్డ ఉద్యమకారుల్లో మొదటి వరుసలో తానుంటానన్నారు. జిల్లా ముద్దుబిడ్డగా చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ప్రయోజనాల కోసం చేస్తున్నది శూన్యం అన్నారు.
20% పనులను రేవంత్ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయడం లేదు
ఓవైపు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తును పెంచేందుకు ప్రయత్నిస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుందన్నారు. కెసిఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డికి చెందిన 80% పనులు పూర్తయ్యాయని, మిగిలి ఉన్న 20% పనులను రేవంత్ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. కురుస్తున్న వర్షాలకు పత్తి పూర్తిగా తడిసిపోయిందని, తేమశాతాన్ని మినహాయింపు చేసి ప్రభుత్వం పత్తి కొనుగోలు చేయాలన్నారు.
చరిత్రలో మొట్టమొదటిసారిగా మైనార్టీ ప్రాతినిధ్యం లేకుండా మంత్రివర్గం
అంబేద్కర్ మహాశయుడు విశ్వసించినట్లుగా పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అన్న నినాదాన్ని జాగృతి సంపూర్ణంగా విశ్వసిస్తుందని, ఆ క్రమంలోనే బహుజన వర్గాలను రాజ్యాధికారానికి చేరువ చేసే విధంగా ఈ వర్గాల నుండే నాయకత్వాన్ని సృష్టిస్తామన్నారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా మైనార్టీ ప్రాతినిధ్యం లేకుండా మంత్రివర్గం కొనసాగుతుందని, రేవంత్ క్యాబినెట్ లోకి వెంటనే మైనార్టీలను తీసుకోవాలన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అప్పటి పరిస్థితులకు అనుగుణంగా జాగృతి రాజకీయ వేదికగా మారే అనివార్య పరిస్థితులు ఉత్పన్నమైతే అప్పుడు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. అన్ని వర్గాలను రాజకీయంగా చైతన్యం చేయడమే జాగృతి లక్ష్యం అన్నారు.
Also Read: Kalvakuntla Kavitha: గ్రూప్-1 నియామకాలపై కవిత సంచలనం.. సుప్రీంకోర్టు సీజేఐకి బహిరంగ లేఖ
