DSP Bribery Case: అవినీతికి చెక్ పెట్టాల్సిన పోస్టులో ఉండి అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ(DSP) బాధితులు పదుల సంఖ్యలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇన్నిరోజులు భయంతో తమ బాధలను బయటకు చెప్పుకోలేక పోయిన బాధితులు ఇప్పుడు ఫిర్యాదులు ఇవ్వటానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. తాజాగా వరంగల్ ఆర్టీఏ(RDA) కార్యాలయంలో పని చేస్తున్న ఓ మోటార్ వెహికిల్ ఇన్స్ పెక్టర్ కు ఏసీబీ(ACB) అధికారులమంటూ వచ్చిన బెదిరింపుల వెనక కూడా సదరు ‘సార్’ పాత్ర ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు కోసం డీఎస్పీ పెడుతున్న వేధింపులు భరించలేక ఇద్దరు బాధితులు అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తూ వచ్చిన అవినీతి భాగోతం బట్టబయలైంది. ఇప్పటికే సదరు డీఎస్పీపై వచ్చిన ఆరోపణల్లోని నిజాలను నిగ్గు తేల్చేందుకు ఉన్నతాధికారులు విచారణ కూడా ప్రారంభించారు. దీనిని జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఓ అధికారి స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్(Hyderabad) లోని కార్యాలయానికి సోమవారం రావాల్సిందిగా సదరు డీఎస్పీతోపాటు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన బ్యాచ్ మేట్లకు చెప్పినట్టుగా తెలియవచ్చింది.
అరెస్ట్ చేస్తామంటూ బెదరగొడుతూ..
వరంగల్(Warangal) జిల్లాలో ఎమ్మార్వో(MRO)గా పని చేస్తున్న ఓ అధికారిని ఏసీబీ అధికారులు ఆగస్టు నెలలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టుగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఏసీబీ వరంగల్ రేంజ్ లో డీఎస్పీగా పని చేస్తున్న ఓ అధికారి వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టాడు. ఎమ్మార్వో నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ లోని కాల్, వాట్సాప్ డేటాను తీసుకుని లిస్టులో ఉన్న ఒక్కొక్కరికి ఫోన్లు చేయటం మొదలు పెట్టాడు. అరెస్టయిన ఎమ్మార్వోకు నువ్వు బినామీగా ఉన్నట్టు మా విచారణలో తేలింది.. నీపై కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామంటూ బెదరగొడుతూ అందినకాడికి దండుకోవటం ఆరంభించాడు. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న ఎమ్మార్వో పరిచయస్తున్ని ఇలాగే భయపెట్టి 20లక్షల రూపాయలు తీసుకున్నాడు. కాగా, డబ్బు కోసం డీఎస్పీ చేస్తున్న బెదిరింపులు అధికమవుతుండటంతో అంతంత మొత్తాలు సమర్పించుకోలేదని ఇద్దరు బాధితులు వాట్సాప్ ద్వారా ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో అవినీతి డొంక కదలటం మొదలైంది.
Also Read: Uttam Kumar Reddy: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఆ జిల్లాలో 75000 మందికి ఉద్యోగ అవకాశాలు!
పదుల్లోనే..
కాగా, సదరు డీఎస్పీ బాధితులు పదుల సంఖ్యలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అరెస్టయిన ఎమ్మార్వో బంధువు అయిన మహిళ ఇంటికి వెళ్లి ఆమెను అసభ్యకర పదజాలంతో దూషించటంతోపాటు అడిగినంత ఇవ్వకపోతే అరెస్ట్ చేసి లోపలేస్తామని బెదిరించినట్టుగా సమాచారం. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే మహిళా కానిస్టేబుల్ లేకుండానే వెళ్లి బెదిరింపులకు పాల్పడటం. సదరు మహిళతో పరిచయం ఉన్న ఓ కానిస్టేబుల్ భార్యను కూడా దుర్భాషలాడటం. మహబూబాబాద్ లో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన ఓ మోటార్ వెహికిల్ ఇన్స్ పెక్టర్ బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి ఇలాగే దురుసుగా ప్రవర్తించినట్టుగా సమాచారం. కొంతమందిని డబ్బు కూడా డిమాండ్ చేసినట్టుగా తెలిసింది. ఇన్నాళ్లు తమను బెదిరిస్తూ వచ్చిన డీఎస్పీపై ఫిర్యాదు ఇవ్వటానికి భయపడ్డ బాధితులు ఇప్పుడు కంప్లయింట్లు ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలియవచ్చింది. ఇక, ఇటీవల వరంగల్ ఆర్టీఏ ఆఫీస్ లో ఎంవీఐగా పని చేస్తున్న ఓ అధికారికి ఏసీబీ అధికారులమంటూ వచ్చిన బెదిరింపుల వెనక కూడా సదరు డీఎస్పీ ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పిస్తా హౌస్ హోటల్ వద్ద 20లక్షలు..
ప్రస్తుతం వరంగల్ రేంజ్ ఏసీబీ వర్గాల్లో దీనిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఆరేళ్లుగా ఇదే రేంజ్ లో విధులు నిర్వర్తిస్తున్న సదరు డీఎస్పీపై సమగ్ర విచారణ జరిపితే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ వర్గాలే చెబుతుండటం గమనార్హం. గతనెల 11న ఎమ్మార్వో పరిచయస్తుడైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నుంచి వరంగల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సమీపంలో ఉన్న పిస్తా హౌస్ హోటల్ వద్ద 20లక్షలు తీసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ కమిషనరేట్ లోని ఓ కీలక విభాగంలో పని చేస్తున్న సదరు డీఎస్పీ బ్యాచ్ మేట్ ఈ డబ్బును తీసుకుని తన స్నేహితునికి చేర్చినట్టుగా ప్రచారం ఉంది. డబ్బు ఇవ్వటానికి ఫలానా చోటుకు రావాలని వాట్సాప్ ద్వారా లొకేషన్ పంపించి మరీ వసూళ్ల కార్యక్రమాన్ని పూర్తి చేసినట్టుగా తెలిసింది. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల మొబైల్ ఫోన్లలోని డేటాను రిట్రైవ్ చేయటంతోపాటు పిస్తా హౌస్ హోటల్ లోని సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషిస్తే అన్ని నిజాలు బయట పడతాయంటున్నారు. ఇక, ఒకవైపు డీఎస్పీపై వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపిస్తుండగా మరోవైపు ఏసీబీలోనే ఉన్న సదరు డీఎస్పీ బ్యాచ్ మేట్ ఒకరు కేసు నుంచి మిత్రున్ని తప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఏసీబీ వర్గాల ద్వారా తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో అసలు నిజాలు వెలుగులోకి వస్తాయా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.
