Street Dog Attacks: ఏడేళ్ల చిన్నారిపై విచక్షణారహితంగా దాడి
స్థానికుల స్పందనతో తప్పిన ప్రాణాపాయం
వరంగల్, స్వేచ్ఛ: గ్రేటర్ వరంగల్ వీధి కుక్కల స్వైర విహారం (Street Dog Attacks) చేస్తున్నాయి. వీధుల్లో నడవడానికి భయపడే పరిస్థితి దాపరించింది. హనుమకొండలోని న్యూశాయంపేటలో వీధి కుక్కలు శనివారం పగలే బీభత్సం సృష్టించాయి. ఏడేళ్ల వయసున్న శ్రీజ అనే బాలికపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా శునకాలు ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేశాయి. స్థానికులు గమనించి కుక్కలను తరమడంతో ప్రాణాపాయం తప్పింది. గాయపడ్డ బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీధి కుక్కల దాడి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గ్రేటర్ వరంగల్ అంతటా ఇది హాట్ టాఫిక్‌గా మారింది. గతంలో వీధి కుక్కల దాడిలో చిన్నారుల ప్రాణాలు పోయిన ఘటనలు ఉన్నా, డబ్ల్యూఏంసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీధి కుక్కలను నివారించడంలో మున్సిపల్ అధికారుల అలసత్వంపై స్థానికులు మండిపడుతున్నారు.
Read Also- Gummadi Narsaiah: నిజాయితీకి మారుపేరైన ఈ ఎమ్మెల్యే బయోపిక్ చేయడానికి తెలుగులో హీరోలే లేరా?
ప్రేమ విఫలం అయ్యిందని యువకుని ఆత్మహత్య
చెన్నారావుపేట, స్వేచ్ఛ: ప్రేమ విఫలం అయ్యిందనే మనోవేదనతో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ధర్మతండాకు చెందిన కుమారుడు మహేశ్ (21) అనే యువకుడు పురుగుల మందు తాగి చనిపోయాడు. ఎస్ఐ లక్ష్మణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం, అదే తండాకు చెందిన బోడ విజయ – మోహన్ దంపతుల కొడుకు మహేష్ డిగ్రీ చదువుతున్నాడు. రెండేళ్లుగా ఓ యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమ నచ్చని యువతి తల్లిదండ్రులు వేరే యువకుడితో వివాహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం మహేశ్‌కు తెలియడంతో తను ప్రేమించిన యువతితో వివాహం జరిగే అవకాశం లేదంటూ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నెల 23న రాత్రి సమయంలో తన సెల్ ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే చికిత్స కోసం నర్సంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Read Also Gummadi Narsaiah: నిజాయితీకి మారుపేరైన ఈ ఎమ్మెల్యే బయోపిక్ చేయడానికి తెలుగులో హీరోలే లేరా?
