Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సమీపిస్తున్న వేళ.. అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. తమ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా రాష్ట్ర మంత్రులు జూబ్లీహిల్స్ లో పర్యటిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్.. యూసఫ్ గూడా డివిజన్ లోని కృష్ణనగర్ బ్లాక్ – 3లో పర్యటించారు. నవీన్ కు మద్దతుగా డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు.
‘కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి’
మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన డోర్ టూ డోర్ ప్రచారం కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాల గురించి.. నియోజకవర్గ ప్రజలకు పొన్నం తెలియజేశారు. మహిళలు, వృద్ధులను అప్యాయంగా పలకరిస్తూ ఓటు అడిగారు. గత పదేళ్లలో జూబ్లీహిల్స్ నిర్లక్ష్యానికి గురైందని.. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని స్థానికులకు సూచించారు. జూబ్లీహిల్స్ లోని రోడ్లు, నాళాలు, మంచి నీటి సౌకర్యాలు అంతా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చాయని తెలియజేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా యూసుఫ్ గూడా డివిజన్ కృష్ణ నగర్ బ్లాక్ 3 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు గా ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకరయ్య గారు , సాట్ చైర్మన్ శివసేన రెడ్డి గారితో మరియు ఇతర ముఖ్య నేతలతో కలిసి డోర్ టూ డోర్ ప్రచారం చేయడం జరిగింది pic.twitter.com/81FyBjtIaC
— Ponnam Prabhakar (@Ponnam_INC) October 25, 2025
కేసీఆర్ మాటలు.. నవీన్‌కు ఆశీర్వాదాలు
డోర్ టూ డోర్ ప్రచారం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాటలు నవీన్ యాదవ్ కు ఆశీర్వాదాలని పేర్కొన్నారు. ‘గత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అంటే జూబ్లీహిల్స్ ప్రజలకు భయం ఉండేదని అన్నారు. ఆయన ఇక్కడి ప్రజలపై ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టించారో ప్రతీ ఒక్కరికి తెలుసని చెప్పారు. ‘గత ప్రభుత్వం ఒక డబుల్ బెడ్ రూం ఇవ్వలేదు. మాగంటి గోపినాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే గా ఉన్నా.. ఇక్కడ తాగు నీటి సమస్య అలాగే ఉంది. మళ్ళీ సెంటిమెంట్ తో ఓటు అడుగుతున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు’ అని అన్నారు.
Also Read: Kurnool Bus Accident: బస్సు ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. తెరపైకి 400 మెుబైల్స్.. ఒక్కసారిగా బ్యాటరీలు బ్లాస్ట్!
‘డ్రైనేజీ సమస్యకు చెక్’
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జూబ్లీహిల్స్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించిందని పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు. ’10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మేము రేషన్ కార్డులు ఇచ్చాం. సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం.. ఉద్యోగాల భర్తీ చేశాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 కి గ్యాస్ అందిస్తున్నాం. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కూర్చోలేని మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారా?’ అంటూ కేసీఆర్ ను పొన్నం ప్రశ్నించారు. ‘జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే. నవీన్ యాదవ్ భారీ మెజార్టీ తో గెలుస్తున్నారు. నవీన్ యాదవ్ పక్కా లోకల్. నిత్యం ప్రజల్లో ఉండే నవీన్ కు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించండి’ అని ఓటర్లకు పొన్నం పిలుపునిచ్చారు.
