Cyclone Montha: మెుంథా తుపాను ప్రభావంతో ఏపీలోని సముద్ర తీర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్న సంగతి తెలిసిందే. సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో మత్స్యకారులను సముద్రంలోకి అనుమతించడంలేదు. దీంతో సముద్రంలోకి వెళ్తే గానీ పూటగడవని గంగపుత్రులు.. ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు సహాయక చర్యల్లో భాగంగా వందలాది మత్స్యకారుల కుటుంబాన్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే మెుంథా తుపాను వల్ల తీవ్రంగా ప్రభావితమైన మత్స్యకారులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. అలాగే తుపాను ప్రభావిత ప్రాంతాల కుటుంబాలకు తీపి కబురు అందించారు.
ఉచితంగా 50 కేజీల బియ్యం
మత్స్యకారుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం సాయం ప్రకటించింది. మెుంథా తుపాను కారణంగా వేటకు వెళ్లకుండా ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు ఆహారభద్రత కల్పించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో మత్స్యకార కుటుంబానికి 50 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం ఇవ్వాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఆహార సమస్య ఎదుర్కొంటున్న గంగపుత్రులకు భారీ ఊరట లభించినట్లు అయ్యింది. మరోవైపు తుపాను ప్రభావిత ప్రాంతంలోని ప్రతీ కుటుంబానికి 25 కేజీల బియ్యం ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. వీటితో పాటు కిలో కందిపప్పు, లీటర్ నూనె, కిలో ఉల్లి, కిలో బంగాళదుంప, చక్కెర (కిలో) అందించాలని పేర్కొన్నారు. కాగా, బంగాళాఖాతంలో మెుంథా తుపాను ఏర్పడినప్పటి నుంచి సముద్రంలోకి మత్స్యకారుల ప్రవేశాన్ని అధికారులు నిషేధించారు. దీంతో 5 రోజులుగా వారు ఇంటివద్దనే ఉండాల్సి వస్తోంది.
సీఎం వరుస సమీక్షలు
మరోవైపు మెుంథా తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ విరామం లేకుండా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇప్పటివరకూ రెండు సార్లు ఆర్టీజీ (రియల్ టైమ్ గవర్నెన్స్) సెంటర్ నుంచి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇది కాకుండా మరో రెండు టెలికాన్ఫరెన్స్ లో అధికారులతో చర్చలు జరిపి.. తుపాను ముప్పుపై దిశానిర్దేశం చేశారు. బుధవారం ముడోసారి ఆర్టీజీ సెంటర్ లో చంద్రబాబు రివ్యూ ఏర్పాటు చేశారు. ఆర్టీజీ సెంటర్ కు వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి సమస్యల పరిష్కారానికి సీఎం కృష్టి చేస్తున్నారు. రోడ్లపై అడ్డంగా విరిగిపడ్డ చెట్ల తొలగింపు, సబ్ స్టేషన్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచిస్తున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఐటీ మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సైతం ఆర్టీజీ కార్యాలయంలోనే ఉంటూ నిరంతరం తుపాను పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
Also Read: Cyclone Montha: మెుంథా తుపాను ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
రంగంలోకి డిప్యూటీ సీఎం పవన్
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం మెుంథా తుపానుపై ఫోకస్ పెట్టారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో సంప్రదింపులు జరిపి.. సమాచారాన్ని సేకరిస్తున్నారు. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కోనసీమ జిల్లాల కలెక్టర్ల నుంచి తుపాను ముప్పునకు సంబంధించి డేటాను పవన్ తెప్పించుకున్నట్లు సమాచారం. అదే సమయంలో ఆయా జిల్లాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. పునరావస కేంద్రాల్లో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని పవన్ దిశానిర్దేశం చేశారు.
