Naveen Chandra: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేమికులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మాస్ జాతర’ (Mass Jathara). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈచిత్రానికి.. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు దర్శకుడు. ఇది ఆయనకు దర్శకుడిగా మొదటి చిత్రం. శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా, అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో ఈ సినిమా థియేటర్లకు రానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన నవీన్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హృదయపూర్వకంగా ఒక మాట చెప్తా
ఈ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ముందుగా అందరికీ థ్యాంక్స్. చాలా రోజుల తర్వాత ‘మాస్ జాతర’ రూపంలో ఒక శక్తివంతమైన పాత్ర లభించింది. రవితేజను అభిమానించే నేను, ఈరోజు ఇలా ‘మాస్ జాతర’ ఈవెంట్‌లో మాట్లాడతానని అసలు ఊహించలేదు. రవితేజ, సూర్య అంటే నాకెంతో అభిమానం. నిజంగా వాళ్ళు ముందు నిల్చొని మాట్లాడటం నాకు డబుల్ ధమాకాలా అనిపిస్తుంది. రవితేజ నా లాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. మనిషిగా ఎలా ఉండాలి.. మనిషిగా ఎలా ముందుకు వెళ్ళాలనేది.. నేను రవితేజను చూసే నేర్చుకున్నాను. ఇందులో శివుడు అనే అద్భుతమైన పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు భానుకి ధన్యవాదాలు. ‘అరవింద సమేత’లో బాల్‌రెడ్డి పాత్ర తర్వాత నా కెరీర్‌లో మరోసారి గుర్తిండిపోయే పాత్ర ఇది. ఈ పాత్ర ఇంత బాగా రావడానికి కారణం రవితేజ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ‘అరవింద సమేత’లో బాల్‌రెడ్డి పాత్రతో నటుడిగా నాకు మరో జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు శివుడు రూపంలో మరో గొప్ప పాత్రలో నటించే అవకాశాన్ని కల్పించారు. ఈ సినిమా గురించి హృదయపూర్వకంగా ఒక మాట చెప్తా. ఈసారి జాతర చాలా గట్టిగా ఉంటుంది. అక్టోబర్ 31న విడుదలవుతున్న ఈ సినిమా అసలు నిరాశ పరచదు. ముఖ్యంగా రవితేజ అభిమానులు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారని అన్నారు.
Also Read- Jaanvi Ghattamaneni: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు.. మహేష్‌కు ఏమవుతుందో తెలుసా?
ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఏర్పడతారు
‘మాస్ జాతర’లో నవీన్ చంద్ర చేసిన శివుడు పాత్ర గురించి మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. ముఖ్యంగా శివుడు పాత్ర చేసిన నవీన్ గురించి మాట్లాడాలి. నవీన్ ఇలా కూడా చేయగలడా అని ఆశ్చర్యపోయేలా చేశాడు. నటుడిగా ఈ సినిమాతో తను మరో స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సినిమా విడుదలయ్యాక శివుడు పాత్ర గురించి అంతా మాట్లాడుకుంటారు. చాలా పవర్ ఫుల్ రోల్. అంతే అద్భుతంగా చేశాడు నవీన్. అతనికి ఆల్ ద బెస్ట్ అని చెప్పుకొచ్చారు. అలాగే దర్శకుడు భాను గురించి చెబుతూ.. భాను రూపంలో టాలీవుడ్‌కు మరో మంచి దర్శకుడు వస్తున్నాడు. ఈ సినిమాతో దర్శకుడు భానుకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఏర్పడతారు. మాస్ మాత్రమే కాదు, అన్ని రకాల సినిమాలు తను చేయగలడు. ‘మాస్ జాతర’ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అభిమానులను అస్సలు నిరాశపర్చదు. ఇదే నా హామీ అని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
