Cyclone Montha: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను (Cyclone Montha) తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా అప్రమత్తం అవుతోంది. ఈ తీవ్ర తుపాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందంటూ ఐఎండీ అప్రమత్తం చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వంసన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన కాకినాడ జిల్లా కలెక్టర్౨తో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశారు.
కాకినాడ జిల్లాలో సముద్ర తీర ప్రాంతం ఉన్న తుని, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ నియోజక వర్గాలతోపాటు తాళ్లరేవు మండలంపైనా తుపాన్ ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసిన అంశంపై చర్చించారు. తుపానుపై ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. జిల్లా అంతటా తీరం వెంబడి గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉండేలా తగిన అన్ని చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌ను ఆదేశించారు. తుపాను షెల్టర్లలో ఆహారం, మెడిసిన్, పాలు వంటి నిత్యావసరాలు సిద్ధంగా ఉంచాలన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా అన్ని విభాగాలను సన్నద్ధం చేయాలని సూచించారు. రెవెన్యూ, అగ్రికల్చర్, ఇరిగేషన్, పోలీస్, అగ్నిమాపక శాఖలతో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
Read Also- Australia Cricketers: ఇండోర్‌లో షాకింగ్ ఘటన.. ఆసీస్ మహిళా క్రికెటర్లను అసభ్యకరంగా తాకిన ఆకతాయి
కోతకు గురయ్యే ప్రాంతాల్లో జర జాగ్రత్త
ఉప్పాడ సమీపంలో తీరం కోతకు గురయ్యే ముప్పు ఉంటుందని, ఈ ప్రాంతంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మత్స్యకారులను అప్రమత్తం చేయాలని సూచించారు. మరోవైపు, ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై కూడా ఆయన ఆరా తీశారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యానికి దగ్గరగా స్టోరేజీ పెరుగుతోందని, నీటిని వదిలేటప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సమాధానం ఇచ్చారు. వరద ముంపు పరిస్థితి వస్తే నీటిపారుదల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సూచించారు. పిఠాపురం, పెద్దాపురం నియోజక వర్గాల రైతులు, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుండాలని పేర్కొన్నారు. మొంథా తుపాను ప్రభావం కాకినాడ జిల్లాపై ఉంటుందని తెలిసిన నేపథ్యంలో అక్కడికి సిద్ధంగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పడంతో.. జిల్లా యంత్రాంగం మొత్తం సహాయక చర్యల సన్నద్ధతలో నిమగ్నమై ఉంటుందని, ఇలాంటి సమయంలో జిల్లా పర్యటన వద్దంటూ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సున్నితంగా సూచించారు.
భయపెడుతున్న మొంథా తుపాను
ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం వాయుగుండంగా నెమ్మదిగా కదులుతున్న తీరాన్ని దాటే సమయంలో బలపడి మొంథా తుపానుగా రూపాంతరం చెందనుంది. ఈ తీవ్ర తుపాను 28న (మంగళవారం) కాకినాడ సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ వెల్లడించారు. అక్టోబర్ 28న సాయంత్రం లేదా రాత్రి సమయంలో కాకినాడ సమీపంలో మచిలీపట్నం – కలింగపట్నం మధ్య తీరాన్ని తాకుతుందని వివరించింది. తీరం దాటే సమయంలో కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, గుంటూరు, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అప్రమత్తం చేసింది. దక్షిణ కోస్తా జిల్లాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుపాను ప్రభావంతో 27, 28 తేదీల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.
