Maoist Ashanna: తాను కోవర్టునన్న మాటను మావోయిస్టు పార్టీ వెనక్కి తీసుకోవాలని ఇటీవలే పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు ఆశన్న(Ashanna) అన్నారు. లొంగుబాటు నిర్ణయం బసవరాజు ఎలియాస్ బీఆర్ దాదా(MR DaDa) బతికి ఉన్నపుడే తీసుకున్నదని చెప్పారు. పద్దతి ప్రకారమే పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు తెలిపారు. ఇప్పటికీ మాలో ఉద్యమతత్వం ఉంది.. ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీలో ఉన్నవారిలో చాలా మంది లొంగిపోవాలన్న అభిప్రాయంతోనే ఉన్నట్టు చెప్పారు. పార్టీ కేంద్ర కమిటీ అభిప్రాయ సేకరణ జరిపితే ఇది స్పష్టమవుతుందన్నారు. కొన్నేళ్లపాటు మావోయిస్టు పార్టీలో పని చేసిన రూపేశ్ ఎలియాస్ సతీష్ ఎలియాస్ ఆశన్న ఇటీవల 210మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోయిన విషయం తెలిసిందే. దీనిపై మావోయిస్టు పార్టీ స్పందించింది. అభయ్ పేర లేఖను విడుదల చేస్తూ దాంట్లో లొంగిపోయిన ఆశన్నను విప్లవద్రోహిగా పేర్కొంది. ఆశన్న కోవర్టులా మారారని, ఆయన వల్లనే పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించింది. కేంద్ర కమిటీతో చర్చించకుండానే లొంగిపోయాడంటూ పేర్కొంది. దీనిపై స్పందించిన ఆశన్న తాజాగా తనతోపాటు లొంగిపోయిన మావోయిస్టులతో కలిసి ఓ వీడియో విడుదల చేశారు.
ద్రోహులని అంటారని తెలుసు…
లొంగిపోయిన వారిని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు విప్లవద్రోహులని అంటారన్న విషయం తనకు ముందే తెలుసన్నారు. తనను కూడా అలాగే అంటారని, అయితే దానిపై స్పందించకూడదని అనుకున్నట్టు చెప్పారు. అయితే, ఇటీవలి కాలంలో పార్టీకి జరిగిన నష్టాలు, ఎన్ కౌంటర్లలో పలువురు మావోయిస్టుల ప్రాణాలు కోల్పోవటానికి తానే కారణం అని.. కోవర్టుగా మారాడని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇది ఎంతమాత్రం నిజం కాదని చెప్పారు. నిజానికి లొంగుబాటు నిర్ణయం బీఆర్ దాదా బతికి ఉన్నపుడే జరిగిందన్నారు. ఈ విషయం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు అందరికీ తెలుసన్నారు. ప్రస్తుతం బీఆర్ దాదా బతికి లేరు..ఆయన ఏమీ చెప్పలేరు కాబట్టి ఏవేవో ఆరోపణలు చేస్తున్నారన్నారు. అయితే, లొంగుబాటు నిర్ణయానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నట్టు చెప్పారు. ఈ మేరకు కేంద్ర కమిటీకి రాసిన లేఖలు కూడా ఉన్నాయన్నారు.
పరిస్థితులను గమనించి..
మావోయిస్టు పార్టీని పూర్తిగా తుద ముట్టించేందుకు సాయుధ బలగాలు వరుసగా ఆపరేషన్లు జరుపుతున్న విషయం తెలిసిందే అన్నారు. వర్షాకాలం రావటానికి ముందే కర్రెగుట్ట, మాడ్ ఆపరేషన్లు జరుగుతాయన్న సమాచారం తమకు ముందే ఉన్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే విప్లవ ఉద్యమాన్ని.. పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్న కామ్రేడ్ల ప్రాణాలను రక్షించుకోవటానికి లొంగుబాటు నిర్ణయం అంతా కలిసి తీసుకున్నామన్నారు. తద్వారా సాయుధ బలగాల అభియాన్ ను ఆపి వేయవచ్చని అనుకున్నట్టు వివరించారు. దీనిపై సెంట్రల్ కమిటీ సభ్యులతోపాటు అందరు కామ్రేడ్ల అభిప్రాయాలు కూడా తీసుకున్నట్టు చెప్పారు. అయితే, సెంట్రల్ కమిటీ స్థాయిలో జరిగిన ఈ ప్రక్రియపై కొందరు ప్రత్యేక ఏజన్సీ సమావేశం పేర సమీక్ష చేసి తప్పు పట్టారన్నారు. ఒక్క సతీష్(Sathish) చెబితేనో.. సోనూ(Sonu) చెబితేనో విని నిర్ణయం తీసుకునే పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు.
Also Read: Mass Jathara trailer: ‘మాస్ జాతర’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన రవితేజ.. వచ్చేది ఎప్పుడంటే?
