Cyclone Montha: మెుంథా తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ తో పాటు పలు జిల్లాల్లో ఎడతేరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన మెుంథా తుపాను.. మంగళవారం అర్ధరాత్రి 11.30 నుంచి 12.30 మధ్య కాకినాడకు దక్షిణంగా ఉన్న నరసాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు వాతారవరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 12 కి.మీ వేగంతో తుపాను కదిలినట్లు పేర్కొంది. ఆ సమయంలో గంటకు 85-95 కి.మీ వేగంతో గాలులు వీచినట్లు స్పష్టం చేసింది. మెుంథా తుపాను ప్రభావంతో రానున్న 24 గంటలు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో వర్ష బీభత్సం..
భారత వాతారవణ శాఖ (ఐఎండీ) హెచ్చరించినట్లుగా ఆంధ్రప్రదేశ్ లో అర్ధరాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో భారీగా వర్షం కురవడంతో పాటు.. సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో బీచ్ లోకి సందర్శకులు, పర్యాటకులను పోలీసులు అనుమతించడం లేదు. అటు అల్లూరి జిల్లా అరకులోయ ప్రాంతంలోనూ భారీగా వర్షం కురుస్తోంది. లంబసింగి ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. పలువురు ప్రయాణికులు త్రుటిలో తప్పించుకున్నారు. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షం దెబ్బకి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కర్నూలు నగరంతో పాటు కొత్తపల్లి, మహానంది, ఆత్మకూరు మండలాల్లో వాన కురుస్తోంది. కొత్తపల్లి మండంలోని శివపురం వద్ద పెద్దవాగు ఉప్పొంగండటంతో 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఏపీలోని చాలా వరకు వర్షప్రభావిత ప్రాంతాల్లో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
76 వేల మంది తరలింపు..
మెుంథా ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకూ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 76 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. వారికోసం 219 మెడికల్ క్యాంప్ ను సిద్దం చేశారు. అలాగే ఆహారం, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. మరోవైపు పెద్ద ఎత్తున వీచిన ఈదురుగాలులకు ఏపీలోని చాలా ప్రాంతాల్లో భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. అయితే వాటిని తొలగించేందుకు 1,447 మంది కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. మరోవైపు తుపాను, వరద ప్రభావాన్ని అంచనా వేసేందుకు 321 డ్రోన్లతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నాయి.
Also Read: Cyclone Montha: మొంథా తుపాను నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి కీలక ఆదేశాలు
తెలంగాణలోనూ ఎడతెరిపిలేని వానలు..
మెుంథా తుపాను ఎఫెక్ట్ తో తెలంగాణలోనూ ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని నగరం హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో రాత్రి వాన కురుస్తోంది. అటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముసురు కమ్ముకుంది. గంటకు 30-35 కి.మీ వేగంతో చల్లటి గాలులు వీస్తున్నారు. వరంగల్ తో పాటు మహబూబాబాద్ జిల్లాలపై తుపాను ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, కురవి, ఇనుగుర్తి, నెల్లికుదురు, నరసింహులపేట మండలాలు.. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేట, నెక్కొండ మండలాల్లో మోస్తర వాన మెుదలైంది. అలాగే జనగామా జిల్లాలోని పాలకుర్తి దేవరుప్పుల మండలల్లోనూ వర్షం పడుతోంది. కొద్ది గంటల్లో నాగర్ కర్నూలు, నారాయణపేట, మహబూబ్ నగర్, మేడ్చల్, మంచిర్యాల, వికారాబాద్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేయడం గమనార్హం.