బీఆర్ దాదా సాయుధ పోరాట విరమణ నిర్ణయాన్ని తీసుకున్నాడన్నది నిజం కాదని చెబుతున్నారని, అయితే ఇది ఎంతమాత్రం వాస్తవం కాదన్నారు. సాయుధ పోరాట విరమణపై సెంట్రల్ కమిటీ కోర్ సమావేశంలో చర్చించాలని బీఆర్ దాదా లేఖ రాశారని, అది దేవ్ జీ దగ్గర ఉందన్నారు. సెంట్రల్ కమిటీలోని సభ్యులందరికీ ఇవ్వాల్సిన ఈ లేఖను వెలుగులోకి తీసుకు రాలేదని చెప్పారు. ఎందుకు ఇవ్వలేదో మీరే అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. సెంట్రల్ కమిటీలోని సభ్యులందరు కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారని సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఎదురు చూసినట్టు తెలిపారు. అప్పటికే పార్టీకి తీవ్ర నష్టాలు జరిగాయి…ఎంతోమంది కామ్రేడ్లు అమరులయ్యారన్నారు. ఇంకా ఎదురు చూడటం సరికాదని అనుకుని లొంగుబాటు నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఇది ఒక అనివార్యత అని చెప్పారు. పద్దతి ప్రకారమే బయటకు రావటానికి ప్రయత్నించామన్నా…ఇది కామ్రేడ్స్ కు నా మాటగా చెబుతున్నా అని అన్నారు.
ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి…
తనను కోవర్టు అని చేస్తున్న ఆరోపణలను పార్టీ వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆశన్న అన్నారు. పౌర హక్కుల సంఘాల ప్రతినిధులు ఎలాంటి నిర్ధారణలు చేసుకోకుండానే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. అన్ని ఎన్ కౌంటర్లు జరిగినా నేనెలా బతికి బయట పడ్డానని ప్రశ్నిస్తున్నారని చెబుతూ ప్రజలను కలిసి మాట్లాడితే తాను ప్రాణాలతో ఎలా ఉన్న విషయం తెలుస్తుందని గడ్డం లక్ష్మణ్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. స్టేజీలు దొరుకుతున్నాయి కదా అని నోటికొచ్చినట్టుగా మాట్లాడొద్దని చెప్పారు. పౌర హక్కుల సంఘంగా మీ పరిధి ఏమిటి? అన్నది చూసుకోవాలన్నారు. పార్టీ అంతర్గత విషయాలపై మాట్లాడటం సరి కాదన్నారు. వచ్చి మమ్మల్ని కలిసి నిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.
పొరపాట్లే ఈ స్థితికి కారణం…
ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి పూర్తి ప్రతికూలతలు ఉన్నాయని ఆశన్న చెప్పారు. సెంట్రల్ కమిటీ చేసిన పొరపాట్లు, సకాలంలో నిర్ణయాలు తీసుకోలేక పోవటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇన్ని నష్టాలపాలు కావాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. మేమేం దిగజారి పోలేదు…మాలో ఉద్యమతత్వం ఇంకా ఉందని స్పష్టం చేశారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్లు చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువద్దాం…సహకరించే వారి మద్దతు తీసుకుందామన్నారు.
Also Read: QR Code Theif: వీడో చిత్ర విచిత్ర దొంగ.. క్యూఆర్ కోడ్ మార్చేసి.. దర్జాగా షాపు నుంచి దోపిడి!
భయపడేది లేదు…
తాను దేనికీ భయపడేది లేదని ఆశన్న అన్నారు. పార్టీ ఎక్కడికి పిలిచినా వస్తానన్నారు. కోవర్టు అన్న మాటను వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నా అని చెప్పారు. నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నా అని అన్నారు. ప్రజలు తాము తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు చెప్పారు. పార్టీ నుంచి ఎవ్వరినీ బయటకు తీసుకు రావాలని తాము చూడటం లేదన్నారు. కామ్రేడ్స్ అందరినీ కాపాడుకోవాలన్నదే తమ ఉద్దేశ్యమని చెప్పారు.
లక్ష్యం కనిపిస్తే…
లక్ష్యం కనిపిస్తే ప్రాణాలను త్యాగం చేయవచ్చని ఆశన్న అన్నారు. అదే కనిపించనపుడు ఏం చేస్తామన్నారు. అందరూ చనిపోకూడదని అనుకున్నాం కాబట్టే లొంగుబాటు నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న కామ్రేడ్లలో చాలామంది అభిప్రాయం కూడా ఇదే అని చెప్పారు. అందరి అభిప్రాయాలు తీసుకుంటే మీకే తెలుస్తుందని పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ప్రజల కోసం పని చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ప్రజా పోరాటాల్లో పాలు పంచుకుంటామన్నారు. ప్రజాస్వామికవాదులు పలువురు సలహాలు, సూచనలు ఇస్తున్నారని, వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటామని చెప్పారు.
Also Read: Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?
